తొలి రౌండ్లలో తడబాటు చివరలో ఆకాశమే హద్దు
హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కారుకు ఎదురులేకుండా పోయింది. ప్రత్యర్థి పార్టీల కళ్లలో దుమ్ముకొడుతూ విజయపథంలో దూసుకుపోయింది. తొలిరౌండ్‌లో సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పోటీ ఇచ్చాయి. కానీ ఒక్కో రౌండు లెక్కింపు పూర్తవుతున్న కొద్దీ టీఆర్‌ఎస్ ప్రభంజనానికి హద్దు లేకుండా పోయింది. ఐదో రౌండ్ నుంచి ఎనిమిదో రౌండ్ వరకు స్వతంత్ర, కాంగ్రెస్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. 1 నుంచి ఎనిమిది రౌండ్లలో ప్రతీ రౌండ్‌కు ఆరు డివిజన్ల ఫలిలాలు వెల్లడించారు. తొమ్మిది, పది రౌండ్లలో మూడు డివిజన్లు, పదకొండు, పన్నెండు రౌండ్లలో రెండు డివిజన్ల వంతున ఫలితాలు వెల్లడించారు.
మొత్తం పన్నెండు రౌండ్ల పాటు లెక్కించగా టీఆర్‌ఎస్ పార్టీ ఐదు రౌండ్లలో ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. 2, 9, 10, 11, 12 రౌండ్లలో లెక్కించిన 14 డివిజన్లు టీఆర్‌ఎస్ వశమయ్యాయి. ఏనుమాముల మార్కెట్‌లో చేపట్టిన ఓట్ల లెక్కింపులో 5, 7 రౌండ్లలో టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఎదురైంది. ఈ రౌండు ఆరు డివిజన్ల వంతున లెక్కించగా టీఆర్‌ఎస్ పార్టీ ప్రతీ రౌండ్‌లో సగం డివిజన్లలో ఓటమి పాలైంది. ఐదో రౌండ్‌లో కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు చెరో స్థానంలో విజయం సాధించారు. ఏడో రౌండ్ జరిగిన లెక్కింపులో ఇద్దరు స్వతంత్రులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
మూడో రౌండ్ నుంచి ఎనిమిదో రౌండ్ వరకు ప్రధాన రాజకీయ పార్టీలను ఆశ్చర్యపరిచేలా స్వతంత్ర అభ్యర్థులు క్రమం తప్పకుండా విజయం సాధిస్తూ వచ్చారు. ఐదు, ఏడు రౌండ్లలో ఇద్దరు వంతున విజయం సాధించగా 3, 4, 5 రౌండ్లలో ఒక్కొక్కరు వంతున విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే తొలి రౌండ్‌లో సీపీఎం విజయం సాధించి సంచలనం సృష్టించింది. అనూహ్యమైన ఫలితాలు వస్తాయేమోననే సంకేతాలు పంపింది. కానీ సీపీఎం సంచలనం మొదటి రౌండ్‌కే పరిమితమైంది. మిగిలిన పదకొండు రౌండ్లలో ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. వర్థన్నపేట పరిధిలో 12 డివిజన్లలో ఆరింటిలో టీఆర్‌ఎస్ ఓడిపోయింది.
ఎదురులేని కారు
Published Thu, Mar 10 2016 1:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement