కర్నూలు(అర్బన్): ఆగ్రహం.. కట్టలు తెంచుకుంది. ఆందోళన.. పతాకస్థాయికి చేరింది. సీమవాసుల వాణి వినకుండా.. రాజధాని ప్రకటన చేయడంపై విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యమబాట పట్టారు. గురువారం అసెంబ్లీలో నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధానిగా విజయవాడను ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే కర్నూలు నగరంలో విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు, మహిళలు ఆందోళన బాట పట్టారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై న్యాయవాదులు సైతం పిడికిలి బిగించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. రాజ్‌విహార్ సెంటర్‌లో ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రబాబు దిష్టిబొమ్మను పూడ్చి పెట్టేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఆందోళనకారులను చెదరగొట్టి బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె. లక్ష్మీనరసింహ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఆర్‌పీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డిని అరెస్ట్ చేసి కె. నాగులాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాయలసీమ ప్రజా సమితి అధ్యక్షుడు కందనూలు క్రిష్ణయ్య, శోషిత జనసభ అధ్యక్షుడు పోతన్న, ఎరుకల హక్కుల పోరాట కమిటీ అధ్యక్షుడు రాజు, రాయలసీమ నిర్మాణ సమితి వ్యవస్థాపకులు జనార్దన్ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీలను దహనం చేశారు.
గిరిజన విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్. చంద్రప్ప, కార్యదర్శి వెంకటేశ్, బీసీ,ఎస్‌సీ,ఎస్‌టీ,మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వి. భరత్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక జీజీ హాస్పిటల్ సమీపంలోని సెల్‌టవర్ ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై టవర్ ఎక్కిన విద్యార్థులను కిందకు దించి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీసీ,ఎస్‌సీ,ఎస్‌టీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక కలెక్టరేట్ ఎదుట కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం పలు విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు నల్లజెండాలు చేపట్టుకొని సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిర్లాగేట్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ వరకు చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించి అక్కడ దానిని దహనం చేశారు.
న్యాయవాదుల రిలే దీక్షలు, బైక్ ర్యాలీ..
రాజధానిగా విజయవాడను ప్రకటించడంతో న్యాయవాదులు ఉద్యమించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రమౌళీశ్వరరెడ్డి, హరనాథ్‌చౌదరి, నాయకులు రంగా రవికుమార్, శ్రీనివాసరెడ్డి, వాసు ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు పాతబస్టాండ్‌లోని తెలుగుతల్లి విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అలాగే మరికొందరు న్యాయవాదులు నగరంలోని జిల్లా కోర్టు నుంచి పాతబస్టాండ్, పాత కంట్రోల్‌రూం, కిడ్స్‌వరల్డ్, జిల్లా పరిషత్ మీదుగా రాజ్‌విహార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాజధానిగా విజయవాడను ప్రకటించి రాయలసీమ ప్రజలకు తీరని ద్రోహం చేశారని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధానిగా ప్రకటించకపోగా, రాజధాని ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
రాయలసీమకు జరిగిన అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. రాజధాని కావాలని అడగలేని రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాయలసీమ ఉద్యమంలో కలిసిరావాలని డిమాండ్ చేశారు. హామీలతో రాయలసీమ ప్రజలను మభ్యపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తే నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నారు. సీమకు ద్రోహం చేసిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
పెల్లుబికిన ఆగ్రహం
Published Fri, Sep 5 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM
Advertisement
Advertisement