Covid Third Wave Precautions In Telugu: థర్డ్‌వేవ్‌ తీవ్రత: ఆ మూడే కీలకం! - Sakshi
Sakshi News home page

Covid-19: థర్డ్‌వేవ్‌ తీవ్రత: ఆ మూడే కీలకం!

Published Sat, Jun 5 2021 7:11 AM | Last Updated on Sat, Jun 5 2021 4:35 PM

CCMB Advisor Rakesh Mishra Says Caring Tips Of Coronavirus Third Wave - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రెండో దశ ముగింపునకు వచ్చినట్లే! మూడు నాలుగు నెలల తరువాత ఇంకో వేవ్‌ వచ్చే అవకాశం ఉందనేది నిపుణుల మాట! మూడో దశ తీవ్రత, ప్రభావం మొత్తం మూడంటే మూడు అంశాలపై ఆధారపడి ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్, గౌరవ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా విస్పష్టంగా తెలిపారు. అందరికీ టీకా ఇవ్వడం, కోవిడ్‌ నిబంధనలు పాటించడం, నిర్ధారణ పరీక్షలు కొనసాగించడం కీలకమని చెప్పారు. కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత తరుణంలో తరువాతి దశల పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు ‘సాక్షి’ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రాను సంప్రదించింది. ఆయన ఇంకా ఏమన్నారంటే... 

టీకాతో తీవ్రత తగ్గించొచ్చు..
1 కోవిడ్‌ నుంచి రక్షణ పొందేందుకు మనకున్న ఏకైక ఆయుధం టీకానే. వీలైనంత తొందరగా టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా మూడు లేదా ఆ తరువాతి దశల తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. 
2 కోవిడ్‌ నిబంధనలు అంటే భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, ముఖానికి మాస్కు తొడుక్కోవడం వంటివి కచ్చితంగా పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. 
3 రెండో దశ కేసులు తగ్గిపోతున్నాయి కదా అని ప్రభుత్వాలు పరీక్షలు చేయడం తగ్గిస్తే అసలుకే మోసం వస్తుంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు జరిపి.. నిర్ధారణయ్యే తక్కువ కేసులను ఐసొలేషన్‌లో ఉంచి వెంటనే చికిత్స కల్పించడం ఇకపై చాలా ముఖ్యం. 

జన్యుమార్పులకు లోనయ్యే అవకాశం! 
అరవై ఏళ్లపైబడ్డ వారు, మధుమేహం, గుండెజబ్బుల వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో అధికులు ఇప్పటికే టీకాలు తీసుకున్న నేపథ్యంలో వైరస్‌ ఇతరులకు సోకే అవకాశాలు పెరుగుతాయి. టీకాలు, రకరకాల చికిత్సల ద్వారా అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాల నుంచి తప్పించుకునేందుకు వైరస్‌ జన్యుమార్పులకు గురవుతుంది. ఈ మార్పుల్లో ఏ ఒక్కటి మనిషికి ప్రమాదకరంగా ఉన్నా ముప్పు తప్పదు. దేశంలో ప్రస్తుతానికి 617.2 రకం రూపాంతరిత వైరస్‌ ఒక్కదానితోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైరస్‌లో కొత్త రూపాంతరితాలేవీ కనిపించలేదు. 

పాత తప్పులు మళ్లీ వద్దు 
రెండో దశ కరోనా సమయంలో జరిగిన పొరబాట్లు, తప్పులను పునరావృతం చేస్తే దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మూడో దశను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావడం చాలా అవసరం. మూడు నాలుగు నెలల సమయం ఉందన్న అంచనాలను ఆధారంగా చేసుకుని ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గతంలో మాదిరిగా ఆక్సిజన్, బెడ్ల కొరత వంటి సమస్యలకు ఈసారి మరికొన్ని జత చేరే అవకాశం ఉండొచ్చు.

మూడో దశ ప్రభావం పిల్లలపై ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున.. అటువంటి వారికి అనుగుణంగా ఆసుపత్రుల్లోని కోవిడ్‌ వార్డుల్లో తగిన మార్పులు,చేర్పులు చేయాలి. రోజంతా మాస్కులు ధరించడం, ఒకేచోట కదలకుండా ఉండటం పిల్లలు చేయలేరు కాబట్టి.. వారికి అనుకూలమైన విధంగా వార్డులను సిద్ధం చేయాలి. అంతేకాకుండా.. కోవిడ్‌ బారిన పడ్డ పిల్లలకు ఏ రకమైన మందులు ఇవ్వాలన్న అంశంపై ఇప్పుడే అధ్యయనం మొదలుపెట్టాలి. పెద్దవారికి ఇచ్చే మందులు పిల్లలకూ పనికొస్తాయనుకోవడం సరికాదు.
చదవండి: డ్రోన్లతో వ్యాక్సిన్ల రవాణా: 100 కి.మీ వేగం.. 70 కి.మీ దూరం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement