ప్రతీకాత్మక చిత్రం
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నెపల్లిలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుకు చెందిన గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు మృతి చెందారు. హన్మంత్‌రావు తన అత్తగారి ఊరైన జన్నెపల్లిలో 22 ఏళ్ల క్రితం వ్యవసాయభూమిని కొనుగోలు చేసి, అందులో రెండంతస్తుల గెస్ట్‌హౌస్ నిర్మించారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలప్పుడు ఎమ్మెల్యే తొమ్మిది రోజులు ఇక్కడే ఉండి దుర్గామాత ఆలయంలో పూజలు చేస్తుంటారు. అప్పుడప్పుడూ వచ్ఛివెళ్తుంటారు.
కాగా, తాజాగా చేపట్టిన గెస్ట్‌హౌస్ ఆధునీకరణ పనుల కోసం శుక్రవారం కాంట్రాక్టర్‌తోపాటు నిజామాబాద్ నుంచి ఐదుగురు కూలీలు వచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు భోజనానికి వెళ్లగా, కొండపల్లి రాజు(28), అతడి మిత్రుడు రెండో అంతస్తులోని గోడను తొలగించి, కిందపడేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గోడతోపాటు కొండపల్లి రాజు కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన మరో కూలీ ఒక్కసారిగా రెండో అంతస్తులోనే వాంతులు చేసుకుని కుప్పకూలాడు. పెద్దశబ్దం దరావడంతో మిగతా కూలీలు పైకి వచ్చి అతడి ఛాతీపై నొక్కి రక్షించేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ రాజారెడ్డి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజు తండ్రి శంకర్ రిటైర్డ్ సీఆర్‌పీఎఫ్ ఉద్యోగి.
నవీపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో స్థిరపడింది. రాజుకు పెళ్లయిన సోదరి ఉంది.గుండెపోటుతో మృతి చెందిన మరోకూలీ పేరు చంపాల్వాడి సాయిలు(29). భార్యతో విడిపోయిన సాయిలు నిజామాబాద్‌లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన వీరి కుటుంబం ఏళ్లక్రితం వలస వచ్ఛింది.
Comments
Please login to add a commentAdd a comment