వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ సత్తా చాటనుంది. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారానికి పార్లమెంట్
పార్టీ అధినేత జగన్ ప్రచారంతో పెరిగిన బలం
మహానేత జ్ఞాపకాల్లో పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలు
వరంగల్ : వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ సత్తా చాటనుంది. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారానికి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి స్పందన వచ్చింది. జగన్ ఈనెల 16 నుంచి 19 వరకు నాలుగు రోజులు ప్రచారం నిర్వహించారు. ఈ సెగ్మెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో వైఎస్సార్ సీపీ కొత్త ఉత్సాహం వచ్చింది. మహానేత వైఎస్ పథకాలు మరవని ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. సభల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు ప్రస్తావించినప్పుడల్లా జనం కేరింతలు కొట్టారు.
ఉప ఎన్నికలో తమకు తిరుగుండదని భావించిన రాజకీయ పార్టీలు.. జగన్ సభలకు వచ్చిన ప్రజా స్పందన చూసి డోలాయమానంలో పడ్డాయి. హామీల అమలులో అధికార పార్టీ తీరుపై జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. హన్మకొండలో నిర్వహించిన బహిరంగసభకు భారీ సంఖ్యలో జనం హాజరు కావడం, టీఆర్‌ఎస్‌కు ఊపునిచ్చిన జిల్లాలో జగన్‌కు లభించిన ఆదరణ చూస్తే భవిష్యత్‌లో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.