భారత్‌లో కరోనా రూపాంతరాలు ఎన్నో తెలుసా..? | CCMB Finds 5,000 Different Variants Of SARS-CoV-2 In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో కరోనా రూపాంతరాలు ఎన్నో తెలుసా..?

Published Sat, Feb 20 2021 9:00 AM | Last Updated on Sat, Feb 20 2021 12:51 PM

CCMB Finds 5,000 Different Variants Of SARS-CoV-2 In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకటి, రెండు కాదు.. భారత్‌లో ఉన్న కరోనా వైరస్‌ రూపాంతరాలు ఎన్నో తెలుసా..? ఏకంగా 5 వేల పైమాటే. అవును ఈ విషయాన్ని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) వెల్లడించింది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రచురించిన పరిశోధనా వ్యాసం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు దేశంలో 5 వేల కంటే ఎక్కువ కరోనా వైరస్‌లు రూపాంతరం చెందడం ఆందోళన కలిగిస్తోంది. వీటిల్లో వేగంగా వ్యాప్తి చెందగల ఎన్‌–501–వై, నాశనం చేసేందుకు ఎక్కువ యాంటీబాడీలు అవసరమయ్యే ఈ–484–కేలు కూడా ఉన్నాయి.

విస్తృత స్థాయిలో జన్యుక్రమాలను నమోదు చేయకపోవడం వల్ల ఇలాంటివి తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా శుక్రవారం ఓ ప్రకటనలో వివరించారు. కొన్ని రూపాంతర వైరస్‌లు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని, ఎన్‌–440–కే రకం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని వివరించారు. వైరస్‌ వ్యాప్తిని అర్థం చేసుకునేందుకు నిఘా ముమ్మరం చేయాలని, కొత్త రూపాంతరాలను వేగంగాగుర్తిస్తే.. అంతే వేగంగా చికి త్సపద్ధతులను అభివృద్ధి చేయొచ్చని వివరించారు.

జూన్‌ కల్లా మార్పు..
ఏడాదిలోనే భారత్‌లో అన్ని రకాల రూపాంతరాలు ఎలా పరిణామం చెందాయన్న అంశాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వివరించారు. గతేడాది జూన్‌ నాటికి దేశంలో కొంచెం నెమ్మదిగా వ్యాప్తి చెందుతుందనుకున్న ‘ఏ3ఐ’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువచోట్ల ఉన్న ‘ఏ2ఏ’ రూపాంతరం వచ్చేసింది. ఇటీవల వెలుగు చూసిన రూపాంతరాల్లో వైరస్‌ కొమ్ములోనే ఎక్కువ జన్యుమార్పులు చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్త డాక్టర్‌ దివ్య తేజ్‌ సౌపాటి తెలిపారు.

దేశంలో గుర్తించిన కొన్ని రూపాంతర వైరస్‌లు పదేపదే వ్యాధికి కారణం అవుతున్నాయని తాము గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,400 వైరస్‌ జన్యుక్రమాలు మాత్రమే నమోదై ఉన్నాయని, వీటిల్లోనే 5 వేల కంటే ఎక్కువ రూపాంతరాలు ఉన్నాయని అంచనా. కోవిడ్‌ బారిన పడ్డ వారిలో కనీసం 5 శాతం మందిలోని వైరస్‌ జన్యుక్రమాలను నమోదు చేసేందుకు కేంద్రం కార్యక్రమం చేపట్టిందని, ఇది వ్యాధి నియంత్రణ, చికిత్సల్లో కీలకం కానుందని డాక్టర్‌ సురభి శ్రీవాస్తవ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement