ఫలితాల కోసమే | leaders and students are waiting for election counting and exam results | Sakshi
Sakshi News home page

ఫలితాల కోసమే

Published Tue, May 6 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

leaders and students are waiting for election counting and exam results

 భీమ్‌గల్, న్యూస్‌లైన్:  ప్రజలు ఉక్కిరిబిక్కిరయిపోతున్నారు. అది ‘మే’ నెలలో వచ్చిన ఎండల ఉక్కపోతతో మాత్రం కాదు. ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనన్న ఉత్కంఠతోనే. ఎన్నడూ లేని విధంగా 2014 ‘మే’ నెల చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకుంది. ఫలితాల ప్రత్యేక నెలగా మారిపోయింది. ఒక వైపు గత నెలలో నిర్వహించిన మున్సిపల్, ఎం పీటీసీ, జడ్‌పీటీసీ, అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల కోసం రాజకీయ నాయకు లు, వారి అనుచరగణం ఎదురుచూస్తున్నారు. మరో వైపు టెన్త్‌తో పాటు డిగ్రీ తదితర పరీక్షల ఫలితాలు ఈ నెలలోనే వెలువడనున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ఆలస్యంగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. తొలి తెలంగాణ స్వ యం పాలనకు ఈ నెల దిక్సూచిగా మారనుంది.

 ఆ ‘మూడు’ పైనే అందరి దృష్టి
 చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా ఈ సంవత్సరం ఒకేసారి జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలు ఈ నెలలోనే వెలువడనున్నాయి. దేశ, రాష్ర్ట భవిష్యత్తు నిర్ణయించే ఈ ఎన్నికల ఫలితాలపై నాయకులలోనే కాకుండా సాధారణ ప్రజలలో కూడా ఆసక్తి నెలకొంది. వందలాది మంది నేతల భవిష్యత్తు ఈ నెలలోనే తేలనుంది. మున్సిప ల్, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి ఇప్పటికే చాలా రోజులు గడిచింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఫలితాల ప్రకటన నిలిచిపోయింది. గత ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్ని కలు ముగియడంతో ఇక అందరి దృష్టి ఫలితాలపైనే నిలిచింది. ప్రజల దృష్టి ప్రస్తుతం ఆ మూడు తేదీలపైనే కేంద్రీకృతమయ్యింది.

ఈ నెల 12న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జిల్లాలో నిజామాబాద్, భోదన్, ఆర్మూర్, కామారెడ్డిలో జరిగిన ఈ ఎన్నికలలో వందలాది మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇక ఆ మరుసటి రోజే అంటే 13న ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందులో జిల్లాలోని 36 మండలాలలోని స్థానిక నాయకుల భవిష్యత్తు తేలి పోతుంది. ఇక చివరగా ఈ నెల 16వ తేదీన సార్వత్రిక ఎన్నికల లెక్కింపు జరగనుంది. ఇందులో జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దీంతో పాటే ఆయా పార్టీల బలాబలాలు వెలువడనున్నాయి.

 విద్యార్థుల భవితవ్యం ఈ నెలలోనే
 ఇదే నెలలో విద్యార్ధుల భవితవ్యం కూడా తేలనుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్, మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలు వెలువడ్డాయి. వీటితో పాటు టెట్, టెన్త్, డిగ్రీ, ఏఐత్రిబుల్‌ఈ, పీజీసెట్ తదితర ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో లక్షలాది విద్యార్థులతో పాటు వారివారి తల్లిదండ్రులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఫలితాల నేపథ్యంలో ప్రజల్లోనే ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద మే నెల అనేక మంది అదృష్టాలను పరీక్షించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement