సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కులాల ప్రాతిపదికన అభ్యర్థులను పోటీకి నిలబెట్టి రాష్ట్ర నాయకత్వం తీరును సీపీఎం కేంద్ర కమిటీ తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ప్రయోగం పేరిట కులం, సామాజిక అంశాలకు తప్ప మరే అంశానికి రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యతనివ్వకపోవడం పార్టీ మౌలిక విధానాలకు పూర్తి భిన్నంగా ఉందని ధ్వజమెత్తింది. ఇది పార్టీ వర్గ సమస్యకు ఇచ్చే ప్రాధాన్యాన్ని మరుగునపరిచినట్టు అయ్యిందని తన నివేదికలో పేర్కొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీపీఎం–బీఎల్‌ఎఫ్ కూటమి 107 స్థానాల్లో పోటీచేసి, ఒక్క సీటునూ గెలుచుకోలేకపోగా, అత్యధిక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లోనే రాష్ట్ర పార్టీ తీరును తప్పు బట్టగా.. తాజాగా సీపీఎం అత్యున్నత నిర్ణాయక మండలి కేంద్ర కమిటీ నివేదికలో కూడా రాష్ట్ర నాయకత్వ తీరును ఎండగట్టింది.
ఈ ఎన్నికల్లో సీపీఎం 26, బీఎల్‌ఎఫ్ 81 సీట్లలో కూటమిగా పోటీచేసి కేవలం 0.43 శాతం ఓట్లే సాధించడాన్ని కూడా ప్రస్తావించింది. కులాలు, సామాజికవర్గాల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయడంతో కులాల ఆధారంగానే ఈ కూటమి ఏర్పడిందనే భావన కలిగేందుకు ఆస్కారం ఏర్పడిందని పేర్కొంది. వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని సీఎం అభ్యర్థిని చేస్తామని కూటమి ప్రకటించడాన్ని తప్పుబట్టింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లోని కమిటీలు ఫలితాలను సమీక్షించి నివేదికను జాతీయ నాయకత్వానికి పంపించాక, పార్టీ చూపిన ప్రదర్శనపై సమగ్ర సమీక్షను నిర్వహించనున్నట్టు సీపీఎం కేంద్ర కమిటీ స్పష్టంచేసింది.
బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యం..
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని రాష్ట్రశాఖలకు కేంద్రకమిటీ సూచించింది. మొత్తం 15 పేజీల సీసీ రిపోర్ట్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలను ప్రస్తావించింది.
కులాల వారీ టికెట్లు సరికాదు
Published Wed, Dec 26 2018 2:45 AM | Last Updated on Wed, Dec 26 2018 2:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment