నామినేషన్లు 38
ఉప ఎన్నికకు ముగిసిన తొలి ఘట్టం
హన్మకొండ అర్బన్: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 38 నామినేషన్లు దాఖలయ్యూరుు. బుధవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ప్రధానపార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు సభలు, ర్యాలీలతో హోరెత్తించారు. అభ్యర్థులంతా మధ్యాహ్నం తరువాత ఎన్నికల అధికారి కార్యాలయానికి రావడంతో అధికారులు అభ్యర్థులకు నెంబర్లు వేసిన చీటీలు అందజేశారు. మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సమయం పూర్తయిన తరువాత కార్యాలయంలో సుమారు 15మంది వరకు అభ్యర్థులు వెయిటింగ్‌లో ఉన్నారు.
దీంతో అందరి పత్రాలు ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ రాత్రి 7గంటల వరకు తీసుకున్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు అట్టహాసంగా వస్తే.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ సాదాసీదాగా పార్టీ ప్రముఖులతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నామినేషన్ అందజేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్ బహిరంగ సభ అనంతరం తన రెండవ సెట్ నామినేష్ పత్రాలు అందజేశారు. మంగళశారం నాటికి ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. చివరి రోజు బుధవారం 32మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తం నామినేషన్ల సంఖ్య 38కు చేరింది.