
ఆస్తుల మ్యుటేషన్ ఇక ఈజీ
ప్రాపర్టీ రిజిస్టర్‌ను రూపొందించిన పురపాలక శాఖ
⇒ ఇంటి నంబర్‌తో క్షణాల్లో వివరాలన్నీ తెలుసుకోవచ్చు
⇒ వెబ్‌సైట్లో యజమాని, ఆస్తి ఫొటోలు, వివాదాల వివరాలు
⇒ గుర్తింపు కార్డు, సేల్ డీడ్ సమర్పిస్తే ట్రేడ్ లైసెన్స్ జారీ
⇒ వెల్లడించిన పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ప్రైవేటు భవనాలు, ఇళ్లు, భూములు తదితర ఆస్తులకు సంబంధించిన సమగ్ర ప్రాపర్టీ రిజిస్టర్ పురపాలికల వారీగా రూపొందించామని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. ఇంటి నంబర్ ఆధారంగా ఆస్తి యజమాని పేరు, ఆస్తికి సంబంధించిన ఫొటోలు, జియో మ్యాపింగ్ లింక్, ఏవైనా ఆస్తి వివాదాలు ఉంటే దానికి సంబంధించిన సమాచారాన్ని పురపా లక శాఖ వెబ్‌సైట్‌లో క్షణాల్లో తెలుసుకోవచ్చ న్నారు. జీహెచ్‌ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలో 12.5 లక్షల ప్రైవేటు ఆస్తులున్నాయని, ఇప్పటి వరకు 11 లక్షల ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రాపర్టీ రిజిస్టర్‌లో పొందుపరిచామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 72 పురపాలికల పరిధిలో గల ప్రైవేటు స్థలాల రిజిస్టర్‌ను సైతం రూపొందించామన్నారు. సరళీకృత వ్యాపారం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్/ఈఓడీబీ) సంస్కరణల అమల్లో భాగంగా నాలుగు నెలలుగా కసరత్తు చేసి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలోని పురపాలికల కమిషనర్లతో మంగళవారం ఆమె పురపాలక శాఖ డైరెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
అందుబాటులోకి ‘సిటిజన్ బడ్డీ’
ట్రేడ్ లైసెన్స్‌ల జారీ, ఇళ్ల నిర్మాణ అనుమతులు, కుళాయి కనెక్షన్లు తదితర సేవలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పురపాలికల్లో సత్వరంగా అందించేందుకు మూడు విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ‘సిటిజన్ బడ్డీ’మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టామని, ఇప్పటికే 18 వేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, 10 వేల మంది క్రియాశీలకంగా వినియోగిస్తున్నారని తెలిపారు. పురపాలికల్లోని పౌర సేవా కేంద్రాలు, మీ–సేవా కేంద్రాలతో పాటు పురపాలక శాఖ వెబ్‌సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకుని పై సేవలు పొందవచ్చన్నారు. నిర్దేశించిన గడువులోగా అన్ని సేవలందిస్తామని, జాప్యం చేసే అధికారులపై ‘టీఎస్–ఐపాస్’తరహాలో చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తింపు కార్డు, సేల్ డీడ్‌ను సమర్పిస్తే చాలు కొత్త పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటుకు ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తామని చెప్పారు. దరఖాస్తు పురోగతి స్థితిని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, దరఖాస్తులో సమాచార లోపముంటే ఆన్‌లైన్‌లో సరిదిద్దుకోవచ్చని తెలిపారు.
సత్వరం ఆస్తుల మ్యుటేషన్ పూర్తి..
సాధారణ పౌరులతో పాటు పరిశ్ర మల స్థాపన, వ్యాపార అవసరాల కోసం ఆస్తులు కొనుగోలు చేసే వారికి ఈ సమా చారం ఉపయుక్తంగా ఉంటుందని శ్రీదేవి చెప్పారు. యాజమాన్య హక్కుల మార్పి డికి, ఆస్తుల మ్యుటేషన్‌ను సత్వ రం పూర్తి చేసేందుకు ప్రాపర్టీ రిజిస్టర్ ఉపయోగ పడుతుందన్నారు. యాజమాన్య హక్కు లకు సంబంధించిన కోర్టు కేసుల వివ రాలు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ శాఖ వద్దే ఉండేవని, పురపాలికలు, రెవెన్యూ శాఖల వద్ద లేకపోవడంతో నగరాలు, పట్టణాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రాపర్టీ రిజిస్ట్రర్‌తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.