
పీఏసీ చైర్మన్ గా గీతారెడ్డి?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డాక్టర్ జె.గీతారెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. గీతారెడ్డి శనివారం ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పీఏసీ చైర్మన్ పదవిని ఇవ్వడం ఆనవాయితీ. దీని ప్రకారం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కి ఆ పదవి దక్కనుంది. ఇంతకు ముందు పీఏసీ చైర్మన్‌గా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఈ పదవి ఖాళీ అయింది. కాంగ్రెస్ నుంచి చాలామంది సీనియర్లు ప్రస్తుతం శాసనసభలో ఉన్నారు. ఇందులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతుండగా, చిన్నారెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారు. దీనితో పీఏసీ పదవికి గీతారెడ్డి లేదా జీవన్‌రెడ్డిని పంపించాలనే అంశంపై సీఎల్పీ చర్చించింది. సీనియర్ ఎమ్మెల్యే కావడం, మహిళా శాసనసభ్యురాలు.. సామాజిక వర్గం వంటి సమీకరణాల నేపథ్యంలో చివరకు గీతారెడ్డిని తమ అభ్యర్థిగా నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
పీఏసీ ఎన్నిక నోటిఫికేషన్ జారీ...
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ), పబ్లిక్ అండర్‌టేకింగ్ సంస్థల సమితి ఎన్నికల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ కమిటీల్లో సభ్యులుగా ఎన్నికయేందుకు శాసనమండలి నుంచి ఇద్దరికి అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలవరకు నామినేషన్లను స్వీకరిస్తారని, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 చివరి గడువు కాగా, 22న ఎన్నిక జరుగుతుందని కడియం వెల్లడించారు.