మాకు గతంలో వేరుగా కాలనీలు ఉండేవి. అప్పుడు అవమానంగా భావించేవాళ్లం. కానీ ఇక్కడ అలా కాదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల ఆధారంగా నెంబర్ల ప్రకారం డ్రా తీశారు. అందులో మాకు ఏ ప్లాటు వస్తే అదే కేటాయించారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా అందరికీ కలిపి ఇళ్లు ఇచ్చారు. దీనివల్ల మాకు సంతోషంగా ఉంది. ఎస్సీలమనే పేరుతో దూరంగా పెట్టే విధానం తొలగించడం సంతోషం..
:::జగనన్న కాలనీలోని ఓ మహిళా లబ్ధిదారు
దేశంలో దాదాపుగా పల్లెటూళ్లలో దళితులుండే కాలనీలన్నీ ఊరికి ఓ చివరలో ఉంటాయి. అయితే వివిధ స్కీమ్‌ల పేరిట.. ఎస్సీల కోసం ఊరి బయటే ఇళ్ల నిర్మాణాలు చేపడుతుంటాయి ప్రభుత్వాలు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అలా కాదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం.. సామాజిక సంబంధాల్లో మార్పునకు మార్గాన్ని ఏర్పరుస్తోంది.
ఇటీవల కాకినాడ సామర్లకోటలో స్వయంగా సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన జగనన్న కాలనీలను ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ పరిశీలించి ఒక కథనం ఇచ్చింది. సామర్లకోట కాలనీలో 2020లో ఇళ్ల పట్టాలు కేటాయించగా, ప్రస్తుతం సుమారు 60 శాతం మంది తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. దాదాపుగా 90 కుటుంబాలు అక్కడే నివాసం కూడా ఉంటున్నాయి కూడా.
అయితే.. ఇళ్ల కేటాయింపులో కులాల ప్రస్తావన లేకుండా అన్ని కులాల వారికి ఒకే చోట కేటాయించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, కమ్మ కులస్థులు కూడా పక్క పక్కనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని నివాసాలు కూడా ఉంటున్నారు. తనకు పెళ్లయిన 17 ఏళ్లకు సొంత ఇంటి కల తీరిందని, ఇన్నాళ్లుగా ఎస్సీ కాలనీల్లోనే అద్దె ఇళ్లల్లో ఉండేవారమని ఆయన బీబీసీకి తెలిపారు. ప్రభుత్వం స్థలం ఇచ్చినప్పటికీ ఇంటి నిర్మాణం కోసం తాము సొంతంగా రూ. 13 లక్షల వరకూ వెచ్చించామని సమర్పణ రాజు అన్నారు.
జగనన్న కాలనీలు మాత్రం వేరు..
పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఇళ్ల పంపిణీలో కులాల ప్రస్తావన లేకుండా చాలాకాలంగానే అమలు చేస్తున్నారు. వాంబే, రాజీవ్ గృహకల్ప వంటి పథకాల్లో సైతం అన్ని కులాల వారికీ కలిపి ఇళ్లను కేటాయించారు. కానీ, గ్రామాల్లో పరిస్థితుల దృష్ట్యా.. అలాంటి పనులు చేయట్లేదు. కానీ, జగనన్న కాలనీలు మాత్రం వేరు పరిస్థితులకు వేదికైంది. కులాల బేధాలు లేకుండా అందరూ కలిసి ఉండేలా కాలనీ ఇవ్వడం చాలా సంతోషం కలిగిస్తోందని పలువురు అంటున్నారు.
పెళ్లయిన పాతికేళ్ల తర్వాత.. ఇన్నాళ్లకు మాకు ఓ ఇల్లు వచ్చింది. కులాల గురించి పట్టించుకోలేదు. ఇల్లు లేదని దరఖాస్తు పెట్టుకుంటే అన్ని కులాల వారితో సమానంగా మాకు కూడా స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాం. మా ఎదురుగా కమ్మవారున్నారు. మా పక్కన తూర్పు కాపులున్నారు. అంతా కలిసే ఉంటున్నాం" అని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి జగనన్నకాలనీకి చెందిన గుండుగోలు అరుణ అంటున్నారు.
గతంలో ఎస్సీలు, ఇతర కులాల మధ్య కుల పరమైన విబేధాలు వివాదాలుగా మారిన చోట్ల కూడా ఇప్పుడు అందరికీ కలిపి కాలనీలు నిర్మాణం జరుగుతున్నాయి. జగనన్న ప్రభుత్వ ఉద్దేశం.. నిరుపేదలకు ఇళ్లు అందించడం. ఆ ఒక్క అర్హతతోనే లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి కూడా. ఎస్సీలు, ఇతర కులాలన్నీ కలిపి ఒకే కాలనీలో నివాసం ఉండడం వల్ల కులపరమైన వ్యత్యాసాలు కొంత వరకూ తగ్గుతాయనే అభిప్రాయం మేధావుల తరఫు నుంచి కూడా వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment