ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు
నల్లగొండ జిల్లాలో ముగ్గురు
మృతుల్లో ఇద్దరు మహిళలు
చిట్యాల/ హాలియా/కాసిపేట/చొప్పదండి/ములుగు/మహబూబాబాద్/వరంగల్/మునుగోడు: రాష్ట్రంలో వడదెబ్బకు గురై వేర్వేరు ప్రాంతాల్లో శుక్ర వారం ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. నల్లగొండ జిల్లాలోని అనుముల మండలంలోని కొత్తపల్లికి చెందిన బచ్చు ముకుందరెడ్డి(55) బైక్‌పై వ్యవసాయ పనిముట్ల కోసం ఉదయం నల్ల గొండ పట్టణానికి వెళ్లి పనిచూసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యాడు.
చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఇదే జిల్లాలో ఏపీలోని పశి్చమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన కర్రి రాజు(40), భార్య దీనమ్మ తమ ముగ్గురు పిల్లలతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నం నల్లగొండ జిల్లా చిట్యాల బస్టాండ్‌లో రామన్నపేటకు వెళ్లేందుకు రాజు బస్సుకోసం ఎదురుచూస్తుండగా వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు
ఇదే జిల్లాకు చెందిన మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన కమ్మలపల్లి మమత (28) ఉపాధి పనుల నిమిత్తం కూలీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే తోటి కూలీలు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది.
మంచినీళ్ల కోసమని కిందికి దిగి...
కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని బసంత్ నగర్‌లో నివాసం ఉండే మధ్యప్రదేశ్‌కు చెందిన జాకీర్ హు స్సేన్(60) అనే లారీ డ్రైవర్ చొప్పదండికి సిమెంట్ లోడ్‌తో వచ్చాడు. ప్రధాన రహదారిపై ఓ హోటల్ సమీపంలో లారీని ఆపి మంచినీళ్ల కోసమని కిందికి దిగాడు. ఈ క్రమంలో అతడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే 108 సిబ్బందికి స్థానికులు సమాచారం అందించగా వారు వచ్చి హుస్సేన్‌ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఇక మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీ దుర్గం భీమయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు...
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన జన్ను ఎల్లమ్మ (50), ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన దామెర రాంబాబు(48) వడదెబ్బకు గురై మృతి చెందారు. అదేవిధంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య(74) రోజువారీగా పందులు మేపడానికి వెళ్లి ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment