జహీరాబాద్, న్యూస్‌లైన్: జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకుంటున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం అనాదిగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగానే ఉంటూ వస్తోంది. అయినా ఈ ఎన్నికల్లో మాత్రం పార్టీ అభ్యర్థి జె.గీతారెడ్డి కేవలం 842 ఓట్ల మెజార్టీతో బయటపడి పరువు నిలుపుకుంది. నియోజకవర్గంలోని ఏయే మండలాల ప్రజలు తమకు అనుకూలంగా ఓటు వేశారు, ఏయే మండలాల్లో అనుకూలంగా ఓట్లు లభించలేదనే దానిపై ప్రధానంగా ఆయా పార్టీల అభ్యర్థులు లెక్కలు కడుతున్నారు.
పోలింగ్ బూత్‌ల వారీగా తమకు పోలైన ఓట్ల లెక్కలు తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ గాలి వీచినా, జహీరాబాద్ నియోజకవర్గంలో మాత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావు స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి జె.గీతారెడ్డి చేతిలో పరాజయం పాలు కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు నియోజకవర్గంలో జీరోగా ఉన్న టీఆర్‌ఎస్ ఒక్క సారిగా బలపడి కాంగ్రెస్ పార్టీకే సవాల్ విసిరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మండలాల వారీగా విశ్లేషిస్తే
కోహీర్ మండలంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావుకు కాంగ్రెస్ అభ్యర్థి జె.గీతారెడ్డిపై 5,283 ఓట్ల భారీ ఆధిక్యం లభించింది. టీఆర్‌ఎస్‌కు 13,562 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్‌కు 8,755 ఓట్లు పోలయ్యాయి. ఇక టీడీపీ అభ్యర్థి వై.నరోత్తంకు 5,202 ఓట్లు లభించాయి. మండల కేంద్రమైన కోహీర్ పట్టణంలోనే టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌పై 1,436 ఓట్ల ఆధిక్యత లభించింది. టీఆర్‌ఎస్‌కు 2,992 ఓట్లు లభించగా, కాంగ్రెస్‌కు 1,556 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థికి కేవలం 747 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఝరాసంగం మండలంలో సైతం టీఆర్‌ఎస్ అభ్యర్థికే 459 ఓట్ల ఆధిక్యత లభించింది. ఝరాసంగం మండలం అనాదిగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వస్తోంది.
అయినా ఈ ఎన్నికల్లో మాత్రం ప్రజలు టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావు ఝరాసంగం మండలానికి చెందిన వ్యక్తి కావడం కూడా ఆధిక్యతకు కారణంగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు 9,273 ఓట్లు లభించగా, కాంగ్రెస్‌కు 8,814 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థికి 5,143 ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ మండలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి టీఆర్‌ఎస్‌పై స్వల్ప ఆధిక్యత లభించింది. 1,054 ఓట్లతో గీతారెడ్డి ఆధిక్యం కనబర్చారు. టీఆర్‌ఎస్‌కు 16,968 ఓట్లు లభించగా, కాంగ్రెస్‌కు 18,022 ఓట్లు లభించాయి. ఈ మండలంలో టీడీపీ అభ్యర్థి సైతం 14,623 ఓట్లు పొంది ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. జహీరాబాద్ పట్టణంలో సైతం టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌కు 444 ఓట్ల స్వల్ప ఆధిక్యత లభించింది. టీఆర్‌ఎస్‌కు 7,673 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 8,117 ఓట్లు వచ్చాయి.
ఇక్కడ టీడీపీకి 5,963 ఓట్లు లభించాయి. న్యాల్‌కల్ మండలం మాత్రం మాజీ మంత్రి జె.గీతారెడ్డికి భారీ ఆధిక్యతనిచ్చింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి మాణిక్‌రావుపై గీతారెడ్డికి 4,582 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇదే గీతారెడ్డి విజయానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఝరాసంగంలో టీఆర్‌ఎస్ ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పట్టణంలో వచ్చిన ఆధిక్యతతో పూడ్చుకుంది. కోహీర్‌లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన భారీ ఆధిక్యతను న్యాల్‌కల్‌లో సాధించిన భారీ ఆధిక్యతతో కాంగ్రెస్ పూడ్చుకుంది. జహీరాబాద్ మండలంలో వచ్చిన స్వల్ప ఆధిక్యతతోనే గీతారెడ్డి బయటపడింది.
ఈ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌ను బలపర్చడం మూలంగానే టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయానికి దగ్గరగా వచ్చారని వివిధ పార్టీల నేతలు విశ్లేషిస్తున్నారు. గీతారెడ్డి...కాంగ్రెస్ సీనియర్ నేత ఫరీదుద్దీన్‌ను విస్మరించడం వల్లే మైనార్టీలు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపారనే ప్రచారం సాగుతోంది. టీడీపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న దానిపై ఆ పార్టీ నేతలు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఏయే వర్గాలు దూరం అయ్యాయనే దానిపై విశ్లేషించుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించినా, ఎందుకు మెజార్టీ తగ్గిందని గీతారెడ్డి సైతం ఫలితాలపై పోస్టుమార్టం జరుగుతున్నట్లు తెలుస్తోంది. తనకు ఏయే వర్గాల ప్రజలు దూరం అయ్యారని, అందుకు గల కారణాలు ఏమిటనే దానిపై ప్రధానంగా విశ్లేషించుకుంటున్నారు. టీఆర్‌ఎస్ నేతలు సైతం ఏఏ సామాజిక వర్గాలు తమను దూరంగా ఉంచాయన్న దానిపై వివరాలు ఆరా తీస్తున్నారు.
ఫలితాలపై పోస్టుమార్టం
Published Sat, May 24 2014 12:34 AM | Last Updated on Mon, May 28 2018 1:49 PM
Advertisement
Advertisement