ప్రశాంతంగా టీజీడీఏ ఎన్నికలు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీడీఏ) యూనిట్ల ఎన్నికల ఫలితాలు సోమవారం రాత్రి ప్రకటించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. కాగా ఒక్కో యూనిట్‌లో 19 పోస్టులకు ఎన్నికలు నిర్వహించగా, సుమారు 1500 మంది వైద్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితాలు ఇలా ఉన్నాయి..
యూనిట్-1లో..
ఉస్మానియా యూనిట్-1 పరిధిలో ఉస్మానియా వైద్యకళాశాల, ఉస్మానియా ఆస్పత్రి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, ఉస్మానియా దంత వైద్య కళాశాల ఉన్నాయి. ఇక్కడ 350 ఓట్లకు గాను 346 ఓట్లు పోలయా ్యయి. నూతన అధ్యక్షుడిగా ఉస్మానియా ఆస్పత్రి సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ బి.నాగేందర్ విజయం సాధించారు. ప్రధాన కార్య దర్శిగా మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.బాలరాజు, కోశాధికారిగా అనెస్థీయా ఇన్‌చార్జి డాక్టర్ పాండునాయక్, జనరల్ కౌన్సిల్ మెంబర్‌గా డాక్టర్ రాజు విజయం సాధించారు.
యూనిట్-2లో..
ఉస్మానియా యూనిట్-2 పరిధిలో నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, ఎర్రగడ్డలోని ఛాతి, మానసిక చికిత్సాలయం, ఐపీఎం నారాయణగూడ, ఈఎన్‌టీ ఆస్పత్రి ఉన్నాయి. ఇక్కడ 300 మంది ఓటర్లకు 295 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నూతన అధ్యక్షుడిగా సరోజినిదేవి కంటి ఆస్పత్రి డాక్టర్ రవీందర్‌గౌడ్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ లక్ష్మీనారాయణ, కోశాధికారిగా డాక్టర్ వినోద్‌కుమార్, జనరల్ కౌన్సిల్ మెంబర్స్‌గా తరుణి, మురళీధర్‌రావు, సీఈసీ మెంబర్‌గా నరహరి గెలుపొందారు.
గాంధీ యూనిట్‌లో..
గాంధీ మెడికల్ కళాశాల, గాంధీ జనరల్ ఆస్పత్రి యూనిట్‌లో 350 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 20 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నూతన అధ్యక్షుడిగా గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ శ్రవణ్‌కుమార్ విజయం సాధించారు. కార్యదర్శిగా డాక్టర్ సిద్ధిపేట రమేష్, కోశాధికారిగా కె.భూమేష్‌కుమార్, ఉపాధ్యక్షులుగా కె.రాణి, రమేష్‌బాబు, సంయుక్త కార్యదర్శిగా శోభ, జనరల్ కౌన్సిల్ మెంబర్‌గా త్రిలోక్ చందర్, జనరల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ప్రశాంత్ ఎన్నికయ్యారు.