సాక్షి, అమరావతి: ‘డెంగ్యూ, మలేరియా, ఇన్‌ఫ్లూయాంజాతో నేటికీ మరణాలు సంభవిస్తున్నాయి. రోగ నిరోధకత బలహీనంగా ఉన్న వారిపై వీటి ప్రభావం ఉంటోంది. ఇదే తరహాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ల రూపంలో బలహీన రోగ నిరోధకత ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. కరోనా మూడో దశ వ్యాప్తి, ఒమిక్రాన్ ప్రభావంపై పలు అంశాలను ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు.
సీసీఎంబీలో ఏపీ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంది?
డెల్టాతో పోలిస్తే ప్రస్తుతం వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్ బలహీనంగా ఉంది. డెల్టా వైరస్ శరీరంలోకి వేగంగా ప్రవేశించడంతో పాటు స్పైక్ ప్రోటీన్‌తో కణాలపై దాడి చేస్తుంది. రిప్లికేషన్ (ఉత్పాదక సామర్థ్యం) బాగా ఉంటుంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేగంగా వ్యాíపిస్తున్నా డెల్టా అంత తీవ్రతతో దాడి చేయడం లేదు. రిప్లికేషన్ తగ్గింది.
వైరస్ ఎండమిక్ దశకు చేరుకున్నట్లేనా?
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌లో వైరస్ క్షీణించింది. దీన్ని ఆధారంగా చేసుకుని వైరస్ ఎండమిక్ దశకు చేరిందని భావించలేం. భవిష్యత్‌లో బలమైన లక్షణాలతో వైరస్ రూపాంతరం చెందవచ్చేమో చెప్పలేం. ఇన్‌ఫ్లూయాంజా దేశంలోకి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉందో తెలిసిందే.
కేసుల నమోదు ఎప్పటిలోగా తారస్థాయికి చేరవచ్చు?
మన దేశంలో ప్రస్తుతం పాండమిక్ దశలో ఉన్నాం. ఈ దశలో సాధారణంగా ప్రతి మూడు రోజులకు కేసుల నమోదు రెట్టింపు అవుతూ వస్తుంది. ఈ నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారంలో కేసుల నమోదు తారస్థాయికి చేరుతుంది. పాజిటివిటీ రేటు పెరిగే కొద్దీ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం అమెరికాలో ఇదే జరుగుతోంది. బలహీన రోగనిరోధకత ఉన్న వారిపై ఒమిక్రాన్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఒమిక్రాన్ + డెల్టా కేసులు నమోదయ్యాయా?
ఇప్పటివరకూ మేం పరీక్షించిన నమూనాల్లో ఒమిక్రాన్ + డెల్టా కేసులు నమోదవలేదు. కేవలం ఒమిక్రాన్ కేసులు మాత్రమే ఉంటున్నాయి.
టీకాల నుంచి రక్షణ ఉంటోందా?
గతంలో వైరస్ సోకడం, టీకాలు తీసుకోవడం వల్ల వచ్చిన రోగనిరోధకతను దాటుకుని ఒమిక్రాన్ వేరియంట్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. గతంలో వైరస్‌తో పరిచయం ఉండటం, టీకాలు తీసుకుని ఉండటం వల్ల టీ సెల్స్ కొంత రక్షణగా ఉంటున్నాయి. బలహీన రోగ నిరోధకత ఉండే వృద్ధులు, రోగులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతరులకు ప్రభుత్వం ప్రికాషన్ డోసు అందిస్తోంది. అర్హులైన వారంతా ప్రికాషన్ డోసు తీసుకోవాలి.
ప్రికాషన్ డోసు కింద ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి?
విదేశాల్లో మొదటి రెండు డోసులు కింద తీసుకున్న టీకా కాకుండా వేరే రకం టీకాను ప్రికాషన్ డోసు కింద ఇస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు. మన దేశంలో మాత్రం మొదటి రెండు డోసులు ఏ టీకా తీసుకుంటే ప్రికాషన్ డోసుగా అదే టీకాను పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మొదటి రెండు డోసుల కింద ఏ టీకా తీసుకుంటే అదే టీకాను ప్రికాషన్ డోసు కింద పొందాలి.
Comments
Please login to add a commentAdd a comment