మేము 15 సంవత్సరాల క్రితం ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటు కొన్నాము. ఇప్పుడు అమ్మాలి అనుకుంటున్నాము. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మా ఒరిజినల్ దస్తావేజులు పోయాయి. మేము రెవెన్యూ ఆఫీసు నుంచి సర్టిఫైడ్ కాపీలను తీసుకున్నాము. ఆ కాపీల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని కొనుక్కునే వారికి చెప్పగా వారు వెనుకడుగు వేస్తున్నారు. కొందరేమో ‘కాగితాల పని మేము చూసుకుంటాము కానీ పాతిక లక్షలు తక్కువ ఇస్తాం..’ అంటున్నారు. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దయచేసి పరిష్కారం చూపగలరు.
– విజయ్ వర్ధన్, వరంగల్
ఇంటి రిజిస్ట్రేషన్ / పూర్వ ఒరిజినల్ పత్రాలు లేనప్పుడు కొనేవారు కొంత సంకోచించడం సమంజసమే. ఒరిజినల్ దస్తావేజులని ప్రైవేటు వ్యక్తుల దగ్గర తాకట్టుపెట్టి తర్వాత అదే ఆస్తిని మరొకరికి అమ్మడం తరచుగా జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ తాకట్టు ఈ.సీ లో కూడా కనపడదు కాబట్టి కొనుక్కునేవారు అమాయకంగా మోసపోతూ తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం సర్వసాధారణం అయిపోయింది.
టైటిల్ డీడ్ డిపాజిట్ చేస్తే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి అనే నిబంధన లేకపోవడం ఇందుకు కారణం. ఒరిజినల్ దస్తావేజులు లేని కారణం చూపించి మార్కెట్ విలువ కన్నా తక్కువ ధరకు మాత్రమే కొంటాము అని చాలామంది అంటారు. ఒరిజినల్ పత్రాలు లేనంత మాత్రాన ఆ స్థలం కానీ, ఇల్లు కానీ మీది కాకుండా పోదు, మీకు మీ ఆస్తిని అమ్మే హక్కు లేకుండా పోదు! మీరు తక్షణమే మీ ఇంటి పత్రాలు పోయాయి అని పోలీసులకి ఫిర్యాదు ఇవ్వండి. అ
దేవిధంగా మీరు ఒక లాయర్ ద్వారా పేపర్ ప్రకటన కూడా ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇచ్చిన ప్రకటన కాపీలను మరలా పోలీసు వారికి అందించాలి. పోలీసు వారు ‘ఫలానా వారి దస్తావేజులు పోయాయి, తిరిగి వెతికినా దొరకడం లేదు’ అని ధ్రువీకరిస్తూ ఒక సర్టిఫికెట్ (నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్) జారీ చేస్తారు.
ఆ సర్టిఫికెట్‌ను తీసుకొని మీరు రెవెన్యూ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకుంటే మీకు డూప్లికేట్ కాపీలు ఇస్తారు. అలా పొందిన పత్రాలు ఒరిజినల్ దస్తావేజులతో సమానం. మీరు వివరించిన పరిస్థితులలో అమ్మే వారికి –కొనేవారికి కూడా ఇది సురక్షితమైన పరిష్కారం.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )
(చదవండి: ప్రతిష్ఠాత్మక పదవిలో భారత సంతతి విద్యార్థి అనౌష్క కాలే!)
Comments
Please login to add a commentAdd a comment