మ్యుటేషన్‌..ఇక సులువే!  | Changes In The Mutation Process Of Registrations | Sakshi
Sakshi News home page

మ్యుటేషన్‌..ఇక సులువే! 

Published Fri, Jul 17 2020 9:00 AM | Last Updated on Fri, Jul 17 2020 9:02 AM

Changes In The Mutation Process Of Registrations - Sakshi

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

ఎల్‌.ఎన్‌.పేట, టెక్కలి, ఆమదాలవలస: స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల ద్వారా భూమి హక్కులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. భూములతో పాటు ఇతర స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరిగిన సందర్భంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. రిజి స్ట్రేషన్ల తర్వాత భూమి ఓనర్‌షిప్‌ మార్పుల కోసం కొనుగోలు చేసిన యజమాని రెవెన్యూ (తహసీల్దారు కార్యాలయం) అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. ఇలా అయినా సవాలక్ష ఆంక్షలు చూపించి భూ యజమానులు సహనాన్ని కోల్పోయేలా చే యడం పరిపాటిగా ఉండేది. ఇక నుంచి రోజుల తరబడి రెవె న్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా భూమి ఓనర్‌షిప్‌ మార్పును ప్రభుత్వం సులభతరం చేసింది. రిజిస్ట్రేషన్‌ పరిభాషలో దీన్నే ‘ఆటో మ్యుటేషన్‌’ అంటారు.  

సీసీఎల్‌ఏ ద్వారా ఉత్తర్వులు 
ఈ ఆటో మ్యుటేషన్‌ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేలా సీసీఎల్‌ఏ ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రత్యేక సర్క్యులర్‌ను ప్ర భుత్వం జారీ చేసింది. దీని ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే భూమి ఓనర్‌షిప్‌ (మ్యుటేషన్‌) మార్చేలా ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చారు. రిజిస్ట్రేషన్‌ జరిగిన తర్వాత భూమికి ఆయా మండలాల తహసీల్దార్లు విచారణ నిర్వహించి నిర్ధారణ కూడా చేపడతారు. దీని కోసం ఆర్‌ఓఆర్‌ యాక్టు–1971కి సవరణలు చేయటం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఎలక్ట్రానికల్లీ మెయిన్‌టెయిన్డ్‌ రెవెన్యూ రికార్డ్స్‌(వెబ్‌ల్యాండ్‌) మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆటో మ్యుటేషన్‌ ప్రక్రియ రెండు పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఒకటి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో, రెండోది తహసీల్దారు కార్యాలయంలో చేపడతారు.  

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగే ప్రక్రియ  
భూముల క్రయ విక్రయాలు జరిగిన తర్వాత వ్యవసాయ భూమిని కలిగిన వ్యక్తి దాన్ని అమ్మడం కోసం(విక్రయం), భాగాలు చేయటం (పార్టీషన్‌–కుటుంబ సభ్యుల మధ్య వాటాలు), బహుమతి(గిఫ్ట్‌) ఇవ్వటం కోసం గానీ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని సందర్శిస్తాడు. అందులో భాగంగా వెబ్‌ల్యాండ్‌ 1–బి తప్పనిసరిగా సరిచూసుకుని రిజిస్ట్రేషన్‌ చేస్తారు.  
– తన కార్యాలయానికి వచ్చిన అమ్మకందారు, కొనుగోలుదారుల ఈ–కేవైసీని సబ్‌ రిజి      స్ట్రార్‌ నిర్ధారణ చేసుకుంటారు.  
– అమ్మకందారుడు తీసుకువచ్చిన భూములకు సంబంధించి వెబ్‌ల్యాండ్‌ రికార్డ్స్‌తో పోల్చి చూస్తారు. 
– రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే సబ్‌ రిజిస్ట్రార్‌ తన కార్యాలయంలో తాత్కాలిక మ్యుటేషన్‌ తన డిజిటల్‌ సంతకం ద్వారా చేస్తారు. 
– తాత్కాలిక మ్యుటేషన్‌ పూర్తయిన వెంటనే సంబంధిత రికార్డు తహసీల్దారు కార్యాలయంలో ఉండే వెబ్‌ల్యాండ్‌కు తదుపరి ప్రక్రియ ద్వారా పంపుతారు.  
– ఈ విధంగా తాత్కాలిక మ్యుటేషన్‌ జరిగిన వెంటనే అమ్మకం, కొనుగోలు దారులు ఇద్దరికీ ఎస్‌ఎంఎస్‌ అలెర్ట్‌ కూడా వెళుతుంది.  
– కొనుగోలుదారుడు ఒకవేళ సర్వే సబ్‌ డివిజన్‌ చేయించాలనుకుంటే తగిన ఫీజును గ్రామ సచివాలయం, మీ–సేవ వద్ద చెల్లించవచ్చు.  

తహసీల్దారు కార్యాలయం వద్ద జరిగే ప్రక్రియ.. 
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాయంలో రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే అక్కడ నుంచి తహసీల్దారు కార్యాలయానికి ఆన్‌లైన్‌ ద్వారా తాత్కాలిక మ్యుటేషన్‌ కోసం వస్తుంది. ఫారం–8ను జనరేట్‌ చేసి ఆయా గ్రామ పంచాయతీ, సచివాలయ నోటీస్‌ బోర్డులో ఉంచుతారు. 15 రోజుల్లో వీటికి సంబంధించిన అభ్యంతరాలు వస్తే వాటిని పరిగణలోకి తీసుకుని విచారిస్తారు.  
– రిజిస్ట్రేషన్‌ జరిగిన 15 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందుకోసం గ్రామ రెవెన్యూ అధికారి ఏడు రోజుల్లో, ఆర్‌ఐ, డిటీలు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేయాలి.  
– ప్రొవిజనల్‌ మ్యుటేషన్‌ రికార్డును ఫీల్డ్‌ మీద విచారణ కోసం, నోషనల్‌ సబ్‌ డివిజన్‌ను ఎఫ్‌ఎంబీ, ఫీల్డ్‌ మీద మార్కింగ్‌ చేయటం కోసం సంబంధిత గ్రామ సర్వేయర్‌కి పంపుతారు. ఈ ప్రక్రియ మొత్తం 15 రోజుల్లో పూర్తి చేయాలి.  
– విచారణ చేసిన డ్రాఫ్ట్‌ సబ్‌ డివిజన్‌ రికార్డును గ్రామ సర్వేయర్, మండల సర్వేయర్‌ ద్వారా తహసీల్దార్‌ అప్రూవల్‌ కోసం పంపుతారు. ఇలా వచ్చిన సబ్‌ డివిజన్‌ రికార్డులు ఫీల్డ్‌ రిపోర్టు, అభ్యంతరాలు పరిశీలించిన మీదట అంగీకరించటమా, తిరస్కరించటమా అన్నది స్పీకింగ్‌ ఆర్డర్‌ ద్వారా జారీ చేస్తారు. తద్వారా తదుపరి ప్రక్రియను వెబ్‌ల్యాండ్‌ ద్వారా పూర్తి చేస్తారు.  
– సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి వచ్చిన తాత్కాలిక మ్యుటేషన్‌పై 30 రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే డీమ్డ్‌ మ్యుటేషన్‌ అవుతుంది.  
– తహసీల్దారు కార్యాలయంలో మ్యుటేషన్‌ పూర్తయిన వెంటనే అమ్మకందారుడు, కొనుగోలుదారుడికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం వెళుతుంది. అప్పుడు కొనుగోలుదారుడు ఈ–పాస్‌ బుక్, టైటిల్‌ డీడ్, సబ్‌ డివిజన్‌ రికార్డును మీ భూమి పోర్టల్‌ ద్వారా తీసుకోవచ్చు.  

ఇబ్బంది కలగకుండా.. 
భూమి హక్కుదారునికి ఇబ్బంది కలగకుండా ఆటో మ్యుటేషన్‌ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ–సేవ కేంద్రంలో ఈ–పాస్‌ బుక్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారు. కొత్తవిధానంలో అలా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచే ఆన్‌లైన్‌లో వివరాలు వస్తున్నాయి. వీటిని పరిశీలించి ఓనర్‌షిప్‌ మార్చి ఈ–పాస్‌ పుస్తకం కోసం సిఫార్స్‌ చేస్తున్నాం, ఈ విధానం రైతులకు, అధికారులకు ఎంతో సులువైనదిగా ఉంది.  
– రషీద్‌ అహ్మద్, ఉప తహశీల్దారు, ఎల్‌ఎన్‌ పేట 

రిజిస్ట్రేషన్‌ విధానంలో కొత్త మార్పులు 
రిజిస్ట్రేషన్‌ విధానంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. కొనుగోలుదారులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆటో మ్యుటేషన్‌ విధానంలో భూమి రిజిస్ట్రేషన్‌ జరిగిన తర్వాత వివరాలు తెలియజేస్తూ తహశీల్దారు కార్యాలయానికి నివేదికను ఆన్‌లైన్‌లో పంపిస్తాం. భూమి ఓనర్‌ పేరు, వివరాలు తహసీల్దారు కార్యాలయంలో 15 రోజుల వ్యవధిలోనే మార్పులు జరుగుతాయి. గతంలో భూమి హక్కు పొందాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇప్పుడు సులభతరం అయింది.
 – బి.లక్ష్మీనారాయణ, సబ్‌ రిజిస్ట్రార్, పాతపట్నం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement