నేతలు అ‘టెన్షన్’ | today municipal elections results | Sakshi
Sakshi News home page

నేతలు అ‘టెన్షన్’

Published Mon, May 12 2014 1:45 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

today municipal elections results

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :  ఎన్నికల ఫలితాలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో ఒకటే ఆందోళన నెలకొంది. సోమవారం మున్సి‘పోల్’ ఫలితాలు వెలువడనుండడంతో వారిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో సుమారు 10 రోజుల పాటు నాయకులు విశ్రాంతి తీసుకున్నారు.

తాజాగా వెలువడనున్న ఫలితాలు వారిలో గుబులు రేపుతున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు సోమవారం జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ కళాశాల ఆవరణలో జరగనుంది. ఈనెల 13న జిల్లాలోని 36 జడ్పీటీసీ, 583 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 16వ తేదీన జిల్లాలోని రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఉంది. ఇలా వరుస ఎన్నికల ఫలితాల నేపథ్యంలో  ప్రధాన  పార్టీల అభ్యర్థులు, సీనియర్లలో ఉత్కం ఠ మొదలైంది.

 మున్సిపల్, జడ్పీ పీఠాలపై పార్టీల గురి...
 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజకీయ పదవులకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. త్వరలోనే కొత్త ప్రజాప్రతినిధులు కొలువు దీరనున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ స్థానాలకు వివిధ పార్టీల నుంచి పోటీచేసిన నేతల భవిష్యత్ తేలనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అగ్రనేతలు ఫలితాల విశ్లేషణలో తలమునకలై ఉన్నారు. సుమారుగా మూడున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పాగా వేయడమే ప్రధాన పార్టీల నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, బీజేపీ, సీపీఐ తదితర పార్టీలు ఈసారి మున్సిపల్, ‘స్థానిక’ ఎన్నికల్లో తలపడగా,  కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు మాత్రమే మేయర్, చైర్మన్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతుడండం విశేషం.

 జిల్లా కేంద్రంలో పార్టీల అగ్రనేతల మకాం
 మార్చి 5న ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే నెల 10న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మూడున్నరేళ్ల తర్వాత మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగ్గా, సార్వత్రిక ఎన్నికలు కూడా ముగిశాయి. మొత్తానికి మరో ఐదేళ్ల వరకు ఎన్నికల ఊసెత్తే అవకాశం లేకుండా ఎన్నికల పరంపర సాగింది. పీఠాలు సాధించి పట్టునిలుపుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

 సోమవారం నగర, పురపాలక, మంగళవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, క్యాంపు రాజకీయాలకు ఆయా పార్టీల సీనియర్ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఫలితాలు వెలువడటమే తడవు, మెజార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను తమ తమ శిబిరాలకు తరలించేందుకు ఇప్పటికే పక్కా వ్యూహం రూపొందించారు. జిల్లాలో జరిగిన వరుస ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే కాగా, తమ తమ ఇమేజ్‌తో ముడిపడిన ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే టెన్షన్ మాత్రం అగ్రనేతలను వీడటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement