సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిన్న మర్వెల్లి.. నేడు గౌతోజీగూడెం.. రేపు మరో పల్లె. ఇలా సర్కారు నిర్లక్ష్యం పెనుశాపమై పల్లె జనం బతుకులను కాల్చివేస్తోంది. పొద్దంతా కష్టం చేసి అలసిపోయి, పొద్దుగూకిన వేళ గుడిసెకు చేరి గాఢ నిద్రలోకి జారుకుంటున్న పేద ప్రజానీకం అనుకోని ఆపదతో ‘శాశ్వత నిద్ర’లోకి వెళ్లిపోతున్నారు. నిశిరాత్రి నిద్రలో ఉన్నవేళ గుడిసెకు నిప్పంటుకొని అందులోనే సజీవ దహనమవుతున్న ప్రాణాలు కొన్ని అయితే.. రాత్రి వేళ గుడిసెల్లోకి విష సర్పాలు చొరబడి కాటేస్తున్న సంఘటనలు ఇంకొన్ని.
ఇలా పల్లె ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. పూరి గుడిసెలో నివసిస్తున్న పేదల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక క్షణ క్షణం బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పొద్దంతా కష్టం చేసి గుడిసెలో కాసింత సేద తీరుదామనుకునేలోపే ఏదో ప్రమాదం ముంచుకొస్తోంది. మహిళల బతుకు ఇంకా ఘోరం. కామాంధుల ఘాతుకాలకు మహిళలు బలైపోతున్న ఘటనలు కూడా ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి.
ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తే ఇలాంటి ప్రమాదాలు సంభవిం చేవే కావు. ‘రాష్ట్రంలో ఎక్కడా పూరిల్లు అనేదే ఉండకూడదని, అర్హులైన ప్రతి పేదవానికి పక్కా ఇల్లు ఉం డాలని, సొంతిట్లో ప్రతి చెల్లెమ్మ, ఆమె కుటుంబం హాయిగా నిద్రపోవాలని’ వైఎస్సార్ ఇందిరమ్మ ఇల్లు పథకం అమల్లోకి తెచ్చారు. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకానికి నిబంధనల పేరులో తూట్లు పొడిచాయి. అర్హులైన నిరుపేదలకు కూడా పక్కా ఇల్లు దక్కకపోవడంతో పూరి గుడిసెల్లో తలదాచుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
పూరి గుడిసెలతో ప్రాణాల మీదకు....
10 రోజుల కిందట అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో అర్ధరాత్రి వేళ గుడిసెకు నిప్పు అంటుకొని ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. తాజాగా శివ్వంపేట మండలం గౌతోజిగూడెంలో గురువారం అర్ధరాత్రి మరో సజీవ దహనం జరిగింది. పూరి గుడిసెకు నిప్పంటుకుని గోత్రాల లక్ష్మి అనే వృద్ధురాలు దుర్మరణం చెందింది.
కాగా మహేష్. మౌనిక అనే చిన్నారులు గాయపడ్డారు. నివాస గుడిసెలు అగ్నికి దగ్ధం కాగా ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బయటపడిన సంఘటనలు అనేకం. అగ్నికి సర్వం ఆహుతి కాగా పొట్టకూటికోసం యాచక వృత్తి చేసుకుంటున్న కుటుంబాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. సంఘటన జరిగినప్పుడు అధికారులు వచ్చి హడావుడి చేయడం, అంతో ఇంతో ఆర్థికసాయంతో ‘మమ’ అనిపించి బయటపడుతున్నారే తప్ప ఆ బాధితుల బాగోగుల గురించి కానీ, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం గానీ చేయటం లేదు. ఇక పాముకాటుతో జిల్లాలో ఏదో ఒక చోట సగటున ప్రతి 10 రోజులకు ఒకరి మరణిస్తున్నట్లు సమాచారం. అ సంఘటనలు మారుమూల ప్రాంతంలో జరగటంతో అధికారికంగా బయటికి రావటం లేదు.
ఆదుకోని ఇందిరమ్మ...
జిల్లాలో ఇందిరమ్మ పథకం మూడో దశ కింద 1.50 లక్షల మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టిన వివరాల ప్రకారమైతే 34,474 అప్లికేషన్లు మాత్రమే నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. 3,984 మంది ఇంకా బేస్‌మెంటు వరకు నిర్మించలేదని, 6,058 మంది బేస్‌మెంటు లేపారని, 1,680 మంది లింటల్ లెవల్ వరకు ఇల్లు నిర్మాణం చేసినట్లు చెప్పారు. మిగిలిన వారి పరిస్థితి ఏమిటో మాత్రం చెప్పలేదు. అధికారులు తిరస్కరించిన దరఖాస్తులకు ఎలాంటి వివరణ ఉండదు.
అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం వెంటనే స్పందించి పక్కా గృహాలు నిర్మించనంత కాలం ఇలాంటి అసహజ సంఘటనలు, ఘోర ప్రమాదాలు ఎప్పుడూ పొంచే ఉంటాయి. ప్రభుత్వం బాధ్యతను గుర్తించి పేదలకు పక్కా ఇల్లు నిర్మిస్తే ఇలాంటి మరణాలు, సంఘటనలను చాలా వరకు నివారించవచ్చని ప్రజా సంఘాలు చెబుతున్నాయి.