సేవలు అధికం.. ఫలితం మితం | ANM's strike | Sakshi
Sakshi News home page

సేవలు అధికం.. ఫలితం మితం

Published Thu, Aug 18 2016 8:27 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

నిరసన తెలుపుతున్న ఏఎన్‌ఎంలు

నిరసన తెలుపుతున్న ఏఎన్‌ఎంలు

  • సెకండ్‌ ఏఎన్‌ఎంల పరిస్థితి అధ్వానం
  • ఉపకేంద్రాల్లో కుంటుపడుతున్న వైద్యసేవలు
  • 32 రోజులుగా  సమ్మె చేస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంలు
  • జోగిపేట: ఆరోగ్య శాఖలో వైద్య సేవలను మెరుగు పరిచేందుకు నియమితులైన సెకండ్‌ ఏఎన్‌ఎంలకు ఉద్యోగ భద్రత కరువైంది. 9 సంవత్సరాల క్రితం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం స్కీం కింద నియమితులైన సెకండ్‌ ఏఎన్‌ఎంలు రెగ్యులర్‌ వాళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. చాలీచాలని వేతనాలు, ఇతర సదుపాయాలు లేక వెట్టిచాకిరీ చేయాల్సి వస్తోందని సెకండ్‌ ఏఎన్‌ఎంలు ఆవేదన చెందుతున్నారు.

    ఆవాస కేంద్రాల ద్వారా సేవలిందించాల్సిన వీరే గదులకు అద్దె చెల్లించాలి. రవాణా, భోజన సదుపాయం. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం లేదు.   ప్రసూతి సెలవులు కూడా వీరికి ఇవ్వడం లేదు. మొదటి ఏఎన్‌ఎంలు లేని చోట సెకండ్‌ ఏఎన్‌ఎంలే ఇద్దరి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఒక రోజు సెలవు తీసుకున్నా వేతనంలో కోత పడాల్సిందే.

    ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని కేంద్రాల్లో పని చేస్తున్నా తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సెకండ్‌ ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని 32 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

    వీరు నిర్వహించే విధులు
    మాతాశిశు సంరక్షణ, అన్ని రకాల వ్యాధి నిరోధకశక్తి టీకాలు, బీసీజీ, ఓఓపీవీ, పెంటావాలెంట్, మిజిల్స్, విటమిన్‌ ఏ, టీటీ ఇవ్వడం, మహిళ గర్భవతి అయినప్పటి నుంచి డెలవరీ అయ్యే వరకు సేవలు అందించడం, గర్భవతుల పేర్ల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి డెలివరీ కోసం గర్భిణులను చేర్చడం, టీబీగ్రస్తుల ఇంటికి వెళ్లి మందులు పంపిణీ చేయడం, బీపీ, షుగర్‌ టెస్టులు చేయడం, 104, 108 సేవలు, డీపీఎల్‌ క్యాంపుల్లో సేవలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, బుధవారం, శనివారం వ్యాక్సిన్లు ఇవ్వడం వంటి సేవలను అందిస్తున్నారు.

    సర్వీసును క్రమబద్ధీకరించాలి
    సెకండ్‌ ఏఎన్‌ఎంలుగా పని చేస్తున్న మా ధీన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసువాలి. మా సర్వీసు క్రమబద్ధీకరించాలి. రాత్రి, పగలు పని చేస్తున్నాం. ఊరూరా తిరుగతూ పిల్లలకు టీకాలు ఇస్తున్నాం. ఖర్చలను తామే భరించాల్సి వస్తుంది. మాకిచ్చే రూ.10 వేల జీతంలో ఖర్చులు పోను మిగిలిన దానిలో జీవనం సాగించడం కష్టతరంగా మారుతోంది. - అనసూయ, సెకండ్‌ ఏఎన్‌ఎం

    కనీస వేతనం అందించాలి
    సెకండ్‌ ఏఎన్‌ఎం పోస్టులను రెగ్యులరైజ్‌ చేయాలి. పదో పీఆర్సీ ప్రకారం వేతనం రూ.21,300 ఇవ్వాలి. విధి నిర్వహణలో సెకండ్‌ ఏఎన్‌ఎంలు అకాల మరణం చెందితే రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం మాకు కనీసం రవాణా చార్జీలు కూడా చెల్లించడం లేదు. ఉద్యోగ భద్రత కల్పించాలి. అన్ని రకరాల సదుపాయాలు అందించాలి. - వనిత, సెకండ్‌ ఏఎన్‌ఎం

    పీఎఫ్‌ సదుపాయం కల్పించాలి
    మొదటి ఏఎన్‌ఎంలతో సమానంగా విధులు నిర్వహిస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంల సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు. వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు. హెచ్‌ఆర్‌ఏ, టీఏ సదుపాయాలు కల్పించాలి. 32 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. - మొగులయ్య, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement