మీడియాతో మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: పచ్చి అబద్ధాలతో పచ్చ రాతలు రాస్తూ అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితమైందని అన్నారు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. సోమవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఈనాడు అధినేత రామోజీరావుకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితం అయ్యిందని, రామోజీరావుకు కనబడేదల్లా అబద్ధాలే అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ‘‘పేదలకు ఇళ్లు కట్టించాలన్న సంకల్పంతో సీఎం జగన్ ప్రభుత్వం పని చేస్తోంది. కానీ, ఈ ప్రభుత్వంపై దిగజారుడు రాతలు రాస్తున్నారు. చంద్రబాబు తన హయాంలో స్థలం ఇవ్వలేదు.. ఇల్లూ కట్టలేదు. 14 ఏళ్ల పాలనలో ఏమీ చేయని చంద్రబాబుకు రామోజీరావు వంతపాడుతున్నారు. ఇప్పుడేమో సీఎం జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్న మంత్రి జోగి రమేష్.. జరుగుతున్న వాస్తవాలను రామోజీరావు చూడలేకపోతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ఊరికొక ఇంటిని కట్టారు.కానీ, సీఎం వైఎస్ జగన్ కొత్తగా ఊళ్లనే నిర్మిస్తున్నారు. పేదలకు ఇళ్లు కడుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉందని మండిపడ్డారు. తప్పుడు కథనాలపై చర్చకు సిద్ధమా అంటూ రామోజీరావుకు సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్.
Comments
Please login to add a commentAdd a comment