సాక్షి, మెదక్: మెదక్ మున్సిపాలిటీ అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తోంది. గతంలో ఆసరా పింఛన్లు, అక్రమ లేఅవుట్ల వంటి పలురకాల కుంభకోణాలు వెలుగుచూడగా.. తాజాగా బల్దియాలోని రెవెన్యూ విభాగం మాయాజాలం బయటపడింది. పట్టణ పరిధిలో లక్షలాది రూపాయలు విలువచేసే ఓ ఇంటికి దొంగచాటుగా మ్యూటేషన్ చేశారు. అధికారులే సూత్రధారులుగా నిలిచిన ఈ వ్యవహారంలో చాలా మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది.
మెదక్ పట్టణ పరిధిలోని వడ్డెర కాలనీలోని ఓ ఖాళీ స్థలంలో ఆరు సంవత్సరాల క్రితం బోదాసు నాగమ్మ అనే మహిళ రేకుల ఇల్లు నిర్మించుకొని జీవిస్తోంది. ఈ భూమికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవు. ఈ క్రమంలో 2012–13లో ఇంటి నంబర్ కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకుంది. అధికారులు పరిశీలించి ఇంటి నంబర్ 1–10–82/1ను కేటాయించారు. ఆ తర్వాత ఆమె కరెంట్ కనెక్షన్ తీసుకుంది. ఈ ఇంటికి మాత్రమే ఆమె కబ్జాదారుగా(ప్రజెంట్ ఆక్యుపై) ఉన్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం ఎలాంటి పత్రాలు లేని ఇల్లు, భూమిని విక్రయించొద్దు. ఆమెకు కేవలం కరెంట్ కనెక్షన్ కోసమే ఇంటి నంబర్ కేటాయించారు.
మరొకరి చేతికి..
మున్సిపాలిటీ రికార్డుల ప్రకారం బోదాసు నాగమ్మ ఆ ఇంటికి కబ్జాదారు మాత్రమే. సదరు భూమి, ఇల్లుకు సంబంధించి ఎలాంటి అమ్మకాలు చేయరాదు. ఇందుకనుగుణంగా ఆమె పెట్టుకున్న అర్జీ మేరకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు మ్యానువల్ రికార్డులో ఆమె పేరుతో ఇంటినంబర్ కేటాయించారు. రికార్డులో ప్రజెంట్ అక్యుపయ్యర్(కబ్జాదారు మాత్రమే) అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో బోదాసు నాగమ్మ నిబంధనలకు విరుద్ధంగా మరో మహిళ గిరిగల్ల సుజాతకు విక్రయించారు.
పేరు తారుమారు.. భారీగా ఆమ్యామ్యాలు
ఈ ఇల్లుకు సంబంధించి మ్యానువల్‌గా బోదాసు నాగమ్మ పేరు ఉండగా.. ఆన్‌లైన్‌లో మాత్రం వేరే వారి పేరు ఉంది. 2016కు ముందు మున్సిపాలిటీ కార్యకలాపాలు మ్యానువల్‌గా సాగేవి. ఆ తర్వాత కంప్యూటరీకరణతో అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. 2012–13లో సదరు ఇల్లు బోదాసు నాగమ్మ పేరు మీద ఉండగా.. 2018కి వచ్చే సరికి ఆన్‌లైన్‌లో ఆ భూమి గిరిగల్ల సుజాత పేరు మీదకు మారింది. ఆన్‌లైన్ రికార్డులను పరిశీలిస్తే 2018 మే 31న ఈ ఇల్లును సుజాత పేరు మీద మార్పిడి చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజెంట్ ఆక్యుపయ్యర్ పేరు మీద ఉన్న ఇంటిని ఇతరుల పేరిట చేయడానికి వీల్లేదు. కానీ.. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వేరే వారి పేరుపై చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది.
ఇలాంటివి ఇంకెన్నో..
మ్యానువల్‌లో నాగమ్మ పేరు ఉండగా.. ఆన్‌లైన్‌లో గిరిగల్ల సుజాత పేరు ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ పరిధిలో విలువైన భూమి కావడం.. దీనికి సంబంధించి లొసుగులు ఉండడంతో మున్సిపాలిటీలో అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు సూత్రధారులుగా వ్యవహరించి అన్నీ చక్కబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయల విలువైన భూమిని ఇతరులకు కట్టబెట్టి వారి నుంచి సుమారు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా.. అలాంటి పత్రాలు లేని ఇళ్లు పట్టణంలో కోకొల్లలు. చాలా ఉన్నట్లు తెలుస్తోంది. అందరిని ప్రజెంట్ ఆక్యుపయ్యర్‌లో పెట్టారు. వీటిలో సైతం ఇలాంటి బాగోతమే నడిచినట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది.
ఎన్నో అనుమానాలు
ఎలాంటి పత్రాలు లేని భూమికి రిజిస్ట్రేషన్ ఎలా అయిందో.. ఎవరు తతంగం నడిపించారో అంతుబట్టని పరిస్థితి ఉంది. పేరు మార్పిడికి సంబంధించి మున్సిపల్ రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా చేశామని చెబుతున్నారు. కానీ.. నిబంధనల ప్రకారం ప్రజెంట్ ఆక్యుపయ్యర్ పేరు మీద ఉన్న ఇంటిని మరొకరి పేరుపై మార్పిడి చేయడానికి వీల్లేదు. ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణ చేపడతాం
మాన్యువల్‌లో ఒకరు, ఆన్‌లైన్‌లోన్‌లో మరో పేరు ఉండడంపై మున్సిపల్ కమిషనర్ వి.సమ్మయ్యను వివరణ కోరగా.. ‘దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment