‘దేశంలో ప్రస్తుతం యూకే వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొంత కాలంగా డబుల్ మ్యూటెంట్ వేగంగా వ్యాప్తి చెందినా, ప్రస్తుతం యూకే రూపాంతరితమే సమస్యగా మారింది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే సెకండ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణం..’అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ‘సాక్షి’కి తెలిపారు.
ప్ర: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజుకు నాలుగు లక్షలకు చేరువ అవుతోంది. తొలిదశలో వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్న మనం రెండోసారి మాత్రం విఫలమయ్యాం. ఇందుకు కారణాలేమిటి?
జ: కోవిడ్–19 వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు చేపట్టడంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అతిపెద్ద కారణం. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అత్యవసరమని, ఈ జాగ్రత్తలన్నీ కొనసాగించాలని చాలాకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నా పట్టించుకోకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిపడింది. పాఠశాలలు, కళాశాలలు త్వరగా తెరవడం, ఎన్నికల ర్యాలీలకు అనుమతించడం, బార్లు, పబ్బులు, సినిమాహాళ్లు పనిచేసేందుకు అనుమతులివ్వడం కూడా కారణమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రూపాంతరిత వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఏర్పడింది. అదృష్టం ఏమిటంటే.. యూకే, భారత్ డబుల్ మ్యూటెంట్ వైరస్‌లకు ఇతర జీవుల ద్వారా వ్యాపించే శక్తి అలవడలేదు. అదే జరిగి ఉంటే సమస్య మరింత జటిలమయ్యేది.
ప్ర: దేశంలో ఏ రూపాంతరిత వైరస్ ఎక్కువ వ్యాప్తిలో ఉంది?
జ: ప్రధానంగా మూడు (యూకే, డబుల్ (కాలిఫోర్నియా), బెంగాల్) రూపాంతరిత వైరస్‌లు ఉన్నాయి. వీటి నుంచి మరోసారి జన్యుమార్పులకు గురైన ఇంకో వైరస్ కూడా వ్యాప్తిలో ఉంది. దీన్నే ట్రిపుల్ మ్యూటేటెడ్ అని పిలుస్తున్నారు. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో పదిశాతం ఈ వైరస్‌వే. కొమ్ములో ఉండే ఒకే ఒక్క తేడా డబుల్, ట్రిపుల్ మ్యూటేటెడ్‌లను వేరు చేస్తుంది. బెంగాల్‌లో 20 శాతం కేసులకు కారణమవుతున్న రూపాంతరిత వైరస్ బలహీనపడుతోందని, త్వరలో కనిపించకుండా పోతుందని అంచనా వేస్తున్నాం. డబుల్ మ్యూటెంట్ వైరస్‌ను గత ఏడాది డిసెంబర్‌లోనే గుర్తించినా..మన నిర్లక్ష్యం కారణంగా గత కొంతకాలంగా అది వేగంగా వ్యాప్తి చెందింది.
డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్‌లలో జన్యుపరమైన మార్పులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ వాటి వల్ల ప్రమాదమేమీ లేకపోవడం ఊరటనిచ్చే అంశం. దేశంలో ప్రస్తుతం యూకే రూపాంతరితమే ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. అదే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వెరైటీలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయని తెలుస్తోంది. సీసీఎంబీలో రూపాంతరితాల జన్యుక్రమ నమోదు జరుగుతోంది. ఇప్పటివరకూ పరిశీలించిన నమూనాల్లో యూకే రూపాంతరితం 12 – 15 శాతం ఉండగా.. డబుల్ మ్యూటెంట్ 20 శాతం నమూనాల్లో కనిపించింది. మిగిలిన 70 శాతంలో వేర్వేరు రకాల ఉనికిని గుర్తించాము.
ప్ర: రెండో దఫా కేసులు శిఖరస్థాయికి చేరేదెన్నడు? మూడో దఫా ఉండే అవకాశం ఉందా?
జ: దేశ విదేశాల్లో చేసిన అధ్యయనాలన్నీ భారత్‌లో మే రెండు, మూడో వారాల్లో కేసులు శిఖరస్థాయికి చేరతాయని, ఆ తర్వాత వేగంగా తగ్గిపోతాయని చెబుతున్నాయి. మళ్లీ జూన్ తర్వాత కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. తీవ్రత తక్కువగా ఉంటుందంటున్న ఈ దశను మూడో దఫా అని కూడా అనలేము. నిజానికి ఈ మూడోదఫా గురించి ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం రోజువారీ ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? అన్న అంశంపై ఆధారపడి ఈ అంచనాలు రూపొందాయి. శిఖర స్థాయికి చేరే క్రమంలో రోజువారీ కేసుల సంఖ్య ఐదు నుంచి పది లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ లెక్కల్లోకి ఎక్కని కేసులు దీనికి అదనంగా భావించాలి.
కేసులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అందని పరిస్థితుల్లో అంచనాలు వేయడం అంత సులభమేమీ కాదు. కానీ మే నెల మూడో వారానికల్లా అత్యధిక స్థాయిలో కేసులు నమోదై ఆ తర్వాత తక్కువ కాలంలోనే ఆ సంఖ్య పతనమవుతుందని అనుకుంటున్నాం. అప్పటివరకూ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు మాస్కులేసుకోవడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి మరింత కఠినంగా కొనసాగించాల్సి ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం, అందుబాటులో ఉన్న వైరస్ నమూనాల జన్యుక్రమాన్ని వేగంగా నమోదు చేయడం చాలా అవసరం. తద్వారా కొత్త రూపాంతరితాలను ఎప్పటికప్పుడు గుర్తించే వీలేర్పడుతుంది. జన్యుక్రమ నమోదు ద్వారా కొత్త టీకాలు, మందులను అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వం ఈ పనులన్నీ తగిన వేగంతో చేస్తుందని అనుకున్నా.. ప్రజలు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తేనే దేశం నుంచి కరోనా వైరస్‌ను తరిమి కొట్టగలం.
– సాక్షి, హైదరాబాద్.
యూకే వేరియంట్‌తోనే సమస్య!
Published Fri, Apr 30 2021 3:56 AM | Last Updated on Fri, Apr 30 2021 10:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment