రోదిస్తున్న మృతుడు సాయిలు తండ్రి, భార్య
సాక్షి, కామారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సాయిలు మృతి సంఘటనపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు హత్యగా పేర్కొంటుండగా.. అధికారులేమో ప్రమాదమంటున్నారు. సాయిలు మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ శుక్రవారం సంఘటన స్థలానికి వెళ్లి మృతుడి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి పలు వివరాలు సేకరించింది.
అసలేం జరిగింది..
పిట్లం మండలం కారేగాం గ్రామ శివారులోని కాకివాగు సమీపంలో రోడ్డుపై గురువారం ఉదయం సాయిలు మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. సాయిలు తలకు గాయమై ఉండడంతో ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు అనుమానించారు. సంఘటన స్థలంలో ట్రాక్టర్ తిరిగిన ఆనవాళ్లు, సమీపంలో ఇసుక కనిపించడంతో సాయిలును ఇసుక మాఫియా హతమార్చిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సాయిలు బంధువులతో పాటు గ్రామస్తులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఎర్ర అంబయ్య అనే ట్రాక్టర్ డ్రైవర్‌ను నిలదీయగా.. తన ట్రాక్టర్ ఢీకొట్టడం వల్లే సాయిలు చనిపోయాడని పేర్కొన్నాడు. దీంతో గ్రామస్తులు అంబయ్యను చితకబాదారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మృతుడి బంధువులను సముదాయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత, జాయింట్ కలెక్టర్ సత్తయ్య, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ నర్సింహారావు తదితరులు శుక్రవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కామారెడ్డిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సాయిలుది హత్య కాదని, ప్రమాదవశాత్తూ చనిపోయాడని ప్రకటించారు.
పొంతనేదీ?
సాయిలు వీఆర్‌ఏ కాదని, సాయిలు చిన్నాయన నారాయణ వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడని అది కూడా మార్తాండ గ్రామంలోనని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అయితే గ్రామాల్లో వంతులవారీ పద్ధతిన వీఆర్‌ఏలు పనిచేసే ఆనవాయితీ ఉంది. ఈ ఆనవాయితీ ప్రకారం నారాయణ పేరుపై సాయిలు వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడని, చనిపోయిన రోజు కూడా పిట్లంలో రెవెన్యూ రికార్డులు రాయడానికి సాయిలు వెళ్లాడని అతడి భార్య సాయవ్వ, తండ్రి శివయ్య పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి కూడా నైట్ డ్యూటీ కోసం పిట్లం వెళ్తున్నానని చెప్పి వెళ్లాడంటున్నారు. ఇటుక లోడ్ దింపి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్.. రోడ్డుపై పడి ఉన్న సాయిలును గమనించలేదని, దీంతో అతడి తలకు టైర్ తగిలి మరణించాడని విలేకరుల సమావేశంలో ఎస్పీ తెలిపారు. రోడ్డున వెళ్తున్న సాయిలు చొక్కా జేబుకు వీఆర్‌ఏ బిల్ల(గుర్తింపు బిల్ల) కనిపించడంతో అడ్డుకుంటాడని భావించి ఇసుక తరలిస్తున్నవాళ్లే ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాకి వాగు ఇసుక రీచ్ కాదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే సాయిలు చనిపోయిన తరువాత వచ్చిన రెండో ట్రాక్ట ర్ ఇసుక లోడ్‌తో ఉందని అధికారులే చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. కాకివాగు ఇసుక రీచ్ కానపుడు రాత్రి వేళలో ఇసుకలోడుతో ట్రాక్టర్ ఎందుకు వెళ్తోందనేది ప్రశ్నార్థకంగా మారింది.
రోడ్డున పడ్డ కుటుంబం...
సాయిలుకు పెద్దగా వ్యవసాయ భూమి లేదు. వంశపారంపర్యంగా వస్తున్న గ్రామ సేవకుడి (వీఆర్‌ఏ) ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులతో పాటు భార్య, ముగ్గురు పిల్లలను పోశించేవాడు. ఆరు నెలల క్రితమే పెద్ద కూతురు వివాహం జరిపించడానికి గ్రామస్తులు తెలిపారు. సాయిలు మరణంతో భార్య, ఒక కూతురు, ఒక కుమారుడితోపాటు వృద్ధులైన తల్లిదండ్రులు దిక్కులేనివారయ్యారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కారేగాం ఘటనపై పీసీసీ చీఫ్ ఆరా
కారేగాంలో వీఆర్‌ఏ సాయిలు మరణంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరా తీశారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారామ్‌కు ఫోన్ చేసి సంఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని పేర్కొనడంతో ఆయన శుక్రవారం గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు.
ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది
బాన్సువాడ డివిజన్‌లో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం ఆరోపించారు. శుక్రవారం కారేగాం గ్రామానికి వెళ్లి సాయిలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో అక్రమ ఇసుక దందా నడుస్తోందన్నారు. అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రకృతిని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆధారాలతో సహా అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైందన్నారు. సాయిలు కుటుంబానికి రూ. 30 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment