The results of the election
-
ఫలితాలపై పోస్టుమార్టం
జహీరాబాద్, న్యూస్‌లైన్: జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకుంటున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం అనాదిగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగానే ఉంటూ వస్తోంది. అయినా ఈ ఎన్నికల్లో మాత్రం పార్టీ అభ్యర్థి జె.గీతారెడ్డి కేవలం 842 ఓట్ల మెజార్టీతో బయటపడి పరువు నిలుపుకుంది. నియోజకవర్గంలోని ఏయే మండలాల ప్రజలు తమకు అనుకూలంగా ఓటు వేశారు, ఏయే మండలాల్లో అనుకూలంగా ఓట్లు లభించలేదనే దానిపై ప్రధానంగా ఆయా పార్టీల అభ్యర్థులు లెక్కలు కడుతున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా తమకు పోలైన ఓట్ల లెక్కలు తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచినా, జహీరాబాద్ నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావు స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి జె.గీతారెడ్డి చేతిలో పరాజయం పాలు కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు నియోజకవర్గంలో జీరోగా ఉన్న టీఆర్ఎస్ ఒక్క సారిగా బలపడి కాంగ్రెస్ పార్టీకే సవాల్ విసిరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మండలాల వారీగా విశ్లేషిస్తే కోహీర్ మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావుకు కాంగ్రెస్ అభ్యర్థి జె.గీతారెడ్డిపై 5,283 ఓట్ల భారీ ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్కు 13,562 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్‌కు 8,755 ఓట్లు పోలయ్యాయి. ఇక టీడీపీ అభ్యర్థి వై.నరోత్తంకు 5,202 ఓట్లు లభించాయి. మండల కేంద్రమైన కోహీర్ పట్టణంలోనే టీఆర్ఎస్కు కాంగ్రెస్‌పై 1,436 ఓట్ల ఆధిక్యత లభించింది. టీఆర్ఎస్కు 2,992 ఓట్లు లభించగా, కాంగ్రెస్‌కు 1,556 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థికి కేవలం 747 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఝరాసంగం మండలంలో సైతం టీఆర్ఎస్ అభ్యర్థికే 459 ఓట్ల ఆధిక్యత లభించింది. ఝరాసంగం మండలం అనాదిగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయినా ఈ ఎన్నికల్లో మాత్రం ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావు ఝరాసంగం మండలానికి చెందిన వ్యక్తి కావడం కూడా ఆధిక్యతకు కారణంగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్కు 9,273 ఓట్లు లభించగా, కాంగ్రెస్‌కు 8,814 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థికి 5,143 ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ మండలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్పై స్వల్ప ఆధిక్యత లభించింది. 1,054 ఓట్లతో గీతారెడ్డి ఆధిక్యం కనబర్చారు. టీఆర్ఎస్కు 16,968 ఓట్లు లభించగా, కాంగ్రెస్‌కు 18,022 ఓట్లు లభించాయి. ఈ మండలంలో టీడీపీ అభ్యర్థి సైతం 14,623 ఓట్లు పొంది ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. జహీరాబాద్ పట్టణంలో సైతం టీఆర్ఎస్పై కాంగ్రెస్‌కు 444 ఓట్ల స్వల్ప ఆధిక్యత లభించింది. టీఆర్ఎస్కు 7,673 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 8,117 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీకి 5,963 ఓట్లు లభించాయి. న్యాల్కల్ మండలం మాత్రం మాజీ మంత్రి జె.గీతారెడ్డికి భారీ ఆధిక్యతనిచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుపై గీతారెడ్డికి 4,582 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇదే గీతారెడ్డి విజయానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఝరాసంగంలో టీఆర్ఎస్ ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పట్టణంలో వచ్చిన ఆధిక్యతతో పూడ్చుకుంది. కోహీర్‌లో టీఆర్ఎస్కు వచ్చిన భారీ ఆధిక్యతను న్యాల్కల్లో సాధించిన భారీ ఆధిక్యతతో కాంగ్రెస్ పూడ్చుకుంది. జహీరాబాద్ మండలంలో వచ్చిన స్వల్ప ఆధిక్యతతోనే గీతారెడ్డి బయటపడింది. ఈ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు మూకుమ్మడిగా టీఆర్ఎస్ను బలపర్చడం మూలంగానే టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి దగ్గరగా వచ్చారని వివిధ పార్టీల నేతలు విశ్లేషిస్తున్నారు. గీతారెడ్డి...కాంగ్రెస్ సీనియర్ నేత ఫరీదుద్దీన్‌ను విస్మరించడం వల్లే మైనార్టీలు మూకుమ్మడిగా టీఆర్ఎస్వైపు మొగ్గు చూపారనే ప్రచారం సాగుతోంది. టీడీపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న దానిపై ఆ పార్టీ నేతలు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఏయే వర్గాలు దూరం అయ్యాయనే దానిపై విశ్లేషించుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించినా, ఎందుకు మెజార్టీ తగ్గిందని గీతారెడ్డి సైతం ఫలితాలపై పోస్టుమార్టం జరుగుతున్నట్లు తెలుస్తోంది. తనకు ఏయే వర్గాల ప్రజలు దూరం అయ్యారని, అందుకు గల కారణాలు ఏమిటనే దానిపై ప్రధానంగా విశ్లేషించుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలు సైతం ఏఏ సామాజిక వర్గాలు తమను దూరంగా ఉంచాయన్న దానిపై వివరాలు ఆరా తీస్తున్నారు. -
ప్రశాంతంగా టీజీడీఏ ఎన్నికలు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీడీఏ) యూనిట్ల ఎన్నికల ఫలితాలు సోమవారం రాత్రి ప్రకటించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. కాగా ఒక్కో యూనిట్లో 19 పోస్టులకు ఎన్నికలు నిర్వహించగా, సుమారు 1500 మంది వైద్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితాలు ఇలా ఉన్నాయి.. యూనిట్-1లో.. ఉస్మానియా యూనిట్-1 పరిధిలో ఉస్మానియా వైద్యకళాశాల, ఉస్మానియా ఆస్పత్రి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, ఉస్మానియా దంత వైద్య కళాశాల ఉన్నాయి. ఇక్కడ 350 ఓట్లకు గాను 346 ఓట్లు పోలయా ్యయి. నూతన అధ్యక్షుడిగా ఉస్మానియా ఆస్పత్రి సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ బి.నాగేందర్ విజయం సాధించారు. ప్రధాన కార్య దర్శిగా మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.బాలరాజు, కోశాధికారిగా అనెస్థీయా ఇన్చార్జి డాక్టర్ పాండునాయక్, జనరల్ కౌన్సిల్ మెంబర్‌గా డాక్టర్ రాజు విజయం సాధించారు. యూనిట్-2లో.. ఉస్మానియా యూనిట్-2 పరిధిలో నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, ఎర్రగడ్డలోని ఛాతి, మానసిక చికిత్సాలయం, ఐపీఎం నారాయణగూడ, ఈఎన్టీ ఆస్పత్రి ఉన్నాయి. ఇక్కడ 300 మంది ఓటర్లకు 295 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నూతన అధ్యక్షుడిగా సరోజినిదేవి కంటి ఆస్పత్రి డాక్టర్ రవీందర్‌గౌడ్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ లక్ష్మీనారాయణ, కోశాధికారిగా డాక్టర్ వినోద్‌కుమార్, జనరల్ కౌన్సిల్ మెంబర్స్‌గా తరుణి, మురళీధర్‌రావు, సీఈసీ మెంబర్‌గా నరహరి గెలుపొందారు. గాంధీ యూనిట్లో.. గాంధీ మెడికల్ కళాశాల, గాంధీ జనరల్ ఆస్పత్రి యూనిట్లో 350 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 20 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నూతన అధ్యక్షుడిగా గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ శ్రవణ్‌కుమార్ విజయం సాధించారు. కార్యదర్శిగా డాక్టర్ సిద్ధిపేట రమేష్, కోశాధికారిగా కె.భూమేష్‌కుమార్, ఉపాధ్యక్షులుగా కె.రాణి, రమేష్‌బాబు, సంయుక్త కార్యదర్శిగా శోభ, జనరల్ కౌన్సిల్ మెంబర్‌గా త్రిలోక్ చందర్, జనరల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ప్రశాంత్ ఎన్నికయ్యారు. -
నేతలు అ‘టెన్షన్’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికల ఫలితాలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో ఒకటే ఆందోళన నెలకొంది. సోమవారం మున్సి‘పోల్’ ఫలితాలు వెలువడనుండడంతో వారిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో సుమారు 10 రోజుల పాటు నాయకులు విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా వెలువడనున్న ఫలితాలు వారిలో గుబులు రేపుతున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు సోమవారం జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ కళాశాల ఆవరణలో జరగనుంది. ఈనెల 13న జిల్లాలోని 36 జడ్పీటీసీ, 583 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 16వ తేదీన జిల్లాలోని రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఉంది. ఇలా వరుస ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, సీనియర్లలో ఉత్కం ఠ మొదలైంది. మున్సిపల్, జడ్పీ పీఠాలపై పార్టీల గురి... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజకీయ పదవులకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. త్వరలోనే కొత్త ప్రజాప్రతినిధులు కొలువు దీరనున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు వివిధ పార్టీల నుంచి పోటీచేసిన నేతల భవిష్యత్ తేలనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అగ్రనేతలు ఫలితాల విశ్లేషణలో తలమునకలై ఉన్నారు. సుమారుగా మూడున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పాగా వేయడమే ప్రధాన పార్టీల నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, సీపీఐ తదితర పార్టీలు ఈసారి మున్సిపల్, ‘స్థానిక’ ఎన్నికల్లో తలపడగా, కాంగ్రెస్, టీఆర్ఎస్లు మాత్రమే మేయర్, చైర్మన్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతుడండం విశేషం. జిల్లా కేంద్రంలో పార్టీల అగ్రనేతల మకాం మార్చి 5న ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే నెల 10న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మూడున్నరేళ్ల తర్వాత మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగ్గా, సార్వత్రిక ఎన్నికలు కూడా ముగిశాయి. మొత్తానికి మరో ఐదేళ్ల వరకు ఎన్నికల ఊసెత్తే అవకాశం లేకుండా ఎన్నికల పరంపర సాగింది. పీఠాలు సాధించి పట్టునిలుపుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. సోమవారం నగర, పురపాలక, మంగళవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, క్యాంపు రాజకీయాలకు ఆయా పార్టీల సీనియర్ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఫలితాలు వెలువడటమే తడవు, మెజార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను తమ తమ శిబిరాలకు తరలించేందుకు ఇప్పటికే పక్కా వ్యూహం రూపొందించారు. జిల్లాలో జరిగిన వరుస ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే కాగా, తమ తమ ఇమేజ్‌తో ముడిపడిన ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే టెన్షన్ మాత్రం అగ్రనేతలను వీడటం లేదు. -
స్టాక్ మార్కెట్లో హైటెన్షన్
ఎగ్జిట్ పోల్స్‌తో భారీ ఒడిదుడుకులు మార్కెట్ కదలికలపై స్టాక్ నిపుణుల అంచనాలు నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల శుక్రవారం ఉదయం నుంచి ఎన్నికల ఫలితాలు నేడు ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు గురువారం టోకు ధరల ద్రవ్యోల్బణం వివరాలు పీఎన్బీ, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా ఫలితాలు న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సోమవారం(12న)తో ముగియనుంది. దీంతో సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన అర్థగంట తరువాత నుంచి వివిధ సంస్థలు నిర్వహించిన అభిప్రాయ సేకరణ (ఎగ్జిట్ పోల్) ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇవి ముగిశాక శుక్రవారం(16న) ఉదయం నుంచీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అసలు ఫలితాల లెక్కింపు మొదలుకానుంది. వెరసి ఈ వారం స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూసే అవకాశమున్నదని అత్యధిక శాతం నిపుణులు అంచనా వేశారు. సుస్థిర ప్రభుత్వమైతే ఓకే ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లు మెరుగుపడతాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. ఇక ఆర్థిక అంశాల విషయానికివస్తే సోమవారం(12న) మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు వెల్లడికానున్నాయి. వీటితోపాటు ఏప్రిల్ రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు తెలియనున్నాయి. ఇక గురువారం(15న) టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. మరోవైపు మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు క్యూ4 ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ ఉన్నాయి. సీట్ బెల్ట్‌లు బిగించుకోవలసిందే.... ఆర్థిక గణాంకాలు, దిగ్గజ కంపెనీల క్యూ4 ఫలితాలు, లోక్‌సభ ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లకు అత్యంత కీలకంగా నిలవనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లేదా బ్రోకర్లు ఎవరైనాగానీ మార్కెట్లో నమోదయ్యే వేగవంతమైన కదలికలను తట్టుకునేందుకు సీట్ బెల్ట్‌లు బిగించుకోవలసిందేనని వ్యాఖ్యానించారు. సోమవారం వెల్లడికానున్న ఎగ్జిట్ పోల్స్ కారణంగా మార్కెట్ ఆశ్చర్యకర కదలికలను నమోదు చేసే అవకాశముందని చెప్పారు. ఫలితాలదే పైచేయి కంపెనీల ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలున్నప్పటికీ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించేది ఎన్నికల ఫలితాలేనని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. ఈ అన్ని అంశాల నేపథ్యంలో మార్కెట్లలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నదని, అయితే సానుకూల ధృక్పథంతో కొనసాగవచ్చునని తెలిపారు. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా సమీప కాలంలో మార్కెట్ల కదలికలు ఉంటాయని అత్యధిక శాతం మంది నిపుణులు వివరించారు. ఈ వారం అత్యంత కీలకంగా నిలవనుందని చెప్పారు. ఫలితాలు వెల్లడయ్యే రోజు దగ్గరపడుతున్నకొద్దీ మార్కెట్లో సెంటిమెంట్ బలపడుతున్నదని, సానుకూల ఫలితాలను ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారని తెలిపారు. ఇన్వెస్ట్ చేయొచ్చు... ప్రస్తుతం ఈక్విటీలలో పెట్టుబడులకు అత్యంత అనువైన సమయమని ఏంజెల్ బ్రోకింగ్ చైర్మన్ దినేష్ ఠక్కర్ పేర్కొన్నారు. స్టాక్స్‌లో పెట్టుబడులను కొనసాగించవచ్చునని చెప్పారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలతో గడిచిన శుక్రవారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 650 పాయింట్లు హైజంప్ చేసిన విషయం విదితమే. ఫలితంగా స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 23,000 పాయింట్లను అధిగమించింది కూడా! రూ. 5,000 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ: ఈ నెలలో ఇప్పటి వరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లో రూ. 5,000 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు ప్రధానంగా జోష్ నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా సంస్కరణల అమలు వేగమందుకుంటుందని, పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎఫ్ఐఐలు ఆశిస్తున్నట్లు తెలిపారు. వెరసి గడిచిన వారంలో(2-9) నికరంగా రూ. 2,124 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, మరో రూ. 2,871 కోట్లను బాండ్లు తదితర డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేశారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ. 5,000 కోట్లు(83 కోట్ల డాలర్లు). మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. 9 దశలలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటి(12)తో ముగియనుంది. ఫలితాలు శుక్రవారం(16న) వెల్లడికానున్నాయి. ఈ అంచనాలతో ఇటీవల ఎఫ్ఐఐల పెట్టుబడుల జోరు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ జనవరి మొదలు ఇప్పటివరకూ ఎఫ్ఐఐల పెట్టుబడులు ఒక్క స్టాక్స్‌లోనే రూ. 33,923 కోట్లకు చేరుకున్నాయి. ఈ బాటలో రుణ మార్కెట్లో సైతం రూ. 29,217 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. -
ఫలితాల కోసమే
భీమ్‌గల్, న్యూస్‌లైన్: ప్రజలు ఉక్కిరిబిక్కిరయిపోతున్నారు. అది ‘మే’ నెలలో వచ్చిన ఎండల ఉక్కపోతతో మాత్రం కాదు. ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనన్న ఉత్కంఠతోనే. ఎన్నడూ లేని విధంగా 2014 ‘మే’ నెల చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకుంది. ఫలితాల ప్రత్యేక నెలగా మారిపోయింది. ఒక వైపు గత నెలలో నిర్వహించిన మున్సిపల్, ఎం పీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల కోసం రాజకీయ నాయకు లు, వారి అనుచరగణం ఎదురుచూస్తున్నారు. మరో వైపు టెన్త్‌తో పాటు డిగ్రీ తదితర పరీక్షల ఫలితాలు ఈ నెలలోనే వెలువడనున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ఆలస్యంగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. తొలి తెలంగాణ స్వ యం పాలనకు ఈ నెల దిక్సూచిగా మారనుంది. ఆ ‘మూడు’ పైనే అందరి దృష్టి చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా ఈ సంవత్సరం ఒకేసారి జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలు ఈ నెలలోనే వెలువడనున్నాయి. దేశ, రాష్ర్ట భవిష్యత్తు నిర్ణయించే ఈ ఎన్నికల ఫలితాలపై నాయకులలోనే కాకుండా సాధారణ ప్రజలలో కూడా ఆసక్తి నెలకొంది. వందలాది మంది నేతల భవిష్యత్తు ఈ నెలలోనే తేలనుంది. మున్సిప ల్, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి ఇప్పటికే చాలా రోజులు గడిచింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఫలితాల ప్రకటన నిలిచిపోయింది. గత ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్ని కలు ముగియడంతో ఇక అందరి దృష్టి ఫలితాలపైనే నిలిచింది. ప్రజల దృష్టి ప్రస్తుతం ఆ మూడు తేదీలపైనే కేంద్రీకృతమయ్యింది. ఈ నెల 12న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జిల్లాలో నిజామాబాద్, భోదన్, ఆర్మూర్, కామారెడ్డిలో జరిగిన ఈ ఎన్నికలలో వందలాది మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇక ఆ మరుసటి రోజే అంటే 13న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందులో జిల్లాలోని 36 మండలాలలోని స్థానిక నాయకుల భవిష్యత్తు తేలి పోతుంది. ఇక చివరగా ఈ నెల 16వ తేదీన సార్వత్రిక ఎన్నికల లెక్కింపు జరగనుంది. ఇందులో జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దీంతో పాటే ఆయా పార్టీల బలాబలాలు వెలువడనున్నాయి. విద్యార్థుల భవితవ్యం ఈ నెలలోనే ఇదే నెలలో విద్యార్ధుల భవితవ్యం కూడా తేలనుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్, మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలు వెలువడ్డాయి. వీటితో పాటు టెట్, టెన్త్, డిగ్రీ, ఏఐత్రిబుల్ఈ, పీజీసెట్ తదితర ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో లక్షలాది విద్యార్థులతో పాటు వారివారి తల్లిదండ్రులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఫలితాల నేపథ్యంలో ప్రజల్లోనే ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద మే నెల అనేక మంది అదృష్టాలను పరీక్షించనుంది.