సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మున్సిపల్ చైర్మన్ పీఠాలపై కన్నేసిన పార్టీలు గెలుపు గుర్రాలను బుట్టలో వేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన కౌన్సిలర్లను క్యాం పులకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయి. కొన్ని పార్టీలు నేరుగా ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచే కౌన్సిలర్లుగా గెలిచిన వారిని క్యాంపునకు తరలించాలని నిర్ణయించి నట్లు సమాచారం. అవసరమైతే అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకురాకుండానే క్యాంపునకు తరలించేందుకు మరికొన్ని పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో ఆరు మున్సిపాలిటీలకు మార్చి 30న పోలింగ్ జరిగింది. అన్ని పార్టీల అభ్యర్థు లు హోరాహోరీగా తలపడ్డారు. పెద్ద ఎత్తున
ప్రచారం నిర్వహించడమే కాకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం పంపిణీ చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే ఓట్ల లెక్కింపు జరగాలి. కానీ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం చూపే అవకాశాలున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ఈనెల 12కు వాయిదా పడింది. ఇప్పుడు ఓట్ల లెక్కింపు రోజు రావడంతో ఫలితాలపై అభ్యర్థులతోపాటు, రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఎంపీ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారమయ్యాకే చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. దీంతో చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ వెలువడి.. చైర్మన్ ఎన్నిక రోజు వరకు ఈ క్యాంపులు కొనసాగే అవకాశాలున్నాయి.
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే..
భైంసా మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలతోపాటు అక్కడ బలంగా ఉన్న ఎంఐఎం కూడా పూర్తి స్థానాల్లో పోటీ చేయలేదు. దీంతో ఈ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక రసకందాయంలో పడే అవకాశాలున్నాయి. చైర్మన్ స్థానం దక్కించుకోవాలంటే కనీసం 13 స్థానాలను కైవసం చేసుకోవాలి. కాగా ఈ బల్దియాలో ఎంఐఎం కీలకం కాబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిర్మల్ మున్సిపాలిటీలో 36 వార్డులున్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ దీటుగా బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐకేరెడ్డి తన అనుచరులను దాదాపు అన్ని వార్డుల్లో పోటీలో నిలిపారు. ప్రధాన పార్టీలకు దీటుగా, బీఏస్పీ కూడా క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవడంతో చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
బెల్లంపల్లి బల్దియా రాజకీయాలు కొంత భిన్నంగా ఉన్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల్లో చీలిక వచ్చింది. ఈ రెండు పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయాయి. చిలుముల శంకర్ అనుచరులు, మాజీ చైర్మన్ సూరిబాబు అనుచరులు వేర్వేరుగా క్యాంపులను నిర్వహించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌లో నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్, పట్టణాధ్యక్షులు సురేష్‌ల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. సీపీఐ కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేసింది.
కాగజ్‌నగర్‌లో 28 స్థానాలున్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వంటి ప్రధాన పార్టీలకు దీటుగా కోనేరు కోనప్ప తన అనుచరులను బీఎస్పీ తరుపున బరిలో దింపారు. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక రసకందాయంలో పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మంచిర్యాలలో మున్సిపాలిటీ పోరు హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులు దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేశారు. బీజేపీ, టీడీపీలు కొన్ని స్థానాల్లో పోటీకి పరిమితమైంది. ఇటీవల కాంగ్రెస్ మంచిర్యాలలో సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపుల వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో నేతలు ప్రకటించడం చర్చనీయంశంగా మారింది. అలాగే టీఆర్‌ఎస్ కూడా క్యాంపు నిర్వహించే అవకాశాలున్నాయి.
జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ మున్సిపాలిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో ఆదివారం డీసీసీ అధ్యక్షులు సీఆర్‌ఆర్ ఇంట్లో సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఇప్పటికే సమావేశం జరిగింది.
ఇటు నుంచి ఇటే!
Published Mon, May 12 2014 12:56 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM
Advertisement
Advertisement