సేవా ముసుగులో అక్రమం | from the government show cause notice in Past | Sakshi
Sakshi News home page

సేవా ముసుగులో అక్రమం

Published Fri, Jul 11 2014 12:19 AM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM

సేవా ముసుగులో అక్రమం - Sakshi

సేవా ముసుగులో అక్రమం

రూ.25 కోట్ల స్థలంపై కన్ను
- శ్రీ సత్యసాయి ట్రస్టుకు దక్కాల్సిన స్థలం
- సొంత ట్రస్టుకు మార్చుకున్న అక్రమార్కుడు
- గతంలోనే ప్రభుత్వం నుంచి షోకాజు నోటీసులు
- స్వాధీనం చేసుకోవడంలో సర్కారు నిర్లక్ష్యం

ఆదిలాబాద్ : సేవా ముసుగులో ఓ ప్రైవేట్ వైద్యుడు రూ.25 కోట్ల స్థలాన్ని కబ్జా చేసేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలెట్టాడు. శ్రీ సత్యసాయి ట్రస్టుకు దక్కాల్సిన స్థలాన్ని అప్పట్లో దొడ్డిదారిన అధికారులను తప్పుతోవ పట్టించి తన సొంత ట్రస్టుకు మళ్లించాడు. భూమి కేటాయింపులో ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించి అడ్డదారులు తొక్కాడు. దీనిపై శ్రీ సత్యసాయి ట్రస్టు సభ్యులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అధికారులు చర్యలు చేపడుతామని చెప్పి మిన్నకుండి పోయారు. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న వైద్యుడు మళ్లీ ఆ స్థలాన్ని స్వాహా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. తాజాగా ఆ స్థలంలోని భవనంలో ఓ ప్రైవేట్ స్కూల్ నడిపేందుకు ఇతరులకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. దీన్ని బట్టి ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మళ్లీ మొదలు పెట్టాడని తెలుస్తోంది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సేవా ముసుగులో..
పుట్టపర్తి సత్యసాయి సంస్థకు అనుబంధంగా జిల్లాలో శ్రీశ్రీశ్రీ భగవన్ సత్యసాయి సేవా సమితి విద్యాసంస్థను నెలకొల్పాలని నిర్ణయించింది. దీని కోసం సేవా సమితికి 40 నుంచి 50 ఎకరాల భూమి కేటాయించాలని ఆ సంస్థ తరపున డాక్టర్ బి.ప్రకాశ్ 1996 డిసెంబర్ 25న అప్పటి కలెక్టర్‌కు దరఖాస్తు చేశాడు. అప్పట్లో ఈ సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రాచుర్యం పొందడంతో జిల్లాలోనూ భూమి కేటాయించాలని అప్పటి కలెక్టర్ శాంతికుమారి నిర్ణయించారు. ఆ సమయంలో సత్యసాయి సేవా సమితి పేరిట కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించిన వైద్యుడే స్వార్థానికి పాల్పడ్డాడు.

అదే పేరు స్పూరించే రీతిలో శ్రీ సత్యసాయి విద్యానికేతన్ పేరుతో అందులో సభ్యునిగా తాను, తన తల్లి, భార్య, తమ్ముళ్లను నియమించుకుని 1997 ఫిబ్రవరి 4న సత్యసాయి విద్యానికేతన్ అనే ట్రస్టును రిజిస్ట్రర్ చేయించాడు. ఆ ట్రస్టుకే ప్రభుత్వం 1999 ఆగస్టు 22న నంబర్ వి3/625/97 ద్వారా భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఆదిలాబాద్ మండలం బట్టిసావర్గాలోని సర్వే నంబర్ 72 న్యూహౌసింగ్‌బోర్డు కాలనీలో 13.31 ఎకరాల భూమిని ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.1,37,750 మార్కెట్ విలువతో ఈ విద్యా సంస్థకు కేటాయించారు. ఈ విద్యాసంస్థలో చదువుకునే 50 శాతం మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు వసూలు చేస్తున్న రుసుంను వసూలు చేయాలని, ఇతర అవసరాలకు వినియోగిస్తే స్వాధీనం చేసుకుంటామన్న షరతులతో అప్పటి కలెక్టర్ శాంతికుమారి ఈ స్థలం ఇవ్వడం జరిగింది.
 
నిబంధనలు ఉల్లంఘన
కలెక్టర్ విధించిన షరతులు ఈ విద్యాసంస్థ నిబంధనలు ఉల్లంఘించినట్లు గత పరిశీలనలో తేటతెల్లమైంది. సగం మంది విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుం వసూలు చేయాల్సి ఉండగా ఈ నిబంధనను పాటించలేదని అప్పట్లో విద్యాశాఖ అధికారుల పరిశీలనలో స్పష్టమైంది. భూమిని కేటాయించిననాలుగేళ్లకు విద్యాసంస్థను ఏర్పాటు చేసినా.. స్వాధీనం చేసుకునే విషయంలో అధికారులు శ్రద్ధ చూపలేదు. వరంగల్ ఆర్‌జేడీ ద్వారా అనుమతి పొందిన శ్రీ సత్యసాయి విద్యానికేతన్ 2007-08 విద్యా సంవత్సరం వరకు అదే స్థలంలో కొనసాగింది. అనంతరం పునరుద్ధరణ గడువు ముగియడంతో ఆ స్థలంలో విద్యాసంస్థ కార్యకలాపాలు సాగలేదు.

ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలంలో సత్యసాయి విద్యానికేతన్ కొనసాగడం లేదని, ప్రస్తుతం ఇందులో మరో పాఠశాలను నిర్వహిస్తున్నారని అప్పటి తహశీల్దార్ 2010 జూన్ 23న ఆర్డీవోకు నివేదిక సమర్పించారు. ఆ నివేదికను ఆర్డీవో అప్పటి కలెక్టర్ ద్వారా భూసేకరణ ముఖ్యకార్యదర్శి (సీసీఎల్‌ఏ)కు పంపారు. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు చేపట్టదంటూ పైస్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆ తర్వాత అధికారులు మిన్నకున్నారు. ఆ తర్వాత మరోసారి ఈ భూమిపై వివాదం చెలరేగడంతో 2011 డిసెంబర్‌లో సత్యసాయి విద్యానికేతన్ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. అప్పట్లో కలెక్టర్‌గా ఉన్న డాక్టర్ అశోక్ ఈ సత్యసాయి విద్యానికేతన్ భూమి కేటాయింపు రద్దు చేయాలని సీసీఎల్‌ఏకు రాయడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ముందడుగు పడలేదు. అప్పటి నుంచి ఆ స్థలంలో ఎలాంటి నిర్వహణ చేపట్టలేదు.

ఈ విషయంలో స్తబ్దత నెలకొంది. తాజాగా ఓ ప్రైవేటు స్కూల్ నిర్వహణకు అనుమతినివ్వడంతో మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. దీనిపై సత్యసాయి ట్రస్టు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సదరు ప్రైవేట్ వైద్యుడు, పట్టణంలోని కొంత మంది భూకబ్జాదారులు కలిసి ఈ భూమిని స్వాహా చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో కొంత మంది ప్రైవేట్ పాఠశాలల యజమానులు కూడా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏదేమైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం చొరవ తీసుకొని స్థలం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై జేసీ లక్ష్మీకాంతం, ఆర్డీవో సుధాకర్‌రెడ్డిలను ‘సాక్షి’ వివరణ కోరగా ఇది తమ దృష్టికి రాలేదని తెలిపారు. వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా డీఈవో సత్యనారాయణరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా ఇందులో నిర్వహిస్తున్న స్కూల్‌కు అనుమతి లేదని, ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నడుపుతున్నారని పేర్కొన్నారు. దీనిపై పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement