చివరికైనా తీరు మారేనా..? | By changing the way ..? | Sakshi
Sakshi News home page

చివరికైనా తీరు మారేనా..?

Published Fri, May 16 2014 3:42 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

By changing the way ..?

  •      లెక్కింపు ప్రక్రియపై యంత్రాంగం నిర్లక్ష్యం
  •      అసలు సమయంలో  చేతులెత్తేస్తున్న అధికారులు
  •      పోలీసుల ఆంక్షలతో తప్పని ఇబ్బందులు
  •  హన్మకొండ, న్యూస్‌లైన్ : ఒక వైపు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ.. మరోవైపు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం వైఫల్యం.. ఇది చాలదన్నట్లు పోలీసుల ఆంక్షలు.. ఈనెల 12, 13 తేదీల్లో జరిగిన మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులతోపాటు ఏజెంట్లు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. ఈ రెండు రోజుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం నిర్వహించే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకైనా పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.
     
    వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ యార్డులో ఏర్పాటు కౌంటింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు జిల్లాలోని 12 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అధికారులు అనుకున్నట్టుగా అంతా సవ్యంగా ఉండి లెక్కింపు చేపడితే మధ్యాహ్నం 12 గంటల వరకే ఫలితాలు బయట పడతాయి.

    మొదటి 8 రౌండ్ల వరకే కొన్ని సెగ్మెంట్లలో గెలిచేదెవరనే విషయమై స్పష్టత రానుంది. మొత్తం 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే రెండు దఫాలుగా శిక్షణ నిచ్చారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి.. తర్వాత అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను బయటకు తీసి, సీళ్లు విప్పతారు.  
     
    నిర్లక్ష్యం వీడేనా..!


    ఎన్నికల నిర్వహణ ఎలా ఉన్నా.. అసలు సమయంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం బయటపడుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏర్పాట్ల విషయంలో చివరకు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.

    కౌంటింగ్ సిబ్బందికి కనీసం తాగునీరు ఏర్పాటు చేయకపోవడంపై ఉన్నతాధికారులతోనే వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేవు. భోజన ఏర్పాట్లల్లో సైతం అదే నిర్లక్ష్యం చోటుచేసుకుంది. పోలీసుల ఓవరాక్షన్ సరేసరి. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లను సైతం లోనికి పంపించేందుకు ఆటంకాలు కల్పించారు.

    ఈ నేపథ్యంలో శుక్రవారం సార్వత్రిక ఎన్నికల చివరి ఘట్టం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ఏనుమాముల మార్కెట్‌లో నిర్వహించే ఓట్ల లెక్కింపు నిమిత్తం ఇప్పటికే ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా, ఉన్నతాధికారులు లోనికి వెళ్లాల్సిన గేట్లను ప్రకటించారు. దీంతో వీరికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఒక దారి నుంచి వెళ్లాల్సిన వారు మరో దారి నుంచి వెళితే.. వారంతా మార్కెట్ చుట్టూ తిరగాల్సిందే. పోలీసులు తనిఖీలు నిర్వహించి, పాస్‌లు, గుర్తింపు కార్డులను పదేపదే పరిశీలించి లోనికి పంపిం స్తుంటంతో ఈసారి దారి తప్పితే గమ్యం వెతుక్కొవాల్సిన పరిస్థితి ఎదురుకానుంది.
     
    సిబ్బందికి తిప్పలు తప్పేనా..
     
    సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించడం వల్ల ఫలితాలు త్వరగానే వచ్చే అవకాశాలున్నా.. ఆయా సెగ్మెంట్ల ఆర్‌ఓలు ప్రకటించే వరకూ అధికారికంగా ఫలితం వెలువడదు. ఒక్కో టేబుట్ నుంచి రౌండ్ల వారీగా ఫలితాల సేకరణ ఇబ్బందిగా మారుతోంది. ప్రతీ టేబుల్ వద్ద ఒక్కో ఉద్యోగిని ఫలితం చెప్పేందుకే ఏర్పాటు చేయాలని ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది విన్నవించారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
     
    వసతులపై దృష్టి పెట్టాలి
     
    సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో జిల్లాలోని అన్ని సెగ్మెంట్ల నుంచి ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, అనుచరులు భారీగా కౌంటింగ్ కేంద్రం వద్దకు తరలివస్తారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం లోపలకు వచ్చి బయటకు వెళ్లాలన్నా.. మళ్లీ లోపలకు రావాలన్నా కష్టమే. యంత్రాంగం కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన వసతులు కల్పిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉండదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement