యువకుడి దారుణ హత్య | Brutal murder of the young man | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Published Fri, May 29 2015 11:44 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Brutal murder of the young man

జోగిపేట: జోగిపేట పట్టణంలో యువకుడి హత్య సంచలనం రేపింది. పడుకున్న చోటే మెడపై అతి కిరాతకంగా నరికిన సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు ఇలా... పట్టణంలోని 13వ వార్డు పరిధిలో నర్రా ఆంజనేయులు (30) అనే యువకుడు భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. హమాలీ పని చేసుకుంటూనే కొంత భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. గురువారం పట్టణానికి చెందిన పరిచయస్తుల పెళ్లికి వెళ్లి వచ్చినట్టు సమాచారం. ఆ తరువాత పశువులకు మేతను వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రాత్రి ఇంటి ముందు పడుకుని ఉన్నాడు. తెల్లారే సరికి రక్తపు మడుగులో విగజ జీవిగా ఉన్న భర్తను చూసి అతని భార్య అనిత బిగ్గరగా కేకలు వేసింది.
 
 స్థానికులంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నాగయ్య, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు సంఘటన స్థలానికి చేరుకొని సమాచారాన్ని సేకరించారు. వేకువ జామున తన భర్త బాగానే ఉన్నాడని భార్య చెబుతున్నట్టు తెలిసింది. ఆ తరువాతే ఈ దారుణం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు బలమైన ఆయుధంతో మెడపై బలంగా నరికినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికుందని వారు ఆరా తీస్తున్నారు. ఆంజనేయులు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
 
 వీధుల్లో తిరిగిన జాగిలం
 జిల్లా కేంద్రం నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ బృందం ఘటన స్థలం వద్ద తనిఖీలు చేపట్టింది. ముందుగా ఘటన స్థలం వద్దకు తీసుకువెళ్లిన తర్వాత జాగిలం వీధుల్లో నుంచి సాయిబాబా ఆలయం వరకు మధ్యలో ఇద్దరి ఇళ్ల వద్ద కొద్దిసేపు ఆగిందని, తర్వాత కల్లు దుకాణం వద్దకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.
 
 హత్య కేసును ఛేదిస్తాం: సీఐ నాగయ్య
 జోగిపేట పట్టణంలో సంచలనం సృష్టించిన ఆంజనేయులు హత్య కేసును తొందరలోనే ఛేదిస్తామని జోగిపేట సీఐ నాగయ్య తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరికి మించి వ్యక్తులు పాల్గొని ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను తప్పనిసరిగా పట్టుకుంటామన్నారు. జాగిలాలు తిరిగిన ప్రాంతాలపై నిఘా వేసి ఉంచినట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement