తెలంగాణలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్‌’.. ఆ రెండు స్థానాలపై స్పెషల్‌ ఫోకస్‌! | Sakshi
Sakshi News home page

తెలంగాణలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్‌’.. ఆ రెండు స్థానాలపై స్పెషల్‌ ఫోకస్‌!

Published Sun, Apr 28 2024 11:06 AM

BRS Congress BJP Parties focus on warangal parliament seats huge campaign

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై అన్ని ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. వరంగల్‌, మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. అన్ని పార్టీలు ప్రచారంలో ఆరాటం,ఆర్భాటం, పోరాటం ప్రదర్శిస్తున్నాయి. గతంలో ఇప్పుడు లేని విధంగా వరంగల్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ప్రచారానికి తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నాయి. 

కాంగ్రెస్ తరపున ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబాద్‌, వరంగల్‌ బహిరంగ సభలో పాల్గొనగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను, మంత్రులను, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన లీడర్లను ప్రచారంలోకి దింపుతున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కాజీపేట వరంగల్ హనుమకొండలో రోడ్ షోలో పాల్గొనున్నారు. దీంతో వరంగల్లో టిఆర్ఎస్‌లో జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

ఇప్పటికే  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీమంత్రి హరీశ్ రావులు సైతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్‌లో కేటీఆర్ పర్యటన పూర్తి కాగా, పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సన్నాహాక సమావేశంలో హరీశ్రావు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

వరంగల్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పర్యటన వరంగల్‌, హనుమకొండ పట్టణాల్లో జరిగే కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడోషోకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారు కాగా హన్మకొండ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు వినయ్‌భాస్కర్‌, మాజీమంత్రి దయాకర్‌రావు ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించారు.మే 1న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలో పాల్గొన్న అనంతరం మానుకోట జిల్లా కేంద్రంలోనే బస చేయనున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మానుకోట, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభల్లో పాల్గొని పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు, శ్రేణులకు సందేశమిస్తూనే కాంగ్రెస్ పార్టీ విధానాలను, ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలకు ముఖ్యమంత్రి వివరించారు. ఈనెల 30 భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో నిర్వహించే కాంగ్రెస్ జన జాతర సభకు హాజరుకానున్నారు. వరంగల్ పార్లమెంటరీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్న రెండో బహిరంగ సభ కావడం గమనార్హం. 

ఇప్పటి వరకు ఒకే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండో బహిరంగ సభ జరగలేదు. వరంగల్ లోక్‌సభ పరిధిలోనే నిర్వహిస్తున్న రెండో సభకు సీఎం హాజరవుతుండటం విశేషం. 30వ తేదీన రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ గెలిపించాలని కోరుతూ.. మే 3న హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ శివారులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. నరేంద్ర మోదీతో పాటు జాతీయ స్థాయి నేతలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. వరంగల్ లోక్‌సభ సీటుపై కన్నేసిన బీజేపీ ఈస్థానంలో గెలుపునకు అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వాసంతో ఉంది.

ఆరూరి రమేష్ నామినేషన్‌కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరుకాగా, నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిశాక బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్లకు ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29న ముగియనుండటంతో బరిలో ఎంతమంది అభ్యర్థులు నిలచేది..? ఎవరెవరు అభ్యర్థులుగా మిగలబోతున్నారు..? అభ్యర్థుల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేది క్లారిటీ రానుంది. మే 1 నుంచి సరిగ్గా పదకొండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం జోరుగా సాగనుంది.

Advertisement
Advertisement