పుర ఫలితం నేడే | today municipal elections results | Sakshi
Sakshi News home page

పుర ఫలితం నేడే

Published Mon, May 12 2014 1:13 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

today municipal elections results

 సాక్షి, ఖమ్మం: పుర పోరులో విజేతలెవరు.. పరాజితులెవరో మరి కొద్ది గంటల్లో బయటపడనుంది. సుమారు నెల పదిహేను రోజులుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఈ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పుతో గంటల వ్యవధిలోనే చైర్మన్ పీఠం కూడా ఎవరికి దక్కనుందో తేలనుంది. సోమవారం ఈ ఓట్ల లెక్కింపునకు సంబంధించి కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలో మొత్తం 97 వార్డుల్లో 523 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సగటున 75.6 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,35,235 ఓట్లకు గాను 1,02,309 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కొత్తగూడెంలో 33 వార్డులకు 190 మంది, ఇల్లెందులో 24 వార్డులకు 173 మంది, మధిరిలో 20 వార్డులకు 86 మంది, సత్తుపల్లిలో 20 వార్డులకు 74మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఎవరికివారు తమదే విజయం అని ధీమాగా ఉన్నారు.

ఈ ఓట్ల లెక్కింపునకు కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలో 125 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం కొత్తగూడెంలో ఆరు టేబుళ్లు, ఇల్లెందులో నాలుగు టేబుళ్లు, మధిరలో ఐదు, సత్తుపల్లిలో నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రతి చోట నాలుగు లేదా ఐదు రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల్లోపు అన్ని చోట్లా కౌంటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది.

 నువ్వా..నేనా..?
 కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లో చైర్మన్ పీఠం కోసం ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈ నాలుగు చోట్ల చైర్మన్ అభ్యర్థులుగా వార్డుల్లో బరిలో ఉన్న వారిపైనే ఉత్కంఠ నెలకొంది. వీరు ఇక్కడ విజయం సాధిస్తేనే చైర్మన్ రేసులో ఉంటారు. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ, సీపీఐ కూటముల మధ్య పోటీ నెలకొంది. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా బీసీ మహిళకే రిజర్వు అయింది. ఇక్కడ చైర్‌పర్సన్ పీఠం కోసం కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ పోటీ పడతున్నాయి.

 కాంగ్రెస్ అభ్యర్థిగా 14వ వార్డులో బరిలో ఉన్న మడత రమ, వైఎస్సార్‌సీపీ నుంచి ఎండీ షంషాద్, టీడీపీ నుంచి 20వ వార్డులో బరిలో ఉన్న మడుగు వెంకటలక్ష్మి, 13వ వార్డు బరిలో ఉన్న చెరుపల్లి రాధిక పీఠం కోసం పోటీ పడుతున్నారు. బీసీ మహిళకు రిజర్వు అయిన సత్తుపల్లి నగర పంచాయతీపై జెండా ఎగుర వేసేందుకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థిగా తోట సుజలరాణి, టీడీపీ నుంచి కందిమళ్ల నాగేశ్వరమ్మ బరిలో ఉన్నారు. మధిర నగర పంచాయతీ చైర్మన్ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ చైర్‌పర్సన్ అభ్యర్థులుగా వైఎస్సార్‌సీపీ నుంచి 11వ వార్డు అభ్యర్థి మెండెం పుష్పలతను ఆపార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి 18వ వార్డు బరిలో ఉన్న సూదులగుంట వాణి, టీడీపీ నుంచి ఎర్రగుంట లక్ష్మీ రేసులో ఉన్నారు. ఇలా ప్రధాన పార్టీలు చైర్మన్ పీఠంపై కన్నేయడంతో .. అందరి చూపూ రేసులో ఉన్న ఈ అభ్యర్థుల వార్డులపైనే ఉంది.

 క్యాంపు రాజకీయాలకు మంతనాలు..
 పుర, పరిషత్ ఫలితాలు వెంటవెంటనే వెలువడుతుండడంతో క్యాంపు రాజకీయాలకు ఆయా పార్టీల నేతలు, చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. పుర ఫలితం వెలువడిన వెంటనే సాయంత్రం నుంచే తమ పార్టీల అభ్యర్థులను క్యాంపులకు తరలించాలని పార్టీ నేతలు యోచిస్తుండగా..ఈ ఖర్చు అంతా పెట్టుకోవడానికి చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థు రెడీ అంటున్నారు. అలాగే ఫలితాలు బేరీజు వేసుకొని ఒకటి రెండు వార్డులు తక్కువయితే స్వతంత్రులు ఎవరు గెలుస్తారని లెక్కలు వేస్తున్నారు. ఇలా గెలిచే అవకాశం ఉన్నవారితో ఇప్పటికే చైర్మన్ అభ్యర్థులుగా ఉన్నవారు మంతనాలు సాగించారు.

వారు విజయం సాధిస్తే వెంటనే క్యాంపులకు తరలించాలని, ఆలస్యమైతే ఇతర పార్టీలు ఎగురేసుకెళ్తాయని చైర్మన్ అభ్యర్థులు ముందే మేల్కొన్నారు. ఇక పరిషత్ ఫలితాలకు సంబంధించి మండల స్థాయిలో మండల పరిషత్ చైర్మన్‌ను కైవసం చేసకోవడం ఒక ఎత్తయితే.. జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం. ఈ ఫలితాలు వెలువడిన వెంటనే జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు క్యాంపు రాజకీయాల కోసం రూ.లక్షలు వెచ్చించడానికి కూడా వెనకాడడం లేదు. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొనడంతో..   ఇన్ని రోజులు క్యాంపు రాజకీయాలు తట్టుకోవడం ఎలా..? అని జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement