న్యూఢిల్లీ: సూదితో అవసరం లేని కోవిడ్–19 టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రానాజల్ (బీబీవీ154) కరోనా వ్యాక్సిన్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ముక్కుద్వారా తీసుకొనే ఈ టీకాను 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసుగా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కోవిషీల్డ్ లేదా కోవాగ్జాన్ టీకా రెండు డోసుల తీసుకున్నవారు బూస్టర్ డోసుగా ఇంట్రానాజల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో దీన్ని చేర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కో–విన్ పోర్టల్ ద్వారా టీకా పొందవచ్చని వెల్లడించారు. చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ముక్కుద్వారా తీసుకొనే టీకాకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు
ఇన్‌కోవాక్ అనే బ్రాండ్ పేరుతో పిలిచే బీబీవీ154 వ్యాక్సిన్‌కు ఈ ఏడాది నవంబర్‌లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలియజేశారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. 18 ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసుగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలని స్పష్టం చేశారు. టీకాల పరిశోధన, అభివృద్ధి విషయంలో భారతదేశ శక్తిసామర్థ్యాలకు ఇంట్రానాజల్ వ్యాక్సిన్ మరో ఉదాహరణ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీకాను ఇవ్వడం చాలా సులభమని తెలిపాయి. ఇన్‌కోవాక్‌ను భారత్ బయోటెక్ సంస్థ అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, క్లినికల్ ట్రయల్స్‌కు భారత ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలోని కోవిడ్ సురక్షా కార్యక్రమం కింద ఆర్థిక సహకారం అందించింది. బీబీవీ154 టీకా విషయంలో మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, సత్ఫలితాలు లభించాయని భారత్ బయోటెక్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.
సూది లేకుండా కరోనా టీకా
Published Sat, Dec 24 2022 5:39 AM | Last Updated on Sat, Dec 24 2022 8:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment