మొత్తం పోలైన ఓట్లు 1,11,766, బరిలో ఉన్న అభ్యర్థులు 31 మంది, ఏర్పాటు చేసిన టేబుళ్లు 28, కౌంటింగ్ ఉ: 8 గంటల నుంచి, స్థలం: చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్
సాక్షి, సిటీబ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 22న నిర్వహించిన సంగతి తెలిసిందే. బుధవారం వెలువడనున్న ఈ ఫలితాల కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో పాటు నగర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం తమ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా అధికార టీఆర్‌ఎస్ భావిస్తుండగా... ప్రభుత్వ తీరుపై ప్రజల వ్యతిరేకత కు ఫలితాలు దర్పణంగా నిలుస్తాయని ప్రతిపక్షాలు.. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు ఆశిస్తున్నాయి.
తమ విజయం ఖాయమని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతుండగా... తమకే అనుకూలమని బీజేపీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక దాదాపు తొమ్మిది నెలలకు జరిగిన ఈ ఎన్నికలు ప్రభుత్వ తీరుపై ప్రజల అభిప్రాయానికి అద్దం పడతాయని అధిక శాతం భావిస్తున్నారు. మొత్తం 1,11,766 మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని బ్యాలెట్లలో నిక్షిప్తం చేశారు. లె క్కింపు ఆలస్యమైనా...బుధవారం రాత్రిలోగా ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 435 పోలింగ్ కేంద్రాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నారు. బరిలో 31 మంది అభ్యర్థులు ఉన్నారు. 32వ అంశంగా నోటా ఓటుంది.
లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బుధవా రం ఉదయం ఆరు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
మద్యం అమ్మకాలపై నిషేధం
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా సైబరాబాద్, నగర పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. వైన్‌షాప్‌లు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ చేయాలని జంట పోలీసు కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
టిక్..టిక్..టిక్..
Published Wed, Mar 25 2015 2:30 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement