ఇందిరమ్మ బిల్లు రాలేదని వ్యక్తి ఆత్మహత్య
పాపన్నపేట : ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కొత్తపల్లి గ్రామ శివారులో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఏఎస్‌ఐ విఠల్ కథనం మేరకు.. మండలంలోని యూసుఫ్‌పేటకు చెందిన సాయిలు (42)కు గతేడాది ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో ఉన్న గుడిసెను కూలగొట్టి అప్పులు చేసి బేస్‌మెంట్ వరకు ఇంటిని నిర్మించాడు. కానీ.. నేటి వరకు ఆ బిల్లులు రాలేదు.
ఓ వైపు అప్పుల బాధలు, మరోవైపు పూట గడవని పరిస్థితితో ఆందోళనకు గురైన సాయిలు.. మూడు రోజలుగా భోజనం చేయడం లేదు. గురువారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెతక సాగారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న కొత్తపల్లి గ్రామ శివారులో గల సాంబయ్య వ్యవసాయ బావి వద్ద సాయిలుకు చెందిన దుస్తులు శుక్రవారం కనిపించాయి. గాలించగా అతడి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ విఠల్ వివరించారు.