► అన్నాడీఎంకే, డీఎంకేల పోటా పోటీ
► పుదుచ్చేరిలో కాంగ్రెస్, అన్నాడీఎంకే ఢీ
► నేడే ఓట్ల లెక్కింపు సాయంత్రానికి ఫలితాలు
తమిళనాడులో మూడు, పుదుచ్చేరిలో ఒక స్థానంలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగనుంది. అంతా సజావుగా సాగితే మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజేతలు ఎవరో సాయంత్రానికి తేలిపోనుంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ మొత్తం 234 స్థానాలు ఉండగా, ఈ ఏడాది మేలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 232 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. నగదు, చీరలు, పంచెలు, మద్యం బాటిళ్లు సరఫరా చేయడం ద్వారా ఓటర్లను మభ్యపెట్టినట్లు ఆరోపణలు రావడంతో తంజావూరు, కరూరు జిల్లా అరవకురిచ్చి స్థానాల్లో ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. మధురై జిల్లా తిరుప్పరగున్రం నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనివేల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ స్థానాల్లో అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, బీజేపీ, డీఎండీకేలు తమ అభ్యర్థులను బరిలోకి దించారుు. ఉప ఎన్నికల్లో భాగంగా గత నెల 26 నుంచి ఈ నెల 2 వరకూ అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు.
ఈనెల 3న నామినేషన్ల పరిశీలన, 5వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణ, అదే రోజు ఉప ఎన్నికల రంగంలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. తంజావూరు స్థానం నుండి 14 మంది, అవరకురిచ్చీ నుంచి 39 మంది, తిరుప్పరగున్రం నుంచి 28 మంది, పుదుచ్చేరి రాష్ట్రం నెల్లితోప్పు నుంచి 8 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన పోలింగ్ పూర్తి కాగా, 22న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులే ప్రధాన ప్రత్యర్థులుగా పోటీపడ్డారు.
అరవకురిచ్చీలో డీఎంకే అభ్యర్థి కేసీ.పళనిస్వామి, అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ, తంజావూరులో అన్నాడీఎంకే అభ్యర్థి రంగస్వామి, డీఎంకే అభ్యర్థి డాక్టర్ అంజగం భూపతి, తిరుప్పరగున్రంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే.బోస్, డీఎంకే అభ్యర్థి డాక్టర్ శరవణన్ పోటీ చేశారు. అలాగే, పుదుచ్చేరి నెల్లితోప్పులో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఓం శక్తిశేఖర్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఈ నెల 19న నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో 22వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. తంజావూరులో 69.41, అరవకురిచ్చీలో 82.15, తిరుప్పరగున్రంలో 71, నెల్లితోప్పులో 86 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఉప విజేతలెవరో?
Published Tue, Nov 22 2016 3:51 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
Advertisement