కౌలాలంపూర్: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. భారత్‌లో 26 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 50 వేలకు పైగా మరణించారు. మహమ్మారిని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్‌ను ప్రకటించడమే కాక ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మలేషియాలో వెలుగు చూసిన కొన్ని కరోనా కేసులు ప్రపంచ దేశాలకు మరో నూతన సవాలు విసురుతున్నాయి. తాజాగా మలేషియాలో కరోనా వైరస్ కొత్త జాతిని గుర్తించిన శాస్త్రవేత్తలు, ఇది ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే 10 రెట్లు ప్రమాదకరమైనదిగా వెల్లడించారు. మలేషియాలో తాజాగా వెలుగు చూసిన కొన్ని కేసుల్లో వేగంగా వ్యాప్తి చెందేలా కరోనా వైరస్ మార్పుకు గురయినట్లు సంకేతాలు వెలువడుతున్నాయని అమెరికా అంటువ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు. (కరోనా పడగ నీడలో 200 రోజులు)
ఇలా పరివర్తనం(మార్పు) చెందిన కరోనా వైరస్‌కు ‘డీ614జీ’గా నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి బ్లూమ్‌బర్గ్ ఓ నివేదిక విడుదల చేసింది. మలేషియాలోని ఓ రెస్టారెంట్ యజమాని నుంచి ప్రారంభైన క్లస్టర్‌లో 45 కేసులు వెలుగు చూడగా.. వాటిలో మూడు కేసులలో ఈ ‘డీ614జీ’గా పిలవబడే పరివర్తన కరోనా వైరస్‌ను గుర్తించారు. సదరు రెస్టారెంట్ యజమాని ఇండియా నుంచి మలేషియా వచ్చి.. 14 రోజుల క్వారంటైన్ నిబంధనను ఉల్లంఘించాడు. అతడి రెస్టారెంట్ కేంద్రంగా 45 కేసులు వెలుగు చూడటంతో మలేషియా ప్రభుత్వం అతడికి ఐదు నెలల జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించింది. ఇక బ్లూమ్‌బర్గ్ నివేదికలో హెల్త్ డైరెక్టర్ జనరల్ నూర్ హిషమ్ అబ్దుల్లా ‘కరోనా వైరస్ పరివర్తనానికి(మ్యూటేషన్) గురవుతుంది.
ఫలితంగా వ్యాక్సిన్ల అభివృద్ధికై ఇప్పటి వరకూ ఉన్న అధ్యయనాలు అసంపూర్తిగా లేదా అసమర్థంగా ఉండవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. అంతేకాక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ‘ఎందుకంటే పరివర్తనానికి గురైన కరోనా వైరస్ ప్రస్తుతం మలేషియాలోనే వెలుగు చూసింది. ఈ సంక్రమణ గొలుసును విచ్ఛిన్న చేయాలంటే ప్రజల సహకారం చాలా అవసరం’ అని హిషామ్ ఆదివారం ఫేస్‌బుక్ వేదికగా జనాలను కోరారు. అంతేకకా ఫిలిప్పీన్స్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులతో సంబంధం ఉన్న మరో క్లస్టర్‌లో కూడా ఈ జాతి కనుగొనబడిందన్నారు. (వైరస్ గుట్టు తెలిసింది!)
గత ఏడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ మొదటిసారిగా వెలుగుచూసింది. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు కరోనావైరస్ జన్యు పదార్ధంలో ఉత్పరివర్తనలు, మార్పులను గుర్తించారు. ఐరోపా, అమెరికాల్లో వైరస్ మ్యుటేషన్‌కు గురైనప్పటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ జాతి మరింత తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అదేవిదంగా సెల్ ప్రెస్‌లో ప్రచురితమైన ఒక పత్రిక, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్ల పనితీరుపై మ్యుటేషన్ పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం లేదని నివేదించింది. (సగం పనిచేసే వ్యాక్సిన్ వచ్చినా చాలు)
Comments
Please login to add a commentAdd a comment