Hanmantrao
-
ఏసీబీ వలకు చిక్కిన మావల తహసీల్దార్
ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా మావల తహసీల్దార్ ఆరిఫా సుల్తానా, ఆర్ఐ హన్మంత్‌రావు ఆదివారం ఏసీబీ వలలో చిక్కుకున్నారు. మావల పట్టణ శివారులోని వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్‌లో పేరు సవరణ కోసం రైతుల నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన నిర్మల్కర్ సుధాకర్‌తోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా మావల శివారు సర్వే నంబర్ 181లో 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఒక్కొక్కరి పేరిట మూడున్నర ఎకరాలు ఉన్నాయి. వీరు యతేంద్రనాథ్ యాదవ్‌ను రిప్రజెంటర్‌గా ఉంచారు. పట్టా పాస్‌బుక్‌లలో పేర్లకు సంబంధించి మార్పుల కోసం 2023, ఏప్రిల్ 13న మావల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ ఆరీఫా సుల్తానాను కలిసి పనులు పూర్తి చేయాలని విన్నవించారు. ఈ క్రమంలో ఆర్ఐ హన్మంత్‌రావు వారిని రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. మొదట రూ.2 లక్షలు ఇవ్వాలని సూచించగా, యతేంద్రనాథ్ ఈ నెల 21న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డబ్బులు ముట్టజెబుతుండగా ఏసీబీ అధికారులు తహసీల్దార్, ఆర్ఐలను పట్టుకున్నారు. వీరిని కరీంనగర్ ఏసీబీ కోర్టుకు రిమాండ్ కోసం తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. -
గోడకూలి ఒకరు.. అది చూసి మరొకరు
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నెపల్లిలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుకు చెందిన గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు మృతి చెందారు. హన్మంత్‌రావు తన అత్తగారి ఊరైన జన్నెపల్లిలో 22 ఏళ్ల క్రితం వ్యవసాయభూమిని కొనుగోలు చేసి, అందులో రెండంతస్తుల గెస్ట్‌హౌస్ నిర్మించారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలప్పుడు ఎమ్మెల్యే తొమ్మిది రోజులు ఇక్కడే ఉండి దుర్గామాత ఆలయంలో పూజలు చేస్తుంటారు. అప్పుడప్పుడూ వచ్ఛివెళ్తుంటారు. కాగా, తాజాగా చేపట్టిన గెస్ట్‌హౌస్ ఆధునీకరణ పనుల కోసం శుక్రవారం కాంట్రాక్టర్‌తోపాటు నిజామాబాద్ నుంచి ఐదుగురు కూలీలు వచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు భోజనానికి వెళ్లగా, కొండపల్లి రాజు(28), అతడి మిత్రుడు రెండో అంతస్తులోని గోడను తొలగించి, కిందపడేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గోడతోపాటు కొండపల్లి రాజు కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన మరో కూలీ ఒక్కసారిగా రెండో అంతస్తులోనే వాంతులు చేసుకుని కుప్పకూలాడు. పెద్దశబ్దం దరావడంతో మిగతా కూలీలు పైకి వచ్చి అతడి ఛాతీపై నొక్కి రక్షించేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రాజారెడ్డి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజు తండ్రి శంకర్ రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఉద్యోగి. నవీపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో స్థిరపడింది. రాజుకు పెళ్లయిన సోదరి ఉంది.గుండెపోటుతో మృతి చెందిన మరోకూలీ పేరు చంపాల్వాడి సాయిలు(29). భార్యతో విడిపోయిన సాయిలు నిజామాబాద్‌లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన వీరి కుటుంబం ఏళ్లక్రితం వలస వచ్ఛింది. -
మహిళల స్వావలంబనతోనే రాష్ట్రాభివృద్ధి
తూప్రాన్: మహిళలు స్వావలంబన దిశగా ముందుకు సాగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ‘గడా’ అధికారి హన్మంతరావు పేర్కొన్నారు. తూప్రాన్ మండలంలోని 71 సమైక్య సంఘం మహిళా గ్రూపులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల రుణా వితరణ కార్యక్రమంలో రూ.2.10 కోట్ల రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి గడా అధికారి హన్మంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మహిళలు భర్తలపై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారన్నారు. ప్రస్తతం మహిళలంతా గ్రూపుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా రుణాలను పొంది స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారన్నారు. దీంతో భార్యలపైనే భర్తలు ఆధారపడే విధంగా నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం కావడంలేదన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.10 వేలు చెల్లిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెటి ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.50 వేలు, భూమి లేని దళిత రైతులకు మూడెకరాల భూమిని కేటాయిస్తున్నారని వివరించారు. డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలకు 2013 డిసెంబరు నుంచి సెప్టెంబరు వరకు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీలను వారి ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు. స్త్రీనిధి ద్వారా చెల్లిస్తున్న లావాదేవీల్లో మెదక్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. త్వరలోనే జిల్లాలోని 6,800 మహిళా గ్రాపులకు రూ.204 కోట్ల రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఎస్బీఐ రీజినల్ మేనేజర్ టీవీ రమణ మాట్లాడుతూ తమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నామన్నారు. అంతకు ముందు మహిళలు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుమన భాస్కర్‌రెడ్డి, తహశీల్దార్ స్వామి, ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, ఎంపీడీఓ కరుణలీల, స్థానిక సర్పంచ్ శివ్వమ్మ ఐకేపీ ఏపీఎం యాదగిరి, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.