సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సగం మందిలో కోవిడ్ నిరోధక యాంటీబాడీలు ఉన్నట్లు ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్), భారత్ బయోటెక్‌లు సంయుక్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా రక్త పరీక్షలు నిర్వ హించి, విశ్లేషించగా దాదాపు 54% మందిలో కరోనా వైరస్‌ను అడ్డు కునే యాంటీబాడీలు ఉన్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 వార్డుల్లో దాదాపు 9 వేల మంది నుంచి రక్తం సేకరించి తాము ఈ పరిశోధన నిర్వహించామని, ఒకట్రెండు వార్డులు మిన హాయించి మిగిలిన చోట్ల యాంటీబాడీల మోతాదు దాదాపు ఒకేలా ఉందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా గురువారం తెలిపారు. అత్యధికంగా కొన్ని వార్డుల్లో 70% జనాభాలో యాంటీబాడీలు కనిపించగా.. కొన్ని వార్డుల్లో 30% మందిలో మాత్రమే యాంటీబాడీలు కనిపించినట్లు తెలిపారు.
ఇవీ వివరాలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోవిడ్ వ్యాప్తి, తీవ్రత తదితర అంశాలను అంచనా వేసేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. జనవరి మూడో వారం నుంచి మొదలుపెట్టి 3 వారాల పాటు 9 వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. 10 ఏళ్ల వయసు మొదలుకొని 70 ఏళ్లపైబడిన వారి వరకు నమూనాలు తీసుకున్నారు. జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు, సిబ్బంది నమూనాల సేకరణ చేపట్టగా సీసీఎంబీ అత్యాధునిక శాస్త్ర వ్యవస్థల సాయంతో ఆ నమూనాల్లో యాంటీబాడీల ఉనికి గుర్తించింది. దాదాపు 53 శాతం మంది పురుషుల్లో యాంటీబాడీలు కనిపించగా, మహిళల్లో ఈ సంఖ్య 56 శాతంగా ఉంది. 70 ఏళ్లపైబడ్డ వారిలో 49 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉన్నాయి. కరోనా కారణంగా వృద్ధులు ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఇలా జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కోవిడ్ బారిన పడ్డ వ్యక్తుల కుటుంబాల్లో 78 శాతం మంది కరోనాకు నిరోధకత పెంచుకోవడం గమనార్హం. రోగులతో సంబంధాలు ఉన్న వారిలో 68 శాతం మంది యాంటీబాడీలను కలిగి ఉన్నారు. అంతేకాకుండా గదుల సంఖ్య ఎక్కువగా ఉండి.. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న కుటుంబాల్లో వ్యాధి బారిన పడ్డవారు తక్కువగా ఉన్నారని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త ఎ.లక్ష్మయ్య తెలిపారు.
75 శాతం మందికి తెలియదు..
తమకు కోవిడ్ వచ్చి శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు సర్వేలో పాల్గొన్న 75 శాతం మందికి తెలియలేదని లక్ష్మయ్య తెలిపారు. వైరస్ సోకినా లక్షణాలు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని పేర్కొన్నారు. లక్షణాలు ఉన్న వారితో పాటు, లేనివారిలోనూ 54 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు ఈ పరిశోధన తెలిపిందని వివరించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 18 శాతం మందికి గతంలో కోవిడ్ సోకినట్లు తెలుసని, వీరిలో 90 శాతం మందిలో యాంటీబాడీలు గుర్తించామని తెలిపారు.
ఇదే మంచి తరుణం..
జనాభాలో 54 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన వైరస్ ప్రమాదం తప్పినట్లేనని అనుకోవద్దని, ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని వైరస్‌ను అంతమొందించేందుకు అందరూ కలసికట్టుగా ప్రయత్నించాలని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు. జనాభాలో సగం మందిలో యాంటీబాడీలు ఉండటం మంచి విషయమే అయినా.. అలసత్వం పనికిరాదని, టీకాలు వేసుకోవడం ద్వారా కనీసం 80 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందేలా చూసుకోవాలని తద్వారా మాత్రమే వైరస్‌ను అంతమొందించొచ్చని స్పష్టం చేశారు. మరికొన్ని నెలల పాటు ముఖానికి మాస్కులు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భారత్ బయోటెక్‌కు చెందిన శాస్త్రవేత్త కృష్ణ మోహన్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో సగం మందికిపైగా కోవిడ్ నిరోధకత
Published Fri, Mar 5 2021 2:15 AM | Last Updated on Fri, Mar 5 2021 4:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment