స్టాక్ మార్కెట్లో హైటెన్షన్ | Hightension in the stock market | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్లో హైటెన్షన్

Published Mon, May 12 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

స్టాక్ మార్కెట్లో హైటెన్షన్

స్టాక్ మార్కెట్లో హైటెన్షన్

 ఎగ్జిట్ పోల్స్‌తో భారీ ఒడిదుడుకులు
   మార్కెట్ కదలికలపై స్టాక్ నిపుణుల అంచనాలు
   నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల
   శుక్రవారం ఉదయం నుంచి ఎన్నికల ఫలితాలు
   నేడు ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు
   గురువారం టోకు ధరల ద్రవ్యోల్బణం వివరాలు
   పీఎన్‌బీ, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా ఫలితాలు

 

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సోమవారం(12న)తో ముగియనుంది. దీంతో సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన అర్థగంట తరువాత నుంచి వివిధ సంస్థలు నిర్వహించిన అభిప్రాయ సేకరణ (ఎగ్జిట్ పోల్) ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇవి ముగిశాక శుక్రవారం(16న) ఉదయం నుంచీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అసలు ఫలితాల లెక్కింపు మొదలుకానుంది. వెరసి ఈ వారం స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూసే అవకాశమున్నదని అత్యధిక శాతం నిపుణులు అంచనా వేశారు.

 సుస్థిర ప్రభుత్వమైతే ఓకే
 ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లు మెరుగుపడతాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్  వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. ఇక ఆర్థిక అంశాల విషయానికివస్తే సోమవారం(12న) మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు వెల్లడికానున్నాయి. వీటితోపాటు ఏప్రిల్ రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు తెలియనున్నాయి. ఇక గురువారం(15న) టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. మరోవైపు మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు క్యూ4 ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ ఉన్నాయి.

 సీట్ బెల్ట్‌లు బిగించుకోవలసిందే....
 ఆర్థిక గణాంకాలు, దిగ్గజ  కంపెనీల క్యూ4 ఫలితాలు, లోక్‌సభ ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లకు అత్యంత కీలకంగా నిలవనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లేదా బ్రోకర్లు ఎవరైనాగానీ మార్కెట్లో నమోదయ్యే వేగవంతమైన కదలికలను తట్టుకునేందుకు సీట్ బెల్ట్‌లు బిగించుకోవలసిందేనని వ్యాఖ్యానించారు. సోమవారం వెల్లడికానున్న ఎగ్జిట్ పోల్స్ కారణంగా మార్కెట్ ఆశ్చర్యకర కదలికలను నమోదు చేసే అవకాశముందని చెప్పారు.

 ఫలితాలదే పైచేయి
 కంపెనీల ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలున్నప్పటికీ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించేది ఎన్నికల ఫలితాలేనని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అభిప్రాయపడ్డారు. ఈ అన్ని అంశాల నేపథ్యంలో మార్కెట్లలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నదని, అయితే సానుకూల ధృక్పథంతో కొనసాగవచ్చునని తెలిపారు. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా సమీప కాలంలో మార్కెట్ల కదలికలు ఉంటాయని అత్యధిక శాతం మంది నిపుణులు వివరించారు. ఈ వారం అత్యంత కీలకంగా నిలవనుందని చెప్పారు. ఫలితాలు వెల్లడయ్యే రోజు దగ్గరపడుతున్నకొద్దీ మార్కెట్లో సెంటిమెంట్ బలపడుతున్నదని, సానుకూల ఫలితాలను ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారని తెలిపారు.

 ఇన్వెస్ట్ చేయొచ్చు...
 ప్రస్తుతం ఈక్విటీలలో పెట్టుబడులకు అత్యంత అనువైన సమయమని ఏంజెల్ బ్రోకింగ్ చైర్మన్ దినేష్ ఠక్కర్ పేర్కొన్నారు. స్టాక్స్‌లో పెట్టుబడులను కొనసాగించవచ్చునని చెప్పారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలతో గడిచిన శుక్రవారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 650 పాయింట్లు హైజంప్ చేసిన విషయం విదితమే. ఫలితంగా స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 23,000 పాయింట్లను అధిగమించింది కూడా!
 
 రూ. 5,000 కోట్ల పెట్టుబడులు

 న్యూఢిల్లీ: ఈ నెలలో ఇప్పటి వరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్‌లో రూ. 5,000 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు ప్రధానంగా జోష్ నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా సంస్కరణల అమలు వేగమందుకుంటుందని, పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎఫ్‌ఐఐలు ఆశిస్తున్నట్లు తెలిపారు. వెరసి గడిచిన వారంలో(2-9) నికరంగా రూ. 2,124 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, మరో రూ. 2,871 కోట్లను బాండ్లు తదితర డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేశారు.

 వీటి మొత్తం విలువ దాదాపు రూ. 5,000 కోట్లు(83 కోట్ల డాలర్లు). మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. 9 దశలలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటి(12)తో ముగియనుంది. ఫలితాలు శుక్రవారం(16న) వెల్లడికానున్నాయి. ఈ అంచనాలతో ఇటీవల ఎఫ్‌ఐఐల పెట్టుబడుల జోరు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ జనవరి మొదలు ఇప్పటివరకూ ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఒక్క స్టాక్స్‌లోనే రూ. 33,923 కోట్లకు చేరుకున్నాయి. ఈ బాటలో రుణ మార్కెట్లో సైతం రూ. 29,217 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement