సాక్షి, ఒంగోలు: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సోమవారం... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మంగళవారం... ఆ తర్వాత 16వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇలా వరుసగా, ఎన్నికల ఫలితాల వెల్లడి క్రమంలో రాజకీయ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఊరూరా రాజకీయ చర్చలే నడుస్తున్నాయి. ఏపార్టీ గెలుస్తోంది.. ఏఅభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తోందనే విషయంపై చిన్నా,పెద్దా లెక్కలు కడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎవరు గెలవనున్నారో తేలేముందు .. మున్సిపల్, ప్రాదేశిక స్థానాలు ఏపార్టీ పరం కానున్నాయోననే విషయంపై అందరి దృష్టిపడింది. ఈ రెండింటి ఫలితాలను బట్టి సార్వత్రిక అంచనాలు కొలిక్కిరానున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఆరు మున్సిపాలిటీల ఓట్లలెక్కింపు..
జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, కందుకూరు మున్సిపాలిటీల ఎన్నికలు కోర్టు వ్యాజ్యాల నేపథ్యంలో వాయిదా పడగా, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీలతో పాటు అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి నగర పంచాయతీలకు మార్చి నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. అన్నిచోట్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా.. చీరాల, గిద్దలూరులో స్వతంత్ర అభ్యర్థులూ గట్టిపోటీనే ఇచ్చారు. అయితే, అన్నిచోట్లా సామాజికవర్గ ఓటింగ్, మహిళలు, యువత అధికంగా వైఎస్‌ఆర్ సీపీకే మొగ్గు చూపినట్లు
రాజకీయ పరిశీలకులు ఇప్పటికే అంచనా వేశారు. పట్టణాల్లో టీడీపీ ప్రాభవం పూర్తిగా తగ్గిపోగా.. ఓటర్లలో విశ్వసనీయతను ఆపార్టీ సంపాదించుకోలేకపోయిందనే విశ్లేషణలు వినిపించాయి.
జెడ్పీచైర్మన్‌గిరీ ఎవరి పరం..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లాలో రెండు దశలుగా జరిగాయి. ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 790 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 8, టీడీపీ 7, స్వతంత్రులు 6 చోట్ల ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. దీంతో 769 ఎంపీటీసీ, 56 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ పదవి రిజర్వేషన్ ఓసీ జనరల్ కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తమపార్టీ తరఫున జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా బీసీ సామాజికవర్గ నేతకు కేటాయించారు. ఆమేరకు నూకసాని బాలాజీని వైఎస్‌ఆర్ సీపీ ప్రకటించింది. టీడీపీ నుంచి మన్నె రవీంద్ర, ఈదర హరిబాబును ప్రకటించారు.
మంగళవారం తేలే ఫలితాల్లో వీరి భవితవ్యంతో పాటు మండల పరిషత్ అధ్యక్షులెవరనేది వెల్లడికానుంది. అటు మున్సిపల్, ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు 16న జరిగే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాతకాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. గెలుపు ధీమాపై ఎవరికి వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. రాజకీయ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
టెన్షన్.. టెన్షన్
Published Sun, May 11 2014 1:52 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement