- మునిసిపాలిటీ, నగర పంచాయతీ చైర్‌పర్సన్ల ఎంపికపై లాబీయింగ్
- గెలిచే అవకాశాలున్న స్వతంత్రులతో బేరసారాలు
- నర్సంపేట మినహా.. ఎక్కడా పోటీ ఇవ్వని టీడీపీ
హన్మకొండ, న్యూస్‌లైన్ : పుర పోరు ముగిసి.. ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతుండటంతో చైర్‌పర్సన్ ఎంపికపై పార్టీల నేతలు దృష్టి పెట్టారు. ఇందుకోసం ఇప్పటి నుంచే లాబీయింగ్ మొదలైంది. జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీల్లో మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ప్రచార సమయంలోనే ప్రధాన పార్టీలన్నీ తమ తరఫున చైర్‌పర్సన్, చైర్మన్‌గిరి అభ్యర్థులను ప్రకటించుకున్నాయి.
జనగామ చైర్‌పర్సన్ జనరల్ మహిళకు రిజర్వు కాగా, మహబూబాబాద్ ఎస్టీ మహిళకు కేటాయించారు. భూపాలపల్లి నగర పంచాయతీ స్థానం ఎస్సీ జనరల్‌కు, పరకాల ఎస్సీ జనరల్, నర్సంపేట బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగినా.. ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యనే జరిగింది. ఈ రెండు పార్టీలే ఆయా వార్డుల్లో అభ్యర్థులను రంగంలోకి దింపారు. టీడీపీ మాత్రం నర్సంపేట మినహా.. ఒక్కచోట కూడా చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు. చాలా వార్డుల్లో అభ్యర్థులనే పోటీకి దింపలేదు. దీంతో పురపాలకాల్లో జెండా ఎగురవేసే అవకాశం టీడీపీకి అసలే లేదు.
స్వతంత్రుల మద్దతు అనివార్యం..
జనగామ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి వెన్నం శ్రీలతను టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. ఇక్కడి 16వ వార్డు నుంచి శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈసారి ఎలాగైనా ఆమెను చైర్‌పర్సన్‌గా చేసేందుకు పొన్నాల స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన వారి మద్దతు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారితో మంతనాలు జరుపుతున్నారు. పూర్తిస్థాయి మద్దతు వచ్చే అవకాశం లేకపోవడంతో.. స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతు అనివార్యంగా మారింది. టీఆర్‌ఎస్‌కు పరిస్థితి ఇలానే ఉంది. 7వ వార్డు నుంచి పోటీ చేసిన గాడిపెల్లి ప్రేమలతారెడ్డిని టీఆర్‌ఎస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించింది. గట్టిపోటీనే ఉంది. ఈ పార్టీకి చైర్‌పర్సన్ పీఠం దక్కాలంటే స్వతంత్రుల మద్దతు తప్పనిసరి అనే ప్రచారం జరుగుతోంది.
‘మానుకోట’లో మద్దతు లాభించేనా..?
మహబూబాబాద్‌లో చైర్‌పర్సన్ పీఠం కోసమే టీఆర్‌ఎస్.. సీపీఐతో దోస్తీ చేసింది. కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ పెట్టింది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున భూక్యా ఉమా మురళీనాయక్, టీఆర్‌ఎస్ నుంచి అనితా నెహ్రూనాయక్‌ను ప్రకటించారు. అయితే ఇక్కడ ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజార్టీ రాకుండా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీపీఐ, టీడీపీ మూడేసి స్థానాల్లో గట్టిపోటీనివ్వడంతో.. ఈ ఆరింటా వారు గెలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీపీఐ, టీడీపీలు ఇక్కడ టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చే అవకాశం ఉంది. అయితే స్వతంత్రులు కూడా కొన్నిస్థానాల్లో గట్టిపోటీనివ్వడంతో.. వారి మద్దతు కోసం మంతనాలు జరుపుతున్నారు.
పరకాలలో పోటాపోటీ
పరకాలలో చైర్మన్ పీఠానికి పోటాపోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బొచ్చు వినయ్, దుబాసి వెంకటస్వామి, క రుణశ్రీ, కరుణ పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్ నుంచి బొ చ్చు కృష్ణారావు, మడికొండ సంపత్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ పార్టీలు మాత్రం ఇంకా ఎవరికీ చైర్మ న్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. ఆశావహులు మాత్రం తమకే పీఠమంటూ అధినేతల వద్దకు క్యూ కడుతున్నారు.
ఆశలు ఫలించేనా..?
నర్సంపేట నగర పంచాయతీకి కూడా ఆశావహులు తీవ్రంగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కచోట మాత్రం టీడీపీ చైర్మన్ పీఠంపై కొంత ఆశ పెట్టుకుంది. ఆ పార్టీ నుంచి వేవుుల బొందయ్యుగౌడ్, పెండెం ఆనంద్, కాంగ్రెస్ నుంచి పాలారుు శ్రీనివాస్, పాలెల్లి రాంచంద్రయ్యు, రుద్ర ఓంప్రకాశ్, నాగెల్లి వెంకటనారాయుణగౌడ్, టీఆర్‌ఎస్ నుంచి కావుగోని శ్రీనివాస్, గోనెల రవీందర్, నారుుని నర్సయ్యు, గుంటి కిషన్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక్కడ ఆశావహులు తమకు మద్దతివ్వాలంటూ గెలిచే అభ్యర్థులను ఇప్పటి నుంచే వేడుకుంటున్నారు.
భూపాలపల్లి ఎవరికో..?
భూపాలపల్లి చైర్మన్ పీఠం కోసం టీఆర్‌ఎస్‌లో పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్.. సీపీఐతో జత కట్టింది. అయితే టీఆర్‌ఎస్ హోరాహోరీ పోటీనివ్వడంతో.. చైర్మన్ పీఠంపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ నుంచి చల్లూరి సమ్మయ్య తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సమ్మయ్యను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. టీఆర్‌ఎస్ నుంచి బి.రవి, జోగు సమ్మయ్య, కొక్కరి చిన్న రాజయ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
మీ ఖర్చులిస్తాం..
చైర్మన్ పీఠం కోసం కన్నేసిన వారంతా ఇప్పుడు కౌన్సిలర్లుగా గెలిచే వారితో బేరసారాలకు దిగుతున్నారు. పార్టీలను పక్కనపెట్టి.. తమకు మద్దతునివ్వాలంటూ వారిని మెప్పించుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులన్నీ తిరిగి ఇస్తామని, నిధుల్లో ప్రాధాన్యం ఇస్తామంటూ బుజ్జగిస్తున్నారు. స్థానికంగా పార్టీల విషయాలను పక్కన పెట్టుకుందామని, చైర్మన్ పీఠం కోసం కలిసిపోదామంటూ బతిమిలాడుతున్నారు.