విభజన గురించి వారికి ముందే తెలుసు: మంత్రి గీతారెడ్డి | They already know about State bifurcation, says J Geeta Reddy | Sakshi
Sakshi News home page

విభజన గురించి వారికి ముందే తెలుసు: మంత్రి గీతారెడ్డి

Published Fri, Aug 9 2013 3:10 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

విభజన గురించి వారికి ముందే తెలుసు: మంత్రి గీతారెడ్డి - Sakshi

విభజన గురించి వారికి ముందే తెలుసు: మంత్రి గీతారెడ్డి

ఇప్పుడు ఏకపక్ష నిర్ణయమనడం బాధాకరం
సీఎం సహా ఎవరేం చేస్తున్నారన్న దానిపై హైకమాండ్ నిఘా ఉంది
 విభజన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
 సీమాంధ్రుల రక్షణకు పార్టీ, ప్రభుత్వం తరఫున మేం భరోసా ఇస్తున్నాం
ఇప్పుడు కాకపోయినా శీతాకాలంలో తెలంగాణ బిల్లు!
 ఫిబ్రవరి, మార్చికల్లా విభజన జరుగుతుంది
నిర్ణయానికి ముందే సీమాంధ్ర నేతలు సోనియాను కలిశారు
ఆ తర్వాతే సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నారు

 
 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన ఎంపీలు, మంత్రులకు విభజన గురించి ముందే తెలుసునని మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. విభజన నిర్ణయం వెలువడటానికి ముందే ఆయా నేతలంతా సోనియాగాంధీని కలిశారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఉద్యమాలు, ఇతర పరిణామాలు, వాటి వెనుక ఎవరున్నారనే అంశాలపై కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా అందరిపైనా అధిష్టానం పెద్దలు కన్నేసి ఉంచారని పేర్కొన్నారు. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని, రాష్ర్టం విడిపోయాక కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, సీమాంధ్రుల రక్షణకు పార్టీ, ప్రభుత్వం తరఫున తాము భరోసా ఇస్తున్నామని చెప్పారు.
 
 మంత్రులు డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విప్ అనిల్‌కుమార్, ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఏకపక్షంగా హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకుందన్న సీమాంధ్ర నేతల వ్యాఖ్యలను గీతారెడ్డి తప్పుపట్టారు. ‘‘ఇది ఏకపక్ష నిర్ణయం కానేకాదు. విస్తృత చర్చలు, సంప్రదింపులు చేసిన తర్వాతే సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు విభజన నిర్ణయానికి ముందు కూడా సోనియాను కలిశారు. ‘మీ బాగోగులు మేం చూస్తాం. మీరు బాధపడాల్సిన పనిలేదు’ అని ఆయా నేతలకు సోనియాగాంధీ హామీ ఇచ్చిన తర్వాతే సీడబ్ల్యూసీలో, యూపీఏలో విభజనపై నిర్ణయం తీసుకున్నారు’’ అని వివరించారు. అయినా కొందరు నేతలు సోనియాగాంధీని కించపరచడం బాధాకరమన్నారు.
 
 విభజనపై హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం, పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తీర్మాన పత్రంపై సంతకాలు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘సీఎం అలా సంతకం చేసినట్లు నాకు తెలీదు. ఆయన తటస్థంగా వ్యవహరించారని అర్థమైంది. అయితే ఒక్కటి మాత్రం చెబుతున్నా. ఎవరైనా సరే పార్టీ  నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, సీఎం సహా ఎవరేం చేస్తున్నారనే విషయంపై హైకమాండ్ నిఘా ఉంచింది. వాళ్లే తగిన చర్యలు తీసుకుంటారు..’’ అని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణపై ఎలా ముందుకు వెళ్లాలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసునని పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కాకపోయినా శీతాకాల సమావేశాల్లోనైనా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్ర విభజన జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.
 
 మహిళలు ఎందులోనూ తీసిపోరు..: హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసినందున హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమనో, ఇంకో రకంగా చేయాలనో వాదనలు సరికాదని మంత్రి గీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లోకి ఎవరైనా బేషరతుగా రావచ్చని, అందరికీ తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం పదవిలో మహిళలకు అవకాశమివ్వాలని కోరుతారా అని అడగ్గా... అది అప్రస్తుతమని, ఏదైనా అధిష్టానం నిర్ణయం ప్రకారమే ఉంటుందన్నారు. మహిళలు పురుషులకు దేనిలోనూ తీసిపోరని, యూపీఏ చైర్‌పర్సన్, లోక్‌సభ స్పీకర్‌తో సహ అనేక కీలక బాధ్యతల్లో మహిళలే ఉన్నారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులు లేవనెత్తుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. ‘‘మీరు ఇక్కడే ఉండొచ్చు. మేం ఉన్నాం. విభజన తర్వాత కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. పార్టీ, ప్రభుత్వం తరఫున మీకు భరోసా ఇస్తున్నాం. మీ బాగోగులు మేం చూస్తాం. భద్రత కల్పిస్తాం. భావోద్వేగాలకు లోను కాకండి’’ అని చెప్పారు. ై
 
 హెదరాబాద్‌తోపాటు దేశ, విదేశాల్లో వ్యాపారం చేస్తున్న దిగ్గజాల్లో ఎంతో మంది సీమాంధ్రులున్నారని, వారు ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చిత్తూరు జిల్లాలో సోనియాగాంధీపై అసభ్యకరంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి డీకే అరుణ చెప్పారు. మహిళను కించపరిచేలా ఉన్న ఫ్లెక్సీ ఫొటోను ఓ పత్రికలో(సాక్షి కాదు) ప్రచురించడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో తల్లి, సోదరి ఒక మహిళ అనే విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. దీనివెనుక ఎవరున్నారనే విషయంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోర తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement