J. Geeta Reddy
-
పీఏసీ చైర్మన్ గా గీతారెడ్డి?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డాక్టర్ జె.గీతారెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. గీతారెడ్డి శనివారం ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పీఏసీ చైర్మన్ పదవిని ఇవ్వడం ఆనవాయితీ. దీని ప్రకారం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కి ఆ పదవి దక్కనుంది. ఇంతకు ముందు పీఏసీ చైర్మన్‌గా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఈ పదవి ఖాళీ అయింది. కాంగ్రెస్ నుంచి చాలామంది సీనియర్లు ప్రస్తుతం శాసనసభలో ఉన్నారు. ఇందులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతుండగా, చిన్నారెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారు. దీనితో పీఏసీ పదవికి గీతారెడ్డి లేదా జీవన్‌రెడ్డిని పంపించాలనే అంశంపై సీఎల్పీ చర్చించింది. సీనియర్ ఎమ్మెల్యే కావడం, మహిళా శాసనసభ్యురాలు.. సామాజిక వర్గం వంటి సమీకరణాల నేపథ్యంలో చివరకు గీతారెడ్డిని తమ అభ్యర్థిగా నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. పీఏసీ ఎన్నిక నోటిఫికేషన్ జారీ... ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ), పబ్లిక్ అండర్‌టేకింగ్ సంస్థల సమితి ఎన్నికల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ కమిటీల్లో సభ్యులుగా ఎన్నికయేందుకు శాసనమండలి నుంచి ఇద్దరికి అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలవరకు నామినేషన్లను స్వీకరిస్తారని, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 చివరి గడువు కాగా, 22న ఎన్నిక జరుగుతుందని కడియం వెల్లడించారు. -
ఆశించినస్థాయిలో బడ్జెట్ లేదు: జానారెడ్డి
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ నిరాశ కలిగించిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదన్నారు. ప్రధానాంశాలపై ఆశించినస్థాయిలో ప్రస్తావన లేదని పెదవి విరిచారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా బడ్జెట్ ఉందని టీసీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారు 459 మందే అని ప్రభుత్వం పేర్కొనడం దురదృష్టకరమన్నారు. వాటర్‌గ్రిడ్‌కు రూ. 25 వేల కోట్లు అవుతుందన్న టీఆర్ఎస్ సర్కారు ఆర్థిక బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని మాజీ మంత్రి జె. గీతారెడ్డి తెలిపారు. అన్ని పథకాలకు అరకొర కేటాయింపులే చేశారని అన్నారు. బడ్జెట్ అసంపూర్తిగా ఉందని విమర్శించారు. -
'సొంత పేపర్, టీవీ ఛానల్ కావాలి'
హైదరాబాద్: ప్రచార లోపాలతోనే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయిందని మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి అభిప్రాయడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి సొంత న్యూస్ పేపర్, టీవీ ఛానల్ ఉండాలని సూచించారు. దీని కోసం కార్యకర్తలంతా రూ.1000 చొప్పున విరాళం ఇవ్వాలని కోరారు. టీపీసీసీలో సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయాలని సలహాయిచ్చారు. కాంగ్రెస్ నేతలంతా సోషల్ మీడియాను వినియోగించాలని సురేష్‌రెడ్డి సూచించారు. కాగా, పార్టీ సంస్థాగత పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ మంత్రి జె. గీతారెడ్డి అన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు పోరాడాలి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు తీరుపై అధ్యయనం కోసం పార్టీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కోరారు. -
ఫలితాలపై పోస్టుమార్టం
జహీరాబాద్, న్యూస్‌లైన్: జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకుంటున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం అనాదిగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగానే ఉంటూ వస్తోంది. అయినా ఈ ఎన్నికల్లో మాత్రం పార్టీ అభ్యర్థి జె.గీతారెడ్డి కేవలం 842 ఓట్ల మెజార్టీతో బయటపడి పరువు నిలుపుకుంది. నియోజకవర్గంలోని ఏయే మండలాల ప్రజలు తమకు అనుకూలంగా ఓటు వేశారు, ఏయే మండలాల్లో అనుకూలంగా ఓట్లు లభించలేదనే దానిపై ప్రధానంగా ఆయా పార్టీల అభ్యర్థులు లెక్కలు కడుతున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా తమకు పోలైన ఓట్ల లెక్కలు తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచినా, జహీరాబాద్ నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావు స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి జె.గీతారెడ్డి చేతిలో పరాజయం పాలు కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు నియోజకవర్గంలో జీరోగా ఉన్న టీఆర్ఎస్ ఒక్క సారిగా బలపడి కాంగ్రెస్ పార్టీకే సవాల్ విసిరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మండలాల వారీగా విశ్లేషిస్తే కోహీర్ మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావుకు కాంగ్రెస్ అభ్యర్థి జె.గీతారెడ్డిపై 5,283 ఓట్ల భారీ ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్కు 13,562 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్‌కు 8,755 ఓట్లు పోలయ్యాయి. ఇక టీడీపీ అభ్యర్థి వై.నరోత్తంకు 5,202 ఓట్లు లభించాయి. మండల కేంద్రమైన కోహీర్ పట్టణంలోనే టీఆర్ఎస్కు కాంగ్రెస్‌పై 1,436 ఓట్ల ఆధిక్యత లభించింది. టీఆర్ఎస్కు 2,992 ఓట్లు లభించగా, కాంగ్రెస్‌కు 1,556 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థికి కేవలం 747 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఝరాసంగం మండలంలో సైతం టీఆర్ఎస్ అభ్యర్థికే 459 ఓట్ల ఆధిక్యత లభించింది. ఝరాసంగం మండలం అనాదిగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయినా ఈ ఎన్నికల్లో మాత్రం ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావు ఝరాసంగం మండలానికి చెందిన వ్యక్తి కావడం కూడా ఆధిక్యతకు కారణంగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్కు 9,273 ఓట్లు లభించగా, కాంగ్రెస్‌కు 8,814 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థికి 5,143 ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ మండలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్పై స్వల్ప ఆధిక్యత లభించింది. 1,054 ఓట్లతో గీతారెడ్డి ఆధిక్యం కనబర్చారు. టీఆర్ఎస్కు 16,968 ఓట్లు లభించగా, కాంగ్రెస్‌కు 18,022 ఓట్లు లభించాయి. ఈ మండలంలో టీడీపీ అభ్యర్థి సైతం 14,623 ఓట్లు పొంది ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. జహీరాబాద్ పట్టణంలో సైతం టీఆర్ఎస్పై కాంగ్రెస్‌కు 444 ఓట్ల స్వల్ప ఆధిక్యత లభించింది. టీఆర్ఎస్కు 7,673 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 8,117 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీకి 5,963 ఓట్లు లభించాయి. న్యాల్కల్ మండలం మాత్రం మాజీ మంత్రి జె.గీతారెడ్డికి భారీ ఆధిక్యతనిచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుపై గీతారెడ్డికి 4,582 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇదే గీతారెడ్డి విజయానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఝరాసంగంలో టీఆర్ఎస్ ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పట్టణంలో వచ్చిన ఆధిక్యతతో పూడ్చుకుంది. కోహీర్‌లో టీఆర్ఎస్కు వచ్చిన భారీ ఆధిక్యతను న్యాల్కల్లో సాధించిన భారీ ఆధిక్యతతో కాంగ్రెస్ పూడ్చుకుంది. జహీరాబాద్ మండలంలో వచ్చిన స్వల్ప ఆధిక్యతతోనే గీతారెడ్డి బయటపడింది. ఈ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు మూకుమ్మడిగా టీఆర్ఎస్ను బలపర్చడం మూలంగానే టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి దగ్గరగా వచ్చారని వివిధ పార్టీల నేతలు విశ్లేషిస్తున్నారు. గీతారెడ్డి...కాంగ్రెస్ సీనియర్ నేత ఫరీదుద్దీన్‌ను విస్మరించడం వల్లే మైనార్టీలు మూకుమ్మడిగా టీఆర్ఎస్వైపు మొగ్గు చూపారనే ప్రచారం సాగుతోంది. టీడీపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న దానిపై ఆ పార్టీ నేతలు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఏయే వర్గాలు దూరం అయ్యాయనే దానిపై విశ్లేషించుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించినా, ఎందుకు మెజార్టీ తగ్గిందని గీతారెడ్డి సైతం ఫలితాలపై పోస్టుమార్టం జరుగుతున్నట్లు తెలుస్తోంది. తనకు ఏయే వర్గాల ప్రజలు దూరం అయ్యారని, అందుకు గల కారణాలు ఏమిటనే దానిపై ప్రధానంగా విశ్లేషించుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలు సైతం ఏఏ సామాజిక వర్గాలు తమను దూరంగా ఉంచాయన్న దానిపై వివరాలు ఆరా తీస్తున్నారు. -
మంత్రి గీతారెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
మెదక్: జిల్లాలో గౌతమబుద్ధ విగ్రహావిష్కరణలో శనివారం అపశృతి చోటుచేసుకుంది. ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రిగీతారెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేటలో గౌతమబుద్ధ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆమె హాజరైయ్యారు. ఆ విగ్రహావిష్కరణలో ఒక్కసారిగా స్టేజీ కూలడంతో ఈ ఘటన చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గీతారెడ్డికి స్వల్పగాయాలు కాగా, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్‌కు గాయపడినట్టు సమాచారం. -
పారిశ్రామిక రంగంలో రాష్ట్రానిది రెండో స్థానం
రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి గీతారెడ్డి సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో ఉందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి చెప్పారు. ఎస్సి, ఎస్టి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇగ్నైట్ పేరుతో హైదరాబాద్‌లో బుధవారం జరిగిన 21రోజుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రవుంలో గీతా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్ మే)లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పదేళ్ళ కిందట పరిశ్రమ రంగంలో ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రం రెండోస్థానానికి ఎదగడం గర్వకారణమని, త్వరలోనే ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జె.డీ. శీలం మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో పలువురికి ఉద్యోగాలు కల్పించేస్థాయికి దళితులు ఎదగాలన్నారు. రాష్ట్ర మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద రావు, కొండ్రు మురళీ మోహన్, పసుపులేని బాలరాజు మాట్లాడారు. -
సీమాంధ్ర నేతలకు ముందే తెలుసు: గీతారెడ్డి
-
విభజన గురించి వారికి ముందే తెలుసు: మంత్రి గీతారెడ్డి
ఇప్పుడు ఏకపక్ష నిర్ణయమనడం బాధాకరం సీఎం సహా ఎవరేం చేస్తున్నారన్న దానిపై హైకమాండ్ నిఘా ఉంది విభజన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది సీమాంధ్రుల రక్షణకు పార్టీ, ప్రభుత్వం తరఫున మేం భరోసా ఇస్తున్నాం ఇప్పుడు కాకపోయినా శీతాకాలంలో తెలంగాణ బిల్లు! ఫిబ్రవరి, మార్చికల్లా విభజన జరుగుతుంది నిర్ణయానికి ముందే సీమాంధ్ర నేతలు సోనియాను కలిశారు ఆ తర్వాతే సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నారు సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన ఎంపీలు, మంత్రులకు విభజన గురించి ముందే తెలుసునని మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. విభజన నిర్ణయం వెలువడటానికి ముందే ఆయా నేతలంతా సోనియాగాంధీని కలిశారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఉద్యమాలు, ఇతర పరిణామాలు, వాటి వెనుక ఎవరున్నారనే అంశాలపై కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా అందరిపైనా అధిష్టానం పెద్దలు కన్నేసి ఉంచారని పేర్కొన్నారు. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని, రాష్ర్టం విడిపోయాక కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, సీమాంధ్రుల రక్షణకు పార్టీ, ప్రభుత్వం తరఫున తాము భరోసా ఇస్తున్నామని చెప్పారు. మంత్రులు డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విప్ అనిల్‌కుమార్, ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఏకపక్షంగా హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకుందన్న సీమాంధ్ర నేతల వ్యాఖ్యలను గీతారెడ్డి తప్పుపట్టారు. ‘‘ఇది ఏకపక్ష నిర్ణయం కానేకాదు. విస్తృత చర్చలు, సంప్రదింపులు చేసిన తర్వాతే సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు విభజన నిర్ణయానికి ముందు కూడా సోనియాను కలిశారు. ‘మీ బాగోగులు మేం చూస్తాం. మీరు బాధపడాల్సిన పనిలేదు’ అని ఆయా నేతలకు సోనియాగాంధీ హామీ ఇచ్చిన తర్వాతే సీడబ్ల్యూసీలో, యూపీఏలో విభజనపై నిర్ణయం తీసుకున్నారు’’ అని వివరించారు. అయినా కొందరు నేతలు సోనియాగాంధీని కించపరచడం బాధాకరమన్నారు. విభజనపై హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం, పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తీర్మాన పత్రంపై సంతకాలు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘సీఎం అలా సంతకం చేసినట్లు నాకు తెలీదు. ఆయన తటస్థంగా వ్యవహరించారని అర్థమైంది. అయితే ఒక్కటి మాత్రం చెబుతున్నా. ఎవరైనా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, సీఎం సహా ఎవరేం చేస్తున్నారనే విషయంపై హైకమాండ్ నిఘా ఉంచింది. వాళ్లే తగిన చర్యలు తీసుకుంటారు..’’ అని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణపై ఎలా ముందుకు వెళ్లాలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసునని పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కాకపోయినా శీతాకాల సమావేశాల్లోనైనా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్ర విభజన జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. మహిళలు ఎందులోనూ తీసిపోరు..: హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసినందున హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమనో, ఇంకో రకంగా చేయాలనో వాదనలు సరికాదని మంత్రి గీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లోకి ఎవరైనా బేషరతుగా రావచ్చని, అందరికీ తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం పదవిలో మహిళలకు అవకాశమివ్వాలని కోరుతారా అని అడగ్గా... అది అప్రస్తుతమని, ఏదైనా అధిష్టానం నిర్ణయం ప్రకారమే ఉంటుందన్నారు. మహిళలు పురుషులకు దేనిలోనూ తీసిపోరని, యూపీఏ చైర్పర్సన్, లోక్‌సభ స్పీకర్‌తో సహ అనేక కీలక బాధ్యతల్లో మహిళలే ఉన్నారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులు లేవనెత్తుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. ‘‘మీరు ఇక్కడే ఉండొచ్చు. మేం ఉన్నాం. విభజన తర్వాత కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. పార్టీ, ప్రభుత్వం తరఫున మీకు భరోసా ఇస్తున్నాం. మీ బాగోగులు మేం చూస్తాం. భద్రత కల్పిస్తాం. భావోద్వేగాలకు లోను కాకండి’’ అని చెప్పారు. ై హెదరాబాద్తోపాటు దేశ, విదేశాల్లో వ్యాపారం చేస్తున్న దిగ్గజాల్లో ఎంతో మంది సీమాంధ్రులున్నారని, వారు ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చిత్తూరు జిల్లాలో సోనియాగాంధీపై అసభ్యకరంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి డీకే అరుణ చెప్పారు. మహిళను కించపరిచేలా ఉన్న ఫ్లెక్సీ ఫొటోను ఓ పత్రికలో(సాక్షి కాదు) ప్రచురించడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో తల్లి, సోదరి ఒక మహిళ అనే విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. దీనివెనుక ఎవరున్నారనే విషయంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోర తామని తెలిపారు.