నేడే భవితవ్యం | The fate today | Sakshi
Sakshi News home page

నేడే భవితవ్యం

Published Wed, Mar 25 2015 3:35 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

The fate today

సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ వీడనుంది. ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది. తుది ఫలితాలు బుధవారం అర్ధరాత్రి వరకు వెల్లడికావచ్చని అధికారులు చెబుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితాలు తేలకుంటే ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 22న జరిగింది. మూడు జిల్లాల్లో కలిపి 2,81,138 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,53,220 మంది ఓటు హ క్కును వినిగియోంచుకున్నారు. ఈ ఎన్నికను బీ జేపీ, టీఆర్‌ఎస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించినందున ప్రాధాన్యత ఓటు క్రమంలో లెక్కింపు నిర్వహిస్తారు. ముందుగా 50 చొప్పున బ్యాలెట్ పత్రాలను కట్టలుగా కట్టి ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో లెక్కించనున్నారు. బ్యాలెట్ బాక్సుల్లోంచి ఓట్లను తీసి కట్టలుగా కట్టేందుకు కనీసం 10 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎన్నిల తుది ఫలితాలు వెల్లడయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు.
 
వాళ్లో 400.. వీళ్లో 300..
 కౌంటింగ్ కోసం మొత్తం 20 టే బుళ్లను ఏ ర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు రౌండ్‌కు 500 ఓట్లను లెక్కిస్తారు. అంటే ఒక్కో రౌండ్‌లో 1000 ఓట్లను లెక్కిస్తారన్నమాట. ఈ లెక్కన పోలైన ఓట్లన్నీ ప్రథమ ప్రాధాన్యత ఓటు లె క్కించేందుకు 16 రౌండ్లు అవసరం అవుతాయి. ఎన్నికల కౌంటింగ్ కోసం పెద్ద ఎత్తున సిబ్బం దిని వినియోగించుకుంటున్నారు. ప్రతి టేబుల్‌కు ఒకరు చొప్పున సూపర్‌వైజర్, ముగ్గురు సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తున్నారు. మొత్తం 20 టేబుళ్లకు 100 మంది ఒక్క షిఫ్టులో పనిచేస్తారు.

స్ట్రాంగ్‌రూంల నుంచి బ్యాలెట్ బాక్సులు తెచ్చే సిబ్బంది, డ్రమ్ము ఇన్‌చార్జీలు, ఇతర సహాయకులు కలిసి రెండు షిఫ్టుల్లో కలిసి 400 మంది సిబ్బందిని వినియోగించుకోనున్నారు. రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించాల్సి వస్తే 24 గంటల తర్వాత పని చేసేందుకు సిబ్బందిని నియమించుకున్నారు. కౌంటింగ్ కేంద్రానికి భద్రత కోసం సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌తోపాటు 300 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. మూడు జిల్లాల్లో కలిపి 1,53,220 ఓట్లు పోలయ్యాయి. మొదట చెల్లని ఓట్లు, నోటా ఓట్లు లెక్కిస్తారు. వీటిని కౌంటింగ్ నుంచి తొలగిస్తారు. మిగిలిన ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలలో గెలుపొందాలంటే.. చెల్లిన ఓట్లలో 50 శాతం కన్నా ఒక ఓటు అదనంగా రావాల్సి ఉంటుంది. చెల్లని ఓట్లు, నోటా ఓట్లు తేలిన తర్వాతే ఓ అభ్యర్థి విజేతగా నిలవాలంటే ఎన్ని ఓట్లు రావాలనేది తేలనుంది.
 
విజేత తేలకపోతే..
ప్రథమ ప్రాధాన్యత ఓటుతో విజేత నిర్ధారణ కాని పక్షంలో రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత.. ఇలా విజేత తేలేంత వరకు ప్రాధాన్యత క్రమంలో ఓట్లను లెక్కిస్తారు. ప్రథమ ప్రాధాన్యత ఓటుతో విజేత నిర్ణయం కాకపోతే.. కౌంటింగ్‌లో 22 మందిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్(తొలగిస్తూపోతారు) చేస్తారు. ఇలా తొలగించిన అభ్యర్థికి పోలైన ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి వచ్చిందనేది లెక్కిస్తారు. ఇలా లెక్కించిన వాటిని మిగిలిన అభ్యర్థులకు వచ్చిన మొదటి ప్రాధాన్యతలో వచ్చిన ఓట్లకు కలుపుతారు.

22వ అభ్యర్థిని తొలగించిన ఓట్ల ఆధారంగా విజేత తేలకపోతే.. 21వ స్థానంలో ఉన్న అభ్యర్థి ఓట్లు.. అప్పటికీ తేలకపోతే 20వ స్థానంలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్థి.. అప్పటికీ కాకపోతే 19వ స్థానంలో ఉన్న అభ్యర్థి.. ఇలా అవసరం మేరకు మొదటి స్థానంలో వచ్చిన అభ్యర్థి వరకు లెక్కిస్తారు. అప్పటికి కూడా విజేత తేలని పక్షంలో 22వ స్థానం సాధించిన అభ్యర్థికి వచ్చిన ప్రథమ ప్రాధాన్య ఓట్లలో తృతీయ ప్రాధాన్యత ఓట్లు పంచుతారు. అలా విజేత తేలేంతవరకు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు లెక్కించి సరిపడినన్ని ఓట్లు తొలుత సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement