అక్రమాలకు చెక్.. ఇక కొత్త సాఫ్ట్‌వేర్‌తో రిజిస్ట్రేషన్లు!
శ్రీకాకుళం సిటీ: రిజిస్ట్రేషన్ల శాఖకు కొత్త రోజులొస్తున్నాయి. గత విధానాలకు చెక్ పెడుతూ కొత్తగా తయారుచేసిన సాఫ్ట్‌వేర్ విధానాన్ని విధుల్లో అమలు చేసేందుకు ఉన్నతాధికారులు సన్నద్ధమవుతున్నారు. దేశంలో ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్లు చేయించుకునే ఆన్‌లైన్ విధానం అమలు చేయవచ్చు. కొత్త సాఫ్ట్‌వేర్‌తో క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇబ్బందులు కలగకుండా..సౌకర్యవంతమైన సేవలు ఇక అందనున్నాయి. అలాగే ఈ కొత్త విధానంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియల్లో ఇక అక్రమాలకు చెక్ పడనుండడంతో క్రయ విక్రయ దారుల్లో అందోళనలు తొలిగినట్లే. రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో పాత సాఫ్ట్‌వేర్‌ను మార్చేస్తూ, కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమలు కోసం ఈనెల 1 నుంచి 6 వతేది వరకు అన్ని చోట్లా.. రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నుంచి అంటే ఈనెల 7 నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌తోనే రిజిస్ట్రేషన్లు, సేవలు క్రయవిక్రయదారులకు అందనున్నాయి.
దసరా ముందు కావడంతో అవస్థలు..
రిజిస్ట్రేన్ల శాఖకు దసరా పండుగ అంటే పూర్తి డిమాండ్ ఉన్న కాలం. ఈసమయంలోనే భూముల క్రయ విక్రయాలు, బహుమతుల కింద ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాలు జిల్లాలో చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. అయితే కొత్త సాఫ్ట్‌వేర్ మార్పు కారణంగా ఇలా వరుసగా ఆరు రోజులు రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతో క్రయ విక్రయదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి కొత్త వ్యాపారాలు ప్రారంభం కోసం ఆస్తుల అమ్మకాలు, విక్రయాలు చేసే అవకాశాలుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొత్త సాఫ్ట్‌వేర్‌తో మరిన్ని సౌకర్యవంతమైన అవకాశాలుండడంతో కొంతమంది సంతృప్తి వ్యక్తపరుస్తుంటే.. పండుగ ముందు ఇలా చేయడం తగదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే గత నెల 30 మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఈనెల 6 వరకు వరుసగా రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో, ఈనెల 7 నుంచి ఈతాకిడి అధికంగా ఉండే అవకాశముంది. అయితే ఈమేరకు ప్రత్యేక చర్యల ద్వారా రిజిస్ట్రేషన్లను వేగవంతం చేస్తే కాస్తా వెసలుబాటుగా ఉంటుందని క్రయవిక్రయదారులు కోరుకుంటున్నారు.
ఇక తెలుగులోనే ఈసీలు
కొత్త సాఫ్ట్‌వేర్ సేవలు అందుబాటులోకి రానుండడంతో భూముల లావాదేవీల వివరాలు తె లిపే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్లు (ఈసీ) ఇక తెలుగులోనే ఇవ్వనున్నారు. దీంతో ఇంతవరకు ఇంగ్లిష్‌లో ఈసీల కష్టాలు తొలిగిపోనున్నాయి. అలాగే ‘మీసేవ’ వంటి ఆన్‌లైన్ సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమైంది. అలాగే పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇకపై ఇ-పాస్ పుస్తకాలుగా అందించనున్న దృష్ట్యా ఇటు రెవెన్యూ శాఖ, అటు రిజిస్ట్రేషన్ల శాఖలకు మధ్య ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఈకొత్త సాఫ్ట్‌వేర్ కల్గించనుంది.
ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో అన్ని రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లోనూ ఈకొత్త సాఫ్ట్‌వేర్ విధానం అమల్లోకి రానుండడంతోనే ఈనెల 6 వరకు రిజిస్ట్రేషన్ల సేవలు నిలుపుదల చేసామని, ఈనెల 7 నుంచి పూర్తి స్థాయిగా తమ శాఖ సేవలు అందిస్తామని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆ శాఖ డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.సూర్యనారాయణ తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్పారు.
సిబ్బంది బదిలీ
అలాగే జిల్లాలో శాఖ సిబ్బందికి బదిలీలకు ఈనెల 1న కౌన్సెలింగ్ చేశామని, ఈమేరకు మొత్తం 8 మంది జూనియర్ అసిస్టెంట్లను, ఒక షరాఫ్‌ను, 6 గురు అటెండర్లను బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే ఆదేశాలు అందిన రోజే దాదాపుగా సిబ్బంది అంతా రిలీవ్ అయి కొత్త స్థానాల్లో విధుల్లో చేరిపోయారని, అలా చేరని వారుంటే మాత్రం ప్రభుత్వ ఆదేశాలమేరకు జన్మభూమి కార్యక్రమం ముగింపు అంటే ఈనెల 21 తర్వాతే కొత్త బదిలీ స్థానంలో విధుల్లో చేరాలని స్పష్టం చేశారు.