న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో దేశంలోని 60 శాతం మంది ప్రజలకు వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 కారణంగా నిపుణులు వెల్లడించారు. తాజాగా ఆ వేరియంట్ భారత్‌కూ వ్యాపించటం కలకలం సృష్టిస్తోంది.
చైనాలో విజృంభిస్తోన్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్7 తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 3 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా.. ఒడిశాలో మరో కేసు వెలుగు చూసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ వేరియంట్‌పై వివరాలు వెల్లడించారు నిపుణులు. బీఎఫ్7 వేరియంట్ కేసులు గుర్తించినప్పటికీ వ్యాప్తిలో ఎలాంటి పెరుగుదల లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్లతో పాటు కొత్త వేరియంట్లపై నిఘా పెట్టడం చాలా కీలకమని పేర్కొన్నారు.
చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగటం, ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోవటం వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. బీఎఫ్.7 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రజల్లోని రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.5కి ఉప రకం. దీనికి ఒకరి నుంచి ఒకరికి సోకే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఈ బీఎఫ్7 వేరియంట్‌ను అమెరికా, యూకే, ఐరోపా దేశాల్లోనూ గుర్తించారు.
విమానాశ్రయాల్లో హైఅలర్ట్..
చైనా సహా విదేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోకి వచ్చే వారికి రాండమ్‌గా కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల కోసం ఉన్న మార్గదర్శకాలు యథాతథంగా ఉంటాయని పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించండి: కేంద్రం సూచన
Comments
Please login to add a commentAdd a comment