తూప్రాన్: మహిళలు స్వావలంబన దిశగా ముందుకు సాగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ‘గడా’ అధికారి హన్మంతరావు పేర్కొన్నారు. తూప్రాన్ మండలంలోని 71 సమైక్య సంఘం మహిళా గ్రూపులకు ఎస్‌బీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల రుణా వితరణ కార్యక్రమంలో రూ.2.10 కోట్ల రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి గడా అధికారి హన్మంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మహిళలు భర్తలపై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారన్నారు. ప్రస్తతం మహిళలంతా గ్రూపుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా రుణాలను పొంది స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారన్నారు. దీంతో భార్యలపైనే భర్తలు ఆధారపడే విధంగా నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం కావడంలేదన్నారు.
గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.10 వేలు చెల్లిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెటి ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.50 వేలు, భూమి లేని దళిత రైతులకు మూడెకరాల భూమిని కేటాయిస్తున్నారని వివరించారు. డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలకు 2013 డిసెంబరు నుంచి సెప్టెంబరు వరకు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీలను వారి ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు.
స్త్రీనిధి ద్వారా చెల్లిస్తున్న లావాదేవీల్లో మెదక్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. త్వరలోనే జిల్లాలోని 6,800 మహిళా గ్రాపులకు రూ.204 కోట్ల రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ టీవీ రమణ మాట్లాడుతూ తమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నామన్నారు. అంతకు ముందు మహిళలు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుమన భాస్కర్‌రెడ్డి, తహశీల్దార్ స్వామి, ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, ఎంపీడీఓ కరుణలీల, స్థానిక సర్పంచ్ శివ్వమ్మ ఐకేపీ ఏపీఎం యాదగిరి, ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
మహిళల స్వావలంబనతోనే రాష్ట్రాభివృద్ధి
Published Wed, Oct 1 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM
Advertisement