మెజారిటీపై ఎమ్మెల్యేల లెక్కలు
గెలుపు ధీమాతో ప్రతిపక్ష నేతలు
పెరిగిన పోలింగ్‌తో ఎవరికి లాభమో..
వరంగల్ : వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక ఫలితం మంగళవారం తేలనుంది. ఓట్ల లెక్కింపు కొన్ని గంటల్లో మొదలుకానుంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నిక కావడంతో ఈ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గెలుపోటములు, ఓటింగ్ శాతం తీరు ఎలా ఉంటుందనే విషయంపై రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికలప్పుడు వచ్చిన మెజారిటీ వస్తుందా.. లేదా అనే అంశంపై ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు. ఉప ఎన్నికలో వచ్చే తీర్పుతో ప్రస్తుత ఎమ్మెల్యేల పరిపాలన తీరు తెలిసిపోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. కానీ, వరంగల్ ఉప ఎన్నికలో మాత్రం ఊహించినదాని కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం పెరగడం.. ఏ రాజకీయ పార్టీకి బలం చేకూరుతుంది, ఏ పార్టీకి నష్టం కలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అరుుతే, ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని, సాధారణ ఎన్నికల్లో కంటే మెజారిటీ తగ్గినా స్పష్టమైన ఆధిక్యత ఉంటుందని అధికార టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో తమకు ఆధిక్యం వస్తుందని అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోనూ గెలుపు ఆశలు కనిపిస్తున్నాయి.
సాధారణ ఎన్నికల్లో కంటే తమకు పరిస్థితులు మెరుగయ్యాయని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు ఓటింగ్ మారిందని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ నేతలు అధికార దుర్వినియోగం చేశారని, ప్రజలు తమకే మద్దతు తెలిపారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సాధారణ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం భూపాలపల్లి, పరకాలలో తమకు ఓట్లు పెరిగాయని చెబుతున్నారు. ఇక, వరంగల్ ఉప ఎన్నికలో మొదటిసారి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ ఓటింగ్ తీరుపై ఆశాభావంతో ఉంది. ఓటర్లు తమ పార్టీకి మద్దతు తెలిపారని భావిస్తోంది. ఎన్డీయే నేతలు సైతం ఉప ఎన్నిక ఫలితంపై ఆశావాహ ధృక్పథంతో ఉన్నారు. గతంలో కంటే తమకు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, ఉప ఎన్నిక ఫలితంతో ఇది స్పష్టమవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. పాలకుర్తి, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో తమ పార్టీకి బలం పెరిగిందని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. వామపక్ష కూటమి సైతం ఓటింగ్ శాతంపై ధీమాతో ఉంది. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత.. ఓటింగ్ శాతంలో తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. రాజకీయ పార్టీల అంచనాలు ఇలా ఉండగా.. తుది ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.
గత ఎన్నికలో ఓట్లు ఇలా...
2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ లో 12,69,008 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి 6,95,918 (54.83 శాతం) ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు 3,02,981 (23.87 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన రామగల్ల పరమేశ్వర్‌కు 2,06,200 (16.24 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 3,92,137 (30.90 శాతం) ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యపై విజయం సాధించారు.
ఎక్కడ.. ఎవరికి
Published Tue, Nov 24 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM
Advertisement
Advertisement