విధుల పంచాయితీ
- వివాదంగా మారిన ఉద్యోగుల కాపలా
- {స్టాంగ్‌రూంల వద్ద సెక్యూరిటీ గార్డు బాధ్యతలపై విమర్శలు
- జెడ్పీ సీఈఓ ఆదేశాలపై సర్వత్రా నిరసన
- విధుల్లో చేరిన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు
- మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చిన మినహాయింపు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : స్థానిక ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్‌లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంల వద్ద జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను కాపలా పెట్టడం వివా దంగా మారింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లాలోని ములుగు, పరకాల, మహబూబాబాద్, వరంగల్, నర్సంపేట, జనగామ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆరు స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్స్‌లను భద్రపర్చారు.
వీటి భద్రత బాధ్యతలను పోలీసు యంత్రాంగం చేపట్టింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియను సుప్రీం కోర్టు వాయిదా వేయడంతో స్ట్రాంగ్ రూంల వద్ద రాష్ట్ర ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సుప్రీం ఆదేశాల ప్రకారం వచ్చే నెల ఏడో తేదీ తర్వాతే లెక్కింపు చేపట్టాలి. తుది విడత పోలింగ్ జరిగిన రోజు నుంచి లెక్కేస్తే... సుమారు 30 రోజుల వ్యవధి ఉంది.
ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చిన బ్యాలెట్ బాక్సులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఈసీ నిర్ణయం తీసుకుంది. స్ట్రాంగ్ రూంలు జిల్లా కేంద్రంలో ఉంటే కలెక్టర్ గానీ... జేసీ గానీ, రెవెన్యూ డివిజన్లలో ఉంటే ఆయా డివిజన్లకు చెందిన ఆర్డీఓలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాలెట్ పేపర్లు చెదలు, చీడపురుగులతో పాడవకుండా పరిశీలించేందుకు ఆర్డీఓలతోపాటు ఆయా మండలాలకు చెందిన ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు... పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో వారంలో ఒక రోజు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్‌ఈసీ రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంతవరకు వ్యవహారం బాగానే ఉంది.
ఈ క్రమంలో జిల్లాలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు స్ట్రాంగ్ రూంల వద్ద కాపలా ఉండాలని సీఈఓ ఆంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజూ ముగ్గురు చొప్పున సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మూడు షిప్టులుగా ఎనిమిది గంటలపాటు విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అరుుతే ఈ విధుల నుంచి మహిళా ఉద్యోగులను మినహాయించడం వారికి ఊరటనిస్తోంది.
ఇది సరికాదు...
ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్ బాక్సులను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టినప్పటికీ... పీఆర్ ఉద్యోగులను కాపలా పెట్టడం సరికాదని తెలంగాణ పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బేహర శ్రీకాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తుంటే... ఇక్కడ పీఆర్‌కు చెందిన ఉద్యోగులకు కూడా డ్యూటీలు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పీఆర్ ఉద్యోగులు ఇప్పటి వరకు ఎన్నడూ స్ట్రాంగ్ రూంల వద్ద విధులు నిర్వర్తించలేదని... జెడ్పీ సీఈఓ నిర్ణయంతో వారు ఆందోళనలకు గురవుతున్నారన్నారు. స్ట్రాంగ్‌రూంల వద్ద పీఆర్ ఉద్యోగులను కాపలా పెట్టడం పోలీసులను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఇలాంటి వివాదాస్పదమైన నిర్ణయంపై సీఈఓ పునరాలోచించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.